– సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం
– దశాబ్ది ఉత్సవాల సంబురం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదేండ్లు అవుతున్న సందర్భమిది. 2 జూన్ 2014 నాటి నుంచి తెలంగాణ పాలనకు అడుగులు పడితే… అధికారిక లెక్కల ప్రకారం అప్పటి నుంచి ఇప్పటిదాకా సంక్షేమ, అభివృద్ధి రంగాల్లో రాష్ట్ర ప్రగతి ఎలా ఉందో సమీక్షించుకోవాల్సిన సమయమిది. ఈ పదేండ్ల ప్రగతి ప్రస్థానంలో తెలంగాణ అనేకాంశాల్లో పురోగమిస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. లక్షలాది నిరుపేద కుటుంబాలు… ఈ కాలంలో అమల్లోకి వచ్చిన వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా గతం కంటే కొంత మెరుగైన ప్రయోజనాలు పొందుతున్నాయి. ఈ క్రమంలో సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ మరింత ముందుకెళ్లాలన్నది ప్రజల ఆకాంక్ష.
అనేక పోరాటాలు, బలిదానాల ఫలితంగా 2014 జూన్ 2న సాకారమైన తెలంగాణ రాష్ట్రం… శుక్రవారం (2 జూన్ 2023) నాటికి తొమ్మిదేండ్లను పూర్తి చేసుకుని.. పదో వసంతంలోకి అడుగిడుతున్నది. ఈ క్రమంలో సంక్షేమ రంగంలో పలు క్రియాశీలక నిర్ణయాలు, పథకాలతో పేదల జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వెలుగులు నింపిన మాట వాస్తవం. మొత్తం 3.5 కోట్ల జనాభా ఉన్న మన రాష్ట్రంలో 44,12,882 మందికి ప్రతీ నెలా ఆసరా పెన్షన్లు అందుతున్నాయి. వీటితోపాటు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రీషన్ కిట్, గొర్రెలు, బర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ, ఆత్మ గౌరవ భవనాలు, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలతోపాటు సెలూన్లకు ఉచిత విద్యుత్ సరఫరా, గిరిజన తాండాలకు గ్రామ పంచాయతీల హోదా, గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, బ్రాహ్మణ విద్యార్థులకు ఉన్నత విద్య కోసం విదేశీ విద్యా పథకాలు, మిషన్ భగీరథ, కాకతీయ లాంటి ప్రతిష్టాత్మక పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయి.
రైతు బంధు, రైతు బీమా పథకాలు, పంట రుణాల మాఫీ, ఇన్‌పుట్ సబ్సిడీలు, ఉచిత విద్యుత్, గోదాముల నిర్మాణం, సకాలంలో ఎరువులు, విత్తనాలు, సబ్సిడీ విత్తనాల సరఫరాతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా తెలంగాణ ‘సాగును’ సర్కారు ముందుకు తీసుకెళుతోంది.
ఆర్థికాభివృద్ధికి పారిశ్రామికీకరణ ప్రధాన వ్యూహమని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం… ఆ రంగంలో జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించటంపై ప్రధానంగా దృష్టి సారించింది. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల్లో కూడా ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేందుకు, వాటిని సృష్టించేందుకు శ్రీకారర చుట్టింది. ఇందుకోసమే నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించి అమలు చేసింది. రీసెర్చి టూ ఇన్నోవేషన్ (పరిశోధన నుంచి ఆవిష్కరణ), ఇన్నోవేషన్ టూ ఇండిస్టీ (ఆవిష్కరణల నుంచి పరిశ్రమ), ఇండిస్టీ టూ ప్రాస్పరిటీ (పరిశ్రమ నుంచి శ్రేయస్సు) అనే లక్ష్యాలతో ఇన్నోవేటివ్, ఇంక్యుబేట్, ఇన్‌కార్పొరేట్ అనే నినాదాలతో ‘నూతన పారిశ్రామిక విధానం-2015’ను రూపొందించి, అమలు చేస్తున్నారు. దీంతో పారిశ్రామిక అనుమతులు సులభతరమై పరిశ్రమల స్థాపనలో అనవసరమైన అడ్డంకులు తొలగిపోయాయంటూ ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. నేటి దశాబ్ది ఉత్సవ సంబురాల సమయంలో సంక్షేమ రంగంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వమే అనేక రంగాల్లో రాష్ట్రానికి పలు అవార్డులు, రివార్డులు ప్రకటించింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల వేళ రాష్ట్రం మరింత నిబద్ధతతో ప్రగతిశీలకంగా, అభ్యుదయ పథంలో పయనించాలని కోరుకుందాం.