వరంగల్లు గరం..గరం..

– కడియం శ్రీహరి, రాజయ్య మధ్య ఆరని మంటలు
– సీనియర్‌ నేతల మధ్య లేని సఖ్యత
– బీఆర్‌ఎస్‌లో టికెట్ల లొల్లి, విభేదాలతో సతమతం
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీలో అంతర్గత విభేధాలు రచ్చకెక్కుతున్నాయి. ఆశావహులు ఒకవైపు, ప్రజావ్యతిరేకత మరోవైపు బహిర్గతమవుతున్నది. పార్టీ టికెట్‌ల కోసం ఆశావహులు వ్యూహ ప్రతివ్యూహాలతో పావులు కదుపుతున్నారు. దాంతో అన్ని రాజకీయ పార్టీల కంటే కారు పార్టీలోనే రాజకీయం వేడెక్కింది. ఏ నియోజకవర్గంలో చూసినా ఇదే పరిస్థితి.
స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. దాంతో ఈ వివాదంపై మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ ‘తాటికొండ’ను పిలిచి మరీ క్లాస్‌ తీసుకున్నారు. ఇప్పటికే వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటున్న సంఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయి. ఇప్పుడు ఏకంగా ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలకు దిగడం గమనార్హం. ఇలా ఇద్దరి మధ్య రాబోయే ఎన్నికల్లో టికెట్‌ విషయమై గొడవలు జరుగుతున్నాయి. కాగా, ఇలాంటివి మళ్లీ పునరావృతమైతే ఎవరినీ ఉపేక్షించమని హెచ్చరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలోని మహబూబాబాద్‌, డోర్నకల్‌, ములుగు నియోజకవర్గాల్లోనూ అధికార బీఆర్‌ఎస్‌లో పార్టీ నేతల మధ్య తీవ్ర విభేధాలున్నాయి. మహబూబాబాద్‌లో ఎంపీ కవిత పార్టీ టికెట్‌ ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే డోర్నకల్‌ నియోజకవర్గంలో సీనియర్‌ ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌ను తండాల్లో అభివృద్ధి పనులపై స్థానికులు నిలదీస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి మంత్రి సత్యవతి రాథోడ్‌ పార్టీ టికెట్‌ ఆశిస్తున్నారు. జనగామ నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కుటుంబ వ్యవహారాలు రచ్చకెక్కాయి. మరోపక్క ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేయాలని అన్ని ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
మానుకోటలో సిట్టింగ్‌కు ఎసరు..
మహబూబాబాద్‌ (ఎస్టీ) నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్‌ అనుసరిస్తున్న విధానాలు, ప్రవర్తనపై పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌, ఎంపీ కవితల మధ్య రాజకీయ విభేధాలున్నాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌కు పార్టీ టికెట్‌ ఇవ్వొద్దని, కొత్తవారికి ఎవరికి ఇచ్చినా గెలిపిస్తామని పార్టీ నేతలు రహస్య సమావేశం నిర్వహించి ప్రకటించడం చర్చనీయాం శంగా మారింది. ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ ఎవరితోనూ సఖ్యతతో ఉండకపో వడం కూడా వివాదాలకు కారణమవుతోంది. మంత్రికి, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌, ఎంపీి కవితల మధ్య సయోధ్య లేకపోవడం పార్టీకి నష్టదాయకంగా పరిణమించింది.
డోర్నకల్‌లో నిరసనలు..
డోర్నకల్‌ నియోజకవర్గం (ఎస్టీ)లో సీనియర్‌ ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌కు గతంలో ఎన్నడూ లేనంతగా నిలదీతలు ఎదురవుతున్నాయి. కురవి, సీరోల్‌, మరిపెడ మండలాల్లో ఆయన ఇటీవల పర్యటించిన తండాల్లో స్థానికులు నిలదీయడం చర్చనీయాంశంగా మారింది. నిలదీసిన వృద్ధురాలి వృద్ధాప్య పింఛను తొలగించాలని ఆదేశించడం కూడా వివాదస్పదంగా మారింది. డోర్నకల్‌ నియోజకవర్గం నుంచి పార్టీ టికెట్‌ను మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆశిస్తున్నారు. తాజాగా తనను కలిసిన ఆత్మీయులతో సీఎం చేయమంటే డోర్నకల్‌ నుండే పోటీ చేస్తానని వ్యాఖ్యానించడం గమనార్హం. తనను ఓడించడానికి పార్టీలోని వారే ప్రయత్నిస్తున్నారని రెడ్యానాయక్‌ పరోక్షంగా మంత్రిపై ఆరోపణలు చేయడమూ చర్చనీయాంశంగా మారింది. గతంలో సత్యవతి రాథోడ్‌ టీడీపీ అభ్యర్థిగా డోర్నకల్‌ నుండి ఎమ్మెల్యేగా ఒక పర్యాయం గెలిచారు.
ములుగులో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎవరు?
ములుగు నియోజకవర్గం(ఎస్టీ)లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎవరనేది నేటికీ తేలలేదు. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికీ ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఎవరినీ నియమించకపోవడంతో ఆశావహులు సైతం అసంతృప్తితో ఉన్నారు. ములుగు జెడ్పీ చైర్మెన్‌, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు కుసుమ జగదీశ్‌ అనారోగ్యంతో మృృతిచెందడంతో పార్టీ వ్యవహారాలు స్తబ్ధుగా ఉన్నాయి. జెడ్పీ ఇన్‌చార్జి చైర్‌పర్సన్‌గా వైస్‌చైర్మెన్‌గా ఉన్న బడే నాగజ్యోతి కొనసాగుతున్నారు. మహబూబాబాద్‌ జిల్లాకేంద్రంలో మంత్రి కేటీఆర్‌ పర్యటనలో స్వయంగా వేదికపై బడే నాగజ్యోతిని ముందుకు వచ్చి కూర్చోవాలని కోరారు. దాంతో వచ్చే శాసనసభ ఎన్నికల్లో పార్టీ టికెట్‌ నాగజ్యోతికే ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇంకా మాజీ ఎంపీ సీతారాంనాయక్‌తోపాటు పోరిక గోవింద్‌నాయక్‌, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ అప్పయ్య టికెట్‌ ఆశిస్తున్నారు. కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యే సీతక్క బలమైన నాయకురాలు కావడంతో ఆమెకు దీటైన అభ్యర్థి కోసం పార్టీ అన్వేషిస్తుందని సమాచారం. తొలుత సీతక్కను బీఆర్‌ఎస్‌లో చేర్చుకునే ప్రయత్నాలు చేసినా అవి కొలిక్కిరాలేదు.
జనగామలో ‘ముత్తిరెడ్డి’ కుటుంబ కలహాలు
జనగామ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై స్వయానా కూతురే భూ కబ్జా ఆరోపణలు చేయడం అధికారపార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఇదే క్రమంలో కొన్ని నెలలుగా నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తనదైన శైలిలో చాప కింద నీరులా నెట్‌వర్క్‌ను విస్తరింపచేసుకున్నారు. అందరికీ నిత్యం టచ్‌లో ఉంటూ.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఇవ్వడం, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ఇప్పించడం, మంత్రి కేటీఆర్‌కు సన్నిహితుడిగా పేరుండటంతో వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ‘పోచంపల్లి’ అని ప్రచారం జరుగుతోంది.

Spread the love