మీరే దోపిడీ దొంగలు… బందిపోటు దొంగల కంటే హీనం

– కాళేశ్వరానికి రూ.85 వేల కోట్లు బిల్లులు చెల్లించలేదా? :మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులకు రేవంత్‌రెడ్డి సూటి ప్రశ్న
– రాహుల్‌ను ప్రశ్నించడానికి మీకున్న అర్హత ఏంటి?
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ రావు దోపిడీ దొంగలనీ, బందిపోటు దొంగలకంటే హీనమని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి విమర్శించారు. రూ.38 వేల కోట్లతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పేరు డిజైన్‌ మార్చి బడ్జెట్‌ను రూ.1,49,131 కోట్లకు పెంచారని గుర్తుచేశారు. కాళేశ్వరానికి రూ.85 వేల కోట్ల బిల్లులు చెల్లించలేదా? అని ప్రశ్నించారు. మూడో టీఎంసీ కోసం రూ.25,831 కోట్ల బడ్జెట్‌ కేటాయించారని తెలిపారు. ప్రతి ఏటా రూ.25 వేల కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వానిదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ వనరులను మింగే తెల్ల ఏనుగు అని కాగ్‌ నివేదికనే వెల్లడించిందని రేవంత్‌ వివరించారు. ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు 64 వేల ఎకరాలే సేకరించారనీ, మరో 20 వేల ఎకరాలు సేకరించాల్సి ఉందని తెలిపారు. చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్‌, హరీశ్‌రావు కాగ్‌ నివేదికపై చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాహుల్‌ గాంధీని విమర్శించడమంటే హరీష్‌, కేటీఆర్‌ ఒకరిపై ఒకరు కాండ్రించి ఉమ్మేసుకున్నట్టే అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఖమ్మంలో కాంగ్రెస్‌ సభను చూసైనా బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. రాహుల్‌ సభను విఫలం చేసేందుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. జనగర్జన సభకు రాకుండా బీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు, అక్కడి సైకో మంత్రి జనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని తెలిపారు. అన్ని ఆటంకాలను దాటుకుని విజయవంతం చేసిన ఖమ్మం ప్రజలకు, నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
అసలు నక్క తప్ప వేట కుక్కలన్నీ బయటకు వచ్చి మొరగడం మొదలు పెట్టాయని రేవంత్‌ విమర్శించారు. ఏ హౌదాలో రాహుల్‌ ఇక్కడికి వచ్చారని ప్రశ్నిస్తున్నారంటూ, రాహుల్‌ గాంధీది వారిలా దోపిడీ కుటుంబం కాదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ కుమారుడు, దేశం కోసం సర్వం త్యాగం చేయడానికి భారత్‌ జోడో యాత్రతో ప్రజల్లోకి వచ్చిన నాయకుడు రాహుల్‌కు కాకుండా ఇంకెవరికి తెలంగాణలో పర్యటించే అర్హత ఉందని? ఎదురు ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ అంటకాగుతున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అర్హత ఉందా? రాహుల్‌ పర్యటనపై ప్రశ్నించడానికి అసలు మీకున్న అర్హత ఏంటి? అంటూ ప్రశ్నలు వేశారు. కడుపుకు అన్నం తినే వారెవరూ రాహుల్‌ అర్హత గురించి ప్రశ్నించరంటూ మండిపడ్డారు.
హామీలు నెరవేర్చిన పార్టీ కాంగ్రెస్‌
”ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన పార్టీ కాంగ్రెస్‌. కాంగ్రెస్‌ ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోలేదో బీఆర్‌ఎస్‌ నేతలు చెప్పాలి.ఎన్నో పథకాలు, ఎన్నో చట్టాలు, ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు తీసుకొచ్చింది. 1లక్ష 7 గ్రామాలకు విద్యుత్‌ అందించింది. పేదలందరికి విద్యను అందుబాటులోకి తీసుకొచ్చిన పార్టీ. ప్రభుత్వరంగ సంస్థలను నెలకొల్పి కోట్లాది మందికి ఉద్యోగ, ఉపాధి కల్పించింది. నగరానికి ఆదాయం తెచ్చే ఔటర్‌, ఐటీ తెచ్చింది…. ” అంటూ వివరించారు. ఫామ్‌హౌస్‌ లు, పేపర్‌, టీవీలు పెట్టుకోవడం తప్ప బీఆర్‌ఎస్‌ తెచ్చిందేంటో? చెప్పాలని ప్రశ్నించారు.
ప్రతిపక్షాల సమావేశానికి బీఆర్‌ఎస్‌కు నో ఎంట్రీ
బెంగుళూరులో జరగబోయే ప్రతిపక్షాల సమావేశానికి బీఆర్‌ఎస్‌ను రానివ్వమని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.
ఒకవేళ సిగ్గులేకుండా వచ్చినా మెడలు పట్టి గెంటేస్తామని హెచ్చరించారు. బీజేపీ రిస్తాజార్‌ సమితి అయిన బీఆర్‌ఎస్‌ను తమతో కలుపుకునే ప్రసక్తి లేదని తెలిపారు. తమ విధానమేంటో చెప్పాం…ఇక బీఆర్‌ఎస్‌ పార్టీ విధానమేంటో చెప్పాలని ప్రశ్నించారు. రూ.4 వేల పెన్షన్‌కు కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందనీ, సీఎం కేసీఆర్‌ అవినీతిని ఆపితే చాలు… మొత్తం రూ.55 లక్షల మంది పెన్షన్‌ దారులకు పెన్షన్‌ ఇవ్వొచ్చని తెలిపారు. రాష్ట్ర జనాభా అవసరాలు, పరిస్థితులను బట్టి పథకాలు ఉంటాయంటూ, రాష్ట్రంలో తమ ప్రాధాన్యత పెన్షన్‌ రూ.4 వేలని స్పష్టం చేశారు. తమపై ఈడీ దాడులు జరగకుండా ఆపుకునేందుకే కేటీఆర్‌ కేంద్రంలో పెద్దలను కలిశారని ఆరోపించారు. ఏపీలో పోటీ చేస్తామంటున్న బీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ ప్రజలకు ఏమి చెబుతుందని ప్రశ్నించారు.
దళితులను అవమానించిన బీఆర్‌ఎస్‌
దళితుడే సీఎం అనీ, వర్గీకరణకు సహకరించ కుండా దళితులను అవమానించిన పార్టీ బీఆర్‌ఎస్‌ అని రేవంతరెడ్డి విమర్శించారు. చదువుకున్న ప్రజా ప్రతినిధి మల్లు భట్టి విక్రమార్క అని తెలిపారు. భట్టిని దళితుడని చిన్నచూపు చూసే బీఆర్‌ఎస్‌ నేతల మూతులపై కొట్టాలని పిలుపునిచ్చారు.

Spread the love