మణిపూర్‌లో మహిళా మంత్రి నివాసానికి నిప్పు పెట్టిన ఆందోళనకారులు

నవతెలంగాణ – హైదరాబాద్
వివిధ తెగల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ గత కొన్ని రోజులుగా అట్టుడుకుతోంది. రాష్ట్రంలో నెలన్నర రోజులుగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పట్లో సద్దుమనిగేలా కనిపించడం లేదు. తాజాగా బుధవారం మరోసారి హింస చెలరేగింది. ఇంపాల్ ఈస్ట్‌, కాంగ్‌పోప్కి జిల్లాల స‌రిహ‌ద్దుల్లో ఉన్న‌ అగిజంగ్ గ్రామంలో కాల్పుల ఘ‌ట‌న జ‌రిగింది. తాజా ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా.. మరో పది మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారు. ఇదే సందర్భంలో మణిపూర్ లో ఏకైక మహిళా మంత్రి నివాసానికి ఆందోళన కారులు నిప్పుపెట్టారు. ఇంపాల్ వెస్ట్ ప్రాంతంలో గల రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి నెమ్చా కిపిజెన్ అధికారిక నివాసంపై దాడి చేసి నిప్పంటించారు. ఈ ఘటన బుధవారం సాయంత్రం 6 గంటల తర్వాత జరిగినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఘటన సమయంలో మంత్రి ఇంట్లో లేరని తెలిపారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు, సీనియర్ అధికారులు అక్కడికి చేరుకుని దుండగుల కోసం గాలింపు చేపడుతున్నారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పర్యటన నేపథ్యంలో తీసుకున్న చర్యలేవీ క్షేత్రస్థాయిలో ఫలించలేదు. దీంతో కేంద్రం తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మణిపూర్‌ హింసపై ప్రధాని మోదీ ఇప్పటివరకూ స్పందించలేదని విమర్శిస్తున్నాయి. బీజేపీ స్వార్థ రాజకీయమే జాతుల మధ్య రిజర్వేషన్‌ చిచ్చు రాజేసిందని ఆరోపిస్తున్నాయి. అమాయక పౌరులు చనిపోతున్నా ప్రధాని మోదీ మౌనం వీడకపోవటం దారుణమని పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొల్పటంలో అమిత్‌ షా, రాష్ట్ర సర్కార్‌ పూర్తిగా విఫలమైందని, మణిపూర్‌ హింసకు మోదీ సర్కార్‌ బాధ్యత వహించాలని పేర్కొంటున్నాయి.

Spread the love