నవతెలంగాణ – బిహార్
టమాటాల లోడుతో వెళుతున్న వ్యాన్ బోల్తా పడగా అందులోని టమాటాల కోసం జనం ఎగబడ్డారు. పోలీసులు రంగప్రవేశం చేసి కొంత సరుకును మాత్రం తిరిగి స్వాదీనం చేసుకోగలిగారు. ఈ ఘటన బిహార్‌లో జరిగింది. నేపాల్ నుంచి టమాటాల లోడుతో వెళుతున్న వ్యాన్ ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో బిహార్‌లోని రాంచీ–పట్నా హైవేపై చర్హి వ్యాలీ వద్ద పల్టీ కొట్టింది. డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వ్యాను బోల్తా పడి అందులోని టమాటాలు రోడ్డుపై పడిపోయాయి. టమాటాల ధర కిలో వందల్లో ఉన్న వేళ..ఈ ఘటనతో సమీప గ్రామస్తులకు అనుకోని వరంలా మారింది. వెంటనే అక్కడికి పరుగెత్తుకొచ్చారు. సంచులు, డబ్బాలతో టమాటాలు ఎత్తుకుపోవడం మొదలుపెట్టారు. వ్యాను డ్రైవర్, క్లీనర్ అడ్డుకున్నా వారు లెక్కచేయలేదు. అయితే, ఈ గందరగోళంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని జనాన్ని చెదరగొట్టి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. గ్రామస్తులు ఎత్తుకెళ్లిన టమాటాల్లో చాలా వరకు తిరిగి రాబట్టారు.