నవతెలంగాణ న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. తెలంగాణకు జస్టిస్ అలోక్ అరదే, ఏపీకి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌ను కొలీజియం సిఫార్సు చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన జస్టిస్ అలోక్ అరదే.. 2009లో అక్కడి హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 2018 నవంబర్ నుంచి కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. జమ్మూకశ్మీర్‌కు చెందిన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ 2013లో అక్కడి హైకోర్టుకు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్‌ను మణిపుర్ హైకోర్టు సీజేగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. అది కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. తాజాగా దాన్ని రద్దు చేసిన కొలీజియం ఆయనను ఏపీ హైకోర్టు సీజేగా సిఫార్సు చేసింది.
తెలుగు రాష్ట్రాలతో పాటు మరో ఐదు రాష్ట్రాలకు ప్రధాన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం సిఫార్సు చేసింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్ పేరును మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సూచించింది. అలాగే ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుభాసిష్ తలపత్ర (ఒడిశా), గుజరాత్ హైకోర్టు జడ్జి జస్టిస్ ఆశిష్ జే దాసాయి పేరును కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా కేంద్రానికి సిఫారసు చేసింది. న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం చేసిన సిఫారసులను రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే న్యాయమూర్తులకు పదోన్నతి లభించనున్నది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం తెలంగాణ, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎస్ వెంకటనారాయణ భట్టిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ కొలీజియం సిఫారసు చేసిన విషయం తెలిసిందే.