నవతెలంగాణ-న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు నిరసన చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే పార్లమెంట్ ప్రారంభోత్సవ వేళ ఆందోళన చేపట్టిన రెజ్లర్లను అడ్డుకున్న ఘటనపై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ శాఖ స్పందించింది. రెజ్లర్ల అరెస్టును యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సమాఖ్య ఖండించింది. ఈ నేపథ్యంలో ఓ ప్రకటన చేసింది. ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్‌పై వచ్చిన ఆరోపణలను తేల్చేందుకు చేపట్టిన దర్యాప్తు కమిటీ రిపోర్టుపై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ బాడీ నిరుత్సాహాన్ని వ్యక్తం చేసింది. 45 రోజుల్లోగా రెజ్లింగ్ సమాఖ్యకు ఎన్నికలు నిర్వహించకుంటే.. అప్పుడు ఆ ఫెడరేషన్‌ను సస్పెండ్ చేస్తామని యూడబ్ల్యూడబ్ల్యూ హెచ్చరిక చేసింది. రెజ్లర్లను అరెస్టు చేసిన తీరును ఖండిస్తున్నామని, రెజ్లింగ్ చీఫ్ బ్రిజ్‌పై విచారణ జరిగిన తీరు కూడా సరిగా లేదని, మరోసారి నిష్పాక్షికంగా విచారణ చేపట్టాలని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య తన ప్రకటనలో కోరింది. రెజ్లింగ్ సమాఖ్య సమావేశాలు నిర్వహించాలని, 45 రోజుల్లోగా కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని, ఒకవేళ ఎన్నికలు నిర్వహించకుంటే ఫెడరేషన్‌ను రద్దు చేస్తామని, అప్పుడు అథ్లెట్లు తటస్థ జెండాపై పోటీల్లో పాల్గొనాల్సి వస్తుందని, ఇప్పటికే ఈ ఏడాది ఢిల్లీలో జరగాల్సిన ఆసియా చాంపియన్‌షిప్‌ను మరో చోటుకు తరలించే నిర్ణయం తీసుకున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు.