ఇన్‌కం కోసం ఇక్కట్లు

– తహసీల్దారు కార్యాలయాలకు తండోప తండాలుగా..
– ‘రూ.లక్ష’ లబ్ది కోసం చేతివృత్తిదారుల కష్టాలు
–  ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల కోసం ఎగబడిన దరఖాస్తుదారులు
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి/ కార్పొరేషన్‌
– కుల వృత్తులకు వైభవం తీసుకొస్తాం
– ‘బీసీలకు ఆర్థిక సాయం’పై మంత్రి గంగుల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

చేతి వృత్తిదారులు, కుల వృత్తిదారులు ఇన్‌ కం సర్టిఫికెట్ల కోసం అష్టకష్టాలు పడుతున్నారు.. తహసీల్దార్‌ కార్యాలయాలకు పెద్దఎత్తున తరలివస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కులవృత్తులు, చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వెనుకబడిన తరగతుల వారికి ప్రభుత్వం రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం పథకానికి శ్రీకారం చుట్టిన విషయం విదితమే. దాని కోసం బీసీలు కుల, ఆదాయ సర్టిఫికేట్ల కోసం బారులు తీరారు. తహసీల్దారు కార్యాలయాలకు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. దీనిలో భాగంగా ఖమ్మం జిల్లాలోని పలు తహసీల్దారు కార్యాలయాలు దరఖాస్తుదారులతో కిటకిటలాడుతున్నాయి. ఖమ్మం అర్బన్‌, ఖమ్మం రూరల్‌ కార్యాలయాలకు సోమవారం మూడు వేలమంది వరకూ దరఖాస్తుదారులు రావటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం.
దరఖాస్తులతో వృత్తిదారులు..
కుల, ఆదాయ సర్టిఫికెట్ల కోసం వెనుకబడిన తరగతుల వారు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో నాయకుల విజ్ఞప్తి మేరకు ప్రత్యేక ఆన్‌ లైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు నగరంలోని కార్పొరేటర్లు తమ డివిజన్ల పరిధిలోని వాట్సప్‌ గ్రూపులలో మెసేజ్‌ చేశారు. మంత్రి పువ్వాడ అజరు కుమార్‌ ఆదేశాల మేరకు ఖమ్మం అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ప్రత్యేక ఆన్‌లైన్‌ కేంద్రం ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. బీసీ వృతిదారులు రూ.లక్ష ఆర్థిక సహాయ పథకాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ధ్రువీకరణ పత్రాలను పొందాల్సిందిగా సూచించారు.
దాని కోసం జనం ఒక్కసారిగా తహసీల్దార్‌ కార్యాలయానికి క్యూ కట్టారు. అరకొర సిబ్బంది ఉన్న కార్యాలయంలో వేలాదిగా జనం తరలిరావడంతో ప్రక్రియ కోసం ఏర్పాటు చేసిన కౌంటర్లు కిటకిటలాడాయి. లబ్ది పొందేందుకు ఈనెల 20వ తేదీ చివరి గడువు కావడంతో దరఖాస్తుదారులు భారీగా తరలివచ్చారు. ఖమ్మం అర్బన్‌, రూరల్‌ కార్యాలయాలకు భారీగా వృత్తిదారులు రావడంతో తహసీల్దార్‌ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాక్సుల్లో దరఖాస్తు వేయాల్సిందిగా తహసీల్దారు సూచించారు.
వారాలు గడుస్తున్నా అందని ధ్రువీకరణ పత్రాలు
రోజులు, వారాలు గడుస్తున్నా తహసీల్దార్‌ కార్యాలయంలో కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం లేదని బాధితులు వాపోతున్నారు. నెలరోజుల కిందట మీ సేవల్లో దరఖాస్తు చేసుకున్న వారు సైతం సోమవారం నాటి స్పెషల్‌ డ్రైవ్‌కు రావడం గమనార్హం. మీ సేవలో దరఖాస్తుకు రూ.45 తీసుకుంటే, ఇక్కడ రూ.50 తీసుకున్నా సకాలంలో పని కావడం లేదని వాపోతున్నారు. ఇదేమంటే సిబ్బంది కొరతను సాకుగా చూపుతున్నట్టు చెబుతున్నారు. గట్టిగా ప్రశ్నిస్తే మరి కొన్ని రోజులు కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు.
అర్హులు ఎవరు?
బి.సి. కార్పొరేషన్‌ నుంచి రుణాలు పొందేందుకు ప్రస్తుతం కొన్ని కులాల వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. నాయీ బ్రాహ్మణులు, రజకులు, సగర ఉప్పర, కుమ్మరి/శాలివాహన, అసుల, కంసా లి, కమ్మరి, కంచరి, వడ్రంగి, క్రిష్ణ బలి పూసల, మేదర, ఆరెకటిక, మేర, యం.బి.సి, అత్యంత వెనుకబడిన కులాలకు చెందిన సంచార జాతులు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 16 ప్రకారం అర్హులుగా నిర్దేశించారు. బాలసంతు, బహురూపి, బుడబుక్కల, దాసరి, దొమ్మర, గంగిరెడ్లవారు, జంగం, జోగి, కాటిపాపల, మొండివారు, మొండిబండ, బండ, వంశరాజ్‌, పిచ్చిగుంట్ల, పాముల, పార్థి (నిర్శికారి), పంబల, పెద్దమ్మవాండ్లు, దేవర వాండ్లు, ఎల్లమ్మ వాండ్లు, ముత్యాలమ్మవాండ్లు, దమ్మలి, వీరముష్టి (నేట్టికోతల), వీరభద్రియ, గుడాల, కన్జర-భట్ట, కేప్మర / రెడ్డి, మున్దేపట్ట, నొక్కార్‌, పరికి ముగ్గుల, యాట, చోపెమారి, కైకడి, జోసినందివాలాస్‌, మందుల, కునపులి, పత్ర, పల-ఎకరి, ఎకిల, వ్యాకుల, ఎకిరి, నాయని వారు, పాలేగారు, తొలగరి, కావలి, రాజన్నల, బుక్క అయ్యవారు, గోత్రాల, కసికపడి / పసికపుడి, సిద్దుల, సిక్లిగర్‌ సైక్లగర్‌ ఇలా 35 కులాలను అర్హులుగా సూచించారు. తమని దీనిలో చేర్చకపోవడంపై పద్మశాలీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
బాక్స్‌లో వేయండి..మేము చూసుకుంటాం..
గంటల తరబడి వేచిచూశాక ఖమ్మం అర్బన్‌ తహసీల్దారు శైలజ బయటకు వచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాక్సుల్లో దరఖాస్తులు వేసి వెళ్లాలని సూచించారు. దాంతో జనం దరఖాస్తులు పెట్టెల్లో వేసి వెళ్లారు. రెండు మూడు వారాల కిందట డబ్బాలో వేసి వెళ్లిన దరఖాస్తులకే ఇప్పటివరకు అతీగతి లేదని, ఇక వీటి పరిస్థితి ఏంటో అంటూ బాధితులు వెనుదిరిగారు. దరఖాస్తుల తర్వాత నగరపాలక సంస్థలో అన్ని ఆధారాలను పొందుపరిచి జీరాక్స్‌ సెట్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి అర్హులని ఎంపిక చేస్తారు.
అర లక్ష దాటిన దరఖాస్తులు
వెనుకబడిన వర్గాల కులవృత్తులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం కోసం ఇప్పటివరకూ 53 వేల దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదయ్యాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రావెంకటేశం ఇతర ఉన్నతాధికారులతో కలిసి సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో మంత్రి ఇదే అంశంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కులవృత్తులకు మంచి వైభవం తీసుకొచ్చి వారి జీవితాలను మెరుగుపరుచుటమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కులవృత్తికి ఉపయోగపడే ముడిసరుకు, పనిముట్ల కొనుగోలు కు బ్యాంకు లింకేజీ లేకుండా, తిరిగి చెల్లించే అవసరం లేకుండా రూ. లక్షను ప్రభుత్వం అందజేస్తుందని వివరించారు. ఈనెల 20 వరకు ఆన్‌ లైన్‌ ద్వారాhttps://tsobmms.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు, ఆదాయ పత్రాలు 2021 ఎప్రిల్‌ నుంచి జారీ చేసినవి చెల్లుబాటవుతాయని తెలిపారు. జిల్లా కలెక్టర్లు సైతం అవస రార్థుల ఆదాయ సర్టిఫికెట్ల జారీపై ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచిం చారు. దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. చాలా సరళంగా ఉన్న దరఖాస్తు ఫారాన్ని స్మార్ట్‌ ఫోన్ల నుంచి కూడా సమర్పించవచ్చని సూచించారు.
బీసీ హాస్టళ్ల అడ్మిషన్లకు వెబ్‌సైట్‌ ప్రారంభం
రాష్ట్రంలోని 703 బీసీ ప్రీమెట్రిక్‌, పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్లలోని సీట్లను ఇకనుంచి ఆన్‌లైన్‌ ద్వారానే భర్తీ చేస్తామని మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. ఇందుకు సంబందించిన వెబ్‌సైట్‌ https://bchostels.cgg.gov.in ను సచివాలయంలో సోమవారం ఆయన అధికారికంగా ప్రారంభించారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఈ విధానాన్ని అందు బాటులోకి తెచ్చామన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫారాన్ని సమర్పించగానే ఎవరి ప్రమేయం లేకుండా వివరాలు వెరిఫికేషన్‌ చేసుకుని ప్రవేశానికి అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. ఈ సమీక్షలో టాడీ టాపర్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మెన్‌ పల్లె రవి, బీసీ సంక్షేమ శాఖ డీడీ సంధ్య ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Spread the love