నవతెలంగాణ – ముంబయి: మహారాష్ట్రలోని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ (ఎన్‌సిపి)లో చీలిక ఏర్పడింది. ఎన్‌సిపి సీనియర్ నేత అజిత్‌పవార్ తిరుగుబాటు ప్రకటించారు. ఎన్‌సిపికి చెందిన 9 మంది ఎమ్మెల్యేలతో కలిసి మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరారు. ఈ రోజు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్ తో కలిసి డిప్యూటీ సిఎం పదవిని పంచుకోనున్నారు. ఆయనతో పాటు మరో ఎన్ సి పి నేత చుగన్ భుజ్ బల్, దిలీప్ వాల్సే పాటిల్ లు మంత్రులుగా ప్రమాణం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవి నుండి వైదొలగనున్నట్లు అజిత్ పవార్ వ్యక్తం చేసిన కొద్ది రోజులకే ఈ ఘటన జరగడం గమనార్హం. ఆదివారం తెల్లవారుజామున ఎన్‌సిపి ఎమ్మెల్యేల బృందం ముంబయిలోని అజిత్ పవార్‌నివాసంలో సమావేశమైంది. ఎన్‌సిపి వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే, రెండో వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే, సుప్రియా సూలే సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. దిలీప్ వాల్సే పాటిల్, ఛగన్ భుజబల్, ధనంజరు ముండే, అదితి తత్కరే, హసన్ ముష్రిఫ్ వంటి నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షుడు జయంత్ పాటిల్ హాజరుకాలేదు. అయితే ఈ సమావేశం గురించి తనకు తెలియదని ఎన్‌సిపి చీఫ్ శరద్ పవార్ పేర్కొనడం గమనార్హం.