రేపు సీఈసీ, ఈసీల నియామక చట్టంపై సుప్రీంలో అత్యవసర విచారణ

supreme-courtనవతెలంగాణ – న్యూఢిల్లీ: ముఖ్య ఎన్నికల కమిషనర్‌(సీఈసీ), ఎన్నికల కమిషనర్ల(ఈసీలు) నియామకం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఈ నెల 15వ తేదీన విచారణ చేపడతామని సుప్రీంకోర్టు బుధవారం వెల్లడించింది. సీఈసీ, ఈసీ నియామకం కోసం ఉద్దేశించి ప్యానెల్‌ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కేంద్రం తప్పించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స(ఏడీఆర్‌) అనే ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. తమ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని ఏడీఆర్‌ విజ్ఞప్తి చేసింది. ‘చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్, ఆదర్‌ ఎలక్షన్‌ కమిషనర్స్‌ యాక్ట్‌– 2023’లోని సెక్షన్‌ 7 అమలుపై స్టే విధించాలని కోరింది. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం స్పందించింది. శుక్రవారం విచారణ చేపట్టేందుకు అంగీకరించింది.

Spread the love