మణిపూర్ పై 24గంటల్లో సమాధానం ఇవ్వండి: కేంద్రానికి సుప్రీం కోర్టు ఆదేశం

కేంద్రానికి సుప్రీం కోర్టు ఆదేశం
కేంద్రానికి సుప్రీం కోర్టు ఆదేశం

న్యూఢిల్లీ నవతెలంగాణ: ‘రక్షిస్తే.. దేశంలో ఉన్న మొత్తం ఆడపిల్లలందరినీ రక్షించండి. లేదా, ఎవ్వర్నీ రక్షించకండి.. అని చెబుతున్నారా..? ఇతర రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతోన్న హింసతో దీన్ని పోల్చి చూడలేం. మీ వాదనలపై తర్వాత విచారణ చేపడతాం. ఒకవేళ మణిపుర్‌పై ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి’ అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ పేర్కొన్నారు. మణిపుర్‌లో జాతుల మధ్య చోటుచేసుకుంటున్న ఘర్షణల్లో మహిళలపై జరుగుతోన్న హింస, దారుణాలను సర్వోన్నత న్యాయస్థానం ‘అసాధారణ పరిణామం’గా అభివర్ణించింది. మణిపుర్‌తోపాటు పశ్చిమ బెంగాల్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, కేరళలోనూ మహిళలపై హింస జరుగుతోందని.. దీన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని న్యాయవాది బాన్సురీ స్వరాజ్‌ చేసిన విజ్ఞప్తిపై సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘భారత బిడ్డలను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మణిపుర్‌లో మహిళలపై జరిగిన (మే 4న) దారుణ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత.. ఆ తరహా ఘటనలు పశ్చిమ బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌లోనూ చోటుచేసుకున్నాయి. హవ్‌డాలో పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థిగా ఉన్న ఓ మహిళను వివస్త్రను చేసిన వీడియో, మరోకరిని అలాగే వేధించినప్పటికీ ఎటువంటి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు’ అని న్యాయవాది స్వరాజ్‌ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం.. ‘మహిళలపై నేరాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇది మన సమాజంలో జరుగుతోన్న వాస్తవం. ప్రస్తుతం మణిపుర్‌లో ఊహించని స్థాయిలో జరుగుతోన్న దారుణాల అంశంపైనే విచారణ జరుపుతున్నాం.` అని తెల్చిచెప్పింది.
మణిపుర్‌లో చోటుచేసుకున్న హింసకు సంబంధించి కేసుల వివరాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఎవరెవరిపై ఎన్ని కేసులు నమోదయ్యాయి..? జీరో ఎఫ్‌ఐఆర్‌లు ఎన్ని..? ఇతర పోలీస్‌ స్టేషన్లకు ట్రాన్స్‌ఫర్‌ చేసిన కేసులెన్నీ..? ఇప్పటివరకు ఎంతమందిని అరెస్టు చేశారు..? నిందితులకు అందించిన న్యాయ సహాయ పరిస్థితి ఏంటి..? సెక్షన్‌ 164 కింద ఎంతమంది బాధితుల స్టేట్‌మెంట్‌లను రికార్డు చేశారు..? అంటూ ప్రశ్నలపై ప్రశ్నలు సంధించిన ధర్మాసనం.. వీటికి 24గంటల్లోగా సమాధానాలు చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

Spread the love