నవతెలంగాణ – సంగారెడ్డి
పిల్లలకు మంచి నడవడిక నేర్పి.. తీర్చిదిద్దాల్సిన పీఈటీ టీచార్ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడంతో గ్రామస్థులు అతడికి దేహశుద్ధి చేశారు. ఈ నేపథ్యంలో పీఈటీతోపాటు ప్రధానోపాధ్యాయుడిని డీఈవో సస్పెండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. స్థానిక ఉన్నత పాఠశాల పీఈటీ సంగ్రాం.. మార్చిలో ముగ్గురు విద్యార్థినులను వేర్వేరుగా పాఠశాల భవనంపైకి తీసుకువెళ్లాడు. ముద్దు పెట్టాలని, లేకపోతే కిందకు తోసేస్తానంటూ భయపెట్టాడు. ఇటీవల పాఠశాల ప్రారంభమైనా.. ఆ బాలికలు స్కూల్కు వెళ్లడం లేదు. పీఈటీ ఉంటే భయంగా ఉందని ఆ బాలికలు తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో కోపోద్రిక్తులైన వారు గ్రామస్థులతో కలసి శుక్రవారం పాఠశాలకు వెళ్లారు. పీఈటీకి దేహశుద్ధి చేసి పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. ప్రధానోపాధ్యాయుడు గురునాథ్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆయనపైనా దాడిచేశారు. సాయంత్రం వరకు పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఇదే సమయంలో బయటి నుంచి వచ్చిన హోంగార్డు ప్రతాప్ సింగ్ గ్రామస్థులను దూషించడంతో వారు అతడిపైనా చేయిచేసుకున్నారు. సంఘటన స్థలానికి డీఈఓ వెంకటేశ్వర్లు, కంగ్టి సీఐ రాజశేఖర్ వచ్చి తల్లిదండ్రులతో మాట్లాడారు. పీఈటీ, హెచ్‌ఎంలను సస్పెండ్ చేస్తూ అక్కడికక్కడే ఉత్తర్వులు జారీచేశారు. పీఈటీపై పోక్సో కేసు నమోదు చేస్తామని, హోంగార్డుపైనా చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.