– రాలుతున్న కమలం రెక్కలు
– మోడీ, నడ్డా వచ్చినా ఆగని కల్లోలం
– భారీగా వలసలు
– ప్రియాంక గాంధీ సమక్షంలో చేరేందుకు సిద్ధం
– 25న కాంగ్రెస్ బహిరంగ సభ
బీజేపీకి దెబ్బమీద దెబ్బ పడుతున్నది. సోషల్ మీడియా ద్వారా మైండ్‌గేమ్ ఆడుతూ లేనిది ఉన్నట్టు ప్రచారం చేసిన కమలనాథులకు ఇప్పుడు వాస్తవ పరిస్థితేంటో తెలిసింది. తేరుకుని నష్టనివారణ చర్యలు చేపట్టినా.. తెలంగాణలో కమలం వికసించడం కష్టమని ఆ పార్టీలోని వలసనేతలకు అర్థమయ్యింది. దీంతో ఆ పార్టీని వీడి ‘చేయి’ అందుకునేందుకు కొందరు, కారు ఎక్కేందుకు మరి కొందరు పరిగెత్తుతుండటం బీజేపీని మరింత కలవరపాటుకు గురిచేస్తున్నది. వాడుతున్న కమలం పువ్వు నుంచి రెక్కలు రాలినట్టే ఆ పార్టీ నుంచి ఒక్కో ముఖ్యనేత జారుకుంటున్నారు.
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీజేపీకి చెందిన 10 మంది కీలక నేతలు హస్తం గూటికి చేరబోతున్నారని కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన నోట్ ‘పువ్వు’ పార్టీలో మరింత కల్లోలానికి దారితీస్తున్నది. పార్టీ వీడకుండా వలస నేతలకు జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించినా విభేదాలు మాత్రం ఆగటం లేదు. క్రమశిక్షణకు మారుపేరు, రామరాజ్యం గురించి గొప్పగా చెప్పుకునే బీజేపీ నేతల మధ్య ఆధిపత్యపోరు రావణ కష్టంలా మండుతూనే ఉన్నది. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రధాని మోడీ వరంగల్‌కు వచ్చిపోయిన తర్వాత కూడా రాజకీయ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. బీఆర్‌ఎస్ అవినీతిపై మోడీ తీవ్ర విమర్శలు చేసినప్పటికీ…కేంద్రంలో అధికారంలో ఉండీ, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలను ఆ పార్టీ నేత ఎ.చంద్రశేఖర్ సంధించడం చర్చనీయాంశమైంది. దీనినిబట్టే సొంత పార్టీ నేతలను సైతం మోడీ ప్రసంగం సంతృప్తి పరచలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ కలిసి కట్టుగా ఉండాలనే అధిష్టానం సూచనలను పెడచెవిన పెట్టినట్టు కనబడుతున్నది. అనివార్య పరిస్థితుల్లో బీజేపీలో చేరిన నేతల ఆలోచనల్లో మార్పు కనిపిస్తున్నది. బ్యాక్ టూ పెవిలియన్ అనే వాతావరణం పార్టీలో కనిపిస్తున్నది. బీజేపీ చేరికల కమిటీ చైర్మెన్ ఈటల రాజేందర్ గతంలో చేసిన ప్రయోగాలు విఫలమైన సంగతి తెలిసిందే. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును పార్టీలోకి ఆహ్వానించినప్పటికి సఫలం కాలేదు. పైగా వాళ్లే ఈటలకు రివర్స్ కౌన్సిలింగ్ ఇచ్చిన విషయం విదితమే. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఈటల రాజేందర్ కూడా పార్టీ మారుతారనే ప్రచారం కాస్త ఊపందుకుంది. దీంతో ఆయనకు బీజేపీ ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మెన్ పోస్టు కట్టబెట్టింది. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి మునుగోడులో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించింది. అయినప్పటికీ వారు బీజేపీలో ఉంటారనే నమ్మకం ఆ పార్టీ నేతలకు కుదరడం లేదని తెలుస్తోంది .వరంగల్ మోడీ సభకు కూడా పార్టీ నేతలు డుమ్మా కొట్టిన సంగతి తెలిసిందే. దక్షణాది రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు సమావేశంలో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా హైదరాబాద్‌కు వచ్చారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ అంతర్గత విషయాలను పార్టీ నూతన అధ్యక్షులు జి కిషన్‌రెడ్డి… నడ్డాకు వివరించినట్టు తెలిసింది. పార్టీ పరిస్థితులను చక్కదిద్దేందుకు కార్యచరణ రూపొందిస్తున్న తరుణంలో బీజేపీలో పిడుగులాంటి వార్త గుప్పుమంది.
వివిధ జిల్లాలకు చెందిన బీజేపీ కీలక నేతలు పది మంది కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో ఈనెలాఖరులో మహబూబ్‌నగర్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆ సభకు ఏఐసీసీ అగ్రనేత ప్రియాంకగాంధీ హాజరు కానున్నట్టు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఆ సభావేదికపై ప్రియాంక సమక్షంలో చేరేందుకు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. అందులో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు నేతలు కూడా ఉన్నట్టు జాబితా మీడియాలో వైరల్ అవుతున్నది. యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, రామారావు పటేల్, ఖాజీపేట లింగయ్య, రవీంద్ర నాయక్, ఏనుగు రవీందర్ రెడ్డి, ఏ చంద్రశేఖర్, రమేష్ రాథోడ్, పవన్‌కుమార్‌రెడ్డి (బీజేపీ), గద్వాల జెడ్పీ చైర్‌పర్సన్ సరితా తిరుపతయ్య, ఎమ్మెల్సీ దామోదరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి (బీఆర్‌ఎస్) తదితరులు కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరుగుతున్నది.
కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కారెక్కుతారనీ, ఈటల రాజేందర్ హస్తం గూటికి వస్తారా? అధికార బీఆర్‌ఎస్‌లోకి వెళతారా?, విజయశాంతి, కొండా విశ్వేశ్వరరెడ్డి, వివేక్ వెంకటస్వామి తదితరులు బీజేపీ నేతల వ్యవహార శైలి నచ్చక దూరం దూరంగా ఉంటున్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటువంటి పరిణామాలు కమలనాథులకు నిద్రాహారాలు లేకుండా చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.