ఉస్మానియా ఆసుపత్రి నూతన నిర్మాణానికి ఏకాభిప్రాయం

ఉస్మానియా ఆసుపత్రి నూత‌న నిర్మాణానికి ప్ర‌జాప్ర‌తినిధుల ఏకాభిప్రాయం

నవతెలంగాణ హైద‌రాబాద్ : ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రి నూతన నిర్మాణానికి ప్రజాప్రతినిధుల ఏకగ్రీవ ఆమోదం లభించిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు తెలిపారు. ఉస్మానియా ఆస్ప‌త్రి నూత‌న నిర్మాణ అంశంపై ఆస్ప‌త్రి పరిధిలోని ప్రజా ప్రతినిధులతో మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో సచివాలయంలో స‌మావేశం నిర్వ‌హించారు. ప్రజల వైద్య అవసరాల కోసం పాత భవనాలు తొలగించి అయినా నిర్మాణాలు చేపట్టాలని ఈ సంద‌ర్భంగా ప్ర‌జాప్ర‌తినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిశీలించి, అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు తెలియ చేస్తుందని మంత్రి తెలిపారు. హైకోర్టు నుండి అనుమతి రాగానే వెంటనే నూతన భవన నిర్మాణం చేపడతామని మంత్రి వెల్లడించారు.
ఉస్మానియా ఆస్ప‌త్రి నూతన భవనం నిర్మించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని తెలిపిన హరీశ్ రావు… ప్రజల భవిష్యత్ అవసరాలు తీర్చేందుకు ఇప్పటికే నాలుగు టిమ్స్, నిమ్స్ విస్తరణ, సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్‌ల నిర్మాణం చేపట్టిందని ఈ సందర్బంగా గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ 2015 లోనే ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించి, కొత్త భవన నిర్మాణానికి ఆదేశించినట్టు మంత్రి గుర్తు చేశారు. తదనంతరం నిర్మాణం కూల్చవద్దని కొందరు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టుస్టే ఇచ్చిందని తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు వేసిన ఐఐటి హైదరాబాద్ నిపుణుల కమిటీ కూడా ఆస్ప‌త్రి అవసరాలకు ఈ భవనం పని చేయదని చెప్పిందని వివరించారు. తదుపరి కోర్టు ఆదేశాల ప్రకారం సోమ‌వారం ఆస్ప‌త్రి పరిధిలోని ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించి, అభిప్రాయాలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. కొత్త భవనం నిర్మాణానికి ప్రజాప్రతినిధులు అందరూ ఏకగ్రీవంగా అంగీకరించడం సంతోషకరం అన్నారు. హైకోర్టు తుది తీర్పు మేరకు కొత్త నిర్మాణం త్వరలో చేపడతామని హ‌రీశ్‌రావు తెలిపారు. ఈ స‌మావేశంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్సీలు ప్రభాకర్ రావు, వాణీ దేవి, రహమత్ బెగ్, హసన్ ఎఫెండి, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్, దానం నాగేందర్, గోపీనాథ్, జాఫర్ హుస్సేన్, కౌసర్ మోయినుద్దీన్, హెల్త్ సెక్రెటరీ రిజ్వి, సీఎం ఓఎస్డీ గంగాధర్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఛైర్మ‌న్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఈఎన్‌సీ గణపతి రెడ్డి, ఉస్మానియా ఆస్ప‌త్రి సూపరింటెండెంట్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Spread the love