హస్తినలో తెలంగాణ రాజకీయం

– కాంగ్రెస్‌, బీజేపీ నేతల వ్యూహరచన
– ఇరుపార్టీల నేతలూ ఢిల్లీలో మకాం
– ఆఘమేఘాల మీద ఢిల్లీకి బండి
– ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఏఐసీసీ పిలుపు
– అమిత్‌షాతో మంత్రి కేటీఆర్‌ రహస్య భేటీ!
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో ఎన్నికల హడావిడి షురూ అయింది. ‘హస్తిన’ సాక్షిగా తెలంగాణ రాజకీయం సాగుతున్నది. ఇటు కాంగ్రెస్‌…అటు బీజేపీ అధిష్టానాలు తమ ముఖ్యనేతలను ఢిల్లీకి పిలిచి మరీ వ్యూహరచనలు చేస్తుండటంతో పొలిటికల్‌ హీట్‌ రోజురోజుకీ పెరుగుతున్నది. నేతల హాట్‌హాట్‌ కామెంట్లు, చేరికల హడావిడిలు, పిలుపులు, ఒకరిపై మరొకరి ఫిర్యాదులు, అధిష్టానాల మందలింపులు, గోడదూకడాలు వంటి రాజకీయ పరిణామాలతో గడియగడియకూ ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. బీఆర్‌ఎస్‌ మంత్రులు కూడా హస్తినలో కేంద్ర పెద్దలను కలవటంపైనా రాజకీయంగా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
రేవంత్‌ బృందంతో సుదీర్ఘ చర్చలు
కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైన పొంగులేటి, జూపల్లితో చర్చించేందుకు రేవంత్‌ నేతృత్వంలో ఓ బృందం ఢిల్లీ వెళ్లింది. ఈ సందర్భంగా రానున్న ఎన్నికలు, చేరికలు, బహిరంగసభలు, ఎన్నికల్లో అనుసరించాల్సిన పద్ధ్దతులపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ రాష్ట్రంపై ఫోకస్‌ చేశారని ఆ వర్గాలు చెప్పాయి. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలపై అధిష్టానం సీరియస్‌ అయినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా, రానున్న ఎన్నికల్లో పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత మధుయాష్కీ గౌడ్‌ ఢిల్లీలో చెప్పారు. టికెట్ల విషయంలో అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
మంత్రి కేటీఆర్‌ ఇప్పుడే కేంద్రమంత్రులను ఎందుకు కలిశారు?
మంత్రి కేటీఆర్‌ ఉన్నట్టుండి ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలవడం కూడా ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చుతున్నాయి. ఆయన పర్యటనలో మరో ఆసక్తిరమైన చర్చ చోటు చేసుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, మంత్రి కేటీఆర్‌కు అపాయింట్‌మెంట్‌ ఇచ్చినట్టు ప్రచారమైంది. వెనువెంటనే అమిత్‌షా అపాయిట్‌మెంట్‌ రద్దు అయినట్టు తెలియజేశారు.
బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటే అన్న ప్రచార నేపథ్యంలో బహిరంగంగా అపాయింట్‌మెంట్‌ రద్దు చేసి, రహస్యంగా భేటీ అయ్యారనే ప్రచారం జరుగుతున్నది. ఆ తర్వాతనే బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేయడంలో బీజేపీ నేతల నోర్లు మూతపడ్డాయని కాంగ్రెస్‌ ఆరోపిస్తున్నది. కాంగ్రెస్‌, బీజేపీ నేతలు హస్తిన వేదికగా రాజకీయాలకు పదును పెడుతున్నారు.
ఒకవైపు బీఆర్‌ఎస్‌ ఢిల్లీ రాజకీయం నడుపుతూనే…రాష్ట్రంలోనే కాదు… మహారాష్ట్రలోనూ కారు బలాన్ని చూపించేందుకు భారీ కాన్వారుతో సోలాపూర్‌కు వెళ్లారు. అంతేకాకుండా కాంగ్రెస్‌ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జగ్గారెడ్డి కూడా కారెక్కుతారనే ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఖండించారు.
ఎమ్మెల్యే జగ్గారెడ్డిని హడావుడగా ఢిల్లీకి పిలిపించారు. కాంగ్రెస్‌ అంతర్గత విషయాలపై ఆయన రాహుల్‌ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. పదే పదే రేవంత్‌రెడ్డిపై ఆయన చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో అధిష్టానం అడిగి తెలుసుకున్నట్టు ఆ వర్గాలు చెప్పాయి. ఢిల్లీకి చేరిన రాష్ట్ర రాజకీయాలు రాష్ట్రానికి చేరిన తర్వాత ఎటువంటి పరిణామాలు జరుగుతాయో వేచి చూడాల్సిందే.
పోవద్దు…ప్రాధాన్యత ఇస్తాం
‘ఇది ఎన్నికల సమయం. కర్నాటక ఎన్నికల ఫలితాలతో ఇప్పటికే తీవ్రంగా నష్టపోయాం. తెలంగాణాలో మీరూ పార్టీలు వీడితే ఉన్న కాస్త పట్టుపోతుంది. పొలిటికల్‌గా దక్షిణాదిలో బీజేపీకి పెద్ద డ్యామేజ్‌ అవుతుంది. అలాంటి వాటికి మీరు అవకాశం ఇవ్వొద్దు. 2024లో కేంద్రంలో ఎట్లాగో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అప్పుడు రాజగోపాల్‌రెడ్డికి జాతీయస్థాయిలో మంచి ప్రాధాన్యత ఇస్తాం. మంత్రి పదవి కూడా పరిశీలిస్తాం.
రాష్ట్రంలో నేతల మధ్య సఖ్యత తీసు కొస్తాం. ఈటల రాజేందర్‌కు రాష్ట్రంలో సముచిత స్థానం కల్పిస్తాం. బీఆర్‌ఎస్‌పై దూకుడుగా ముందుకెళ్లండి. దయచేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని మాత్రం వీడకండి’ అంటూ వారిద్దరినీ అమిత్‌షా కోరినట్టు బయట ప్రచారం జరుగుతున్నది. అమిత్‌షా మాటలకు వారిద్దరూ సైలెంట్‌గా చెవులూపి బయటకు వచ్చినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే బండి సంజరుని ఆఘమేఘాల మీద ఢిల్లీకి రప్పించి అందరినీ కలుపుకుని పోవాలని హెచ్చరించినట్టు తెలిసింది. పార్టీలో చేరిన వారికి సరైన గౌవరం ఇవ్వాలని తెలియదా? అంటూ అమిత్‌షా ఘాటుగానే మందలించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ఆ సమయంలో హస్తినలోనే ఉన్న ఈటల, రాజగోపాల్‌రెడ్డి లను బండి సంజరు కలవలేదు.
ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా హస్తం గూటికి చేరుతారనే చర్చ మొదలైంది. ఆ సమయంలో వారిద్దరూ కూడా ఢిల్లీలో అమిత్‌షా, నడ్డాతో భేటీ అయి, బీజేపీ అంతర్గత విషయాలను వారికి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. దీంతో వారి మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయని ఆ వర్గాలు అంటున్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకూ బీజేపీ బలోపేతానికి ఏ చిన్న అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకున్న కమలనాథులు… కవితను అరెస్ట్‌ చేసే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుండటంతో బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం జరిగిదంటూ కాంగ్రెస్‌ ఆరోపిస్తున్నది. మరోవైపు ఈ మధ్య కేసీఆర్‌ పదేపదే కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేస్తూ మాట్లాడుతుండటం, అదే బాటలో మంత్రులు, పార్టీ నేతలు కూడా నడవడంతో లోలోపల ఏదో జరుగుతోందనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

Spread the love