మాజీ జడ్జీల వ్యాఖ్యలను వారి అభిప్రాయాలుగానే చూడాలి: సీజేఐ

నవతెలంగాణ – హైదరాబాద్
మాజీ న్యాయమూర్తుల వ్యాఖ్యలను వారి వ్యక్తిగత అభిప్రాయాలుగానే పరిగణించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. వాటికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని తెలిపారు. 1971 నాటి కేశవానంద భారతి కేసులో సుప్రీం కోర్టు తీర్పుపై మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ వ్యాఖ్యలను ఉద్దేశించి జస్టిస్ చంద్రచూడ్ ఈ మేరకు స్పందించారు. భారత చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయిన కేశవానంద భారతి కేసులో సర్వోన్నత న్యాయస్థానం రాజ్యంగం మౌలిక స్వరూపాన్ని వర్ణించిన విషయం తెలిసిందే. ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, ఫెడరలిజం, చట్టబద్ధ పాలన.. భారత రాజ్యంగ మౌలిక భావనలని, వాటిని చట్టాల ద్వారా మార్చే హక్కు పార్లమెంటుకు లేదని కోర్టు అప్పట్లో తీర్పు వెలువరించింది.
కాగా, డిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాజ్యంగ మౌలిక స్వరూపంపై మాజీ ప్రధాని న్యాయమూర్తి, ప్రస్తుత ఎంపీ రంజన్ గొగోయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేశవానంధ భారతి కేసుపై మాజీ సాలిసిటర్ జనరల్ అంధ్యారుజిన రాసిన ఓ పుస్తకం చదివాక తనకు ర్యాజంగ మౌలిక స్వరూపంపై చర్చకు న్యాయపరమైన అవకాశం ఉందని తాను భావిస్తున్నట్టు తెలిపారు. అంతకు మించి తానేమీ చెప్పదలుచుకోలేదంటూ ముగించారు. ఈ నేపథ్యంలో జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన కేసులో మంగళవారం నేషనల్ కాన్ఫరెన్స్ నేత ముహమ్మద్ అక్బర్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబ్బల్ తన వాదనలు వినిపించారు. కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్ర రద్దు చేసిన తీరు ఏరకంగానూ సమర్థనియం కాదని ఆయన స్పష్టం చేశారు. మెజారీటీ ఉంటే ఏదైనా చేయచ్చన్న న్యాయసూత్రం అమల్లో ఉంటే తప్ప ఆర్టికల్ 370 సరికాదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజం గొగోయ్ వ్యాఖ్యలను కూడా ప్రస్తావించారు. ‘‘ఇటీవల మీ కొలీగ్ ఒకరు రాజ్యాంగ మౌలిక స్వరూపంపైనే సందేహాలు లేవనెత్తారు’’ అని చెప్పారు. దీనిపై చీఫ్ జస్టిస్ స్పందించారు. ‘‘కోలిగ్ అంటే.. ప్రస్తుతం మాతో పాటూ ఉన్న సిట్టింగ్ జడ్జిలనే ప్రస్తావించాలి. ఒకసారి ఆ బాధ్యత నుంచి మేము దిగిపోయాక మేము ఏం మాట్లాడినా అది మా వ్యక్తిగత అభిప్రాయమే అవుతుంది. వాటికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు’’ అని వ్యాఖ్యానించారు.

Spread the love