అప్పుల కుప్ప..

– భారీగా రుణాలు తీసుకుంటున్న మోడీ సర్కార్‌
– అదే బాటలో రాష్ట్రాలుొ అంతిమంగా ప్రజలపైనే భారొం వ్యక్తిగత రుణాలూ పెరిగాయి
     అప్పుల కోసం మోడీ ప్రభుత్వం వెంపర్లాడుతోంది. ప్రభుత్వ రంగ సంస్థలను హౌల్‌సేల్‌గా అమ్మేస్తున్నా…ప్రజల నెత్తిన మోయలేని ఆర్థిక భారాలు వేస్తున్నా కేంద్ర ఖజానా నిండట్లేదు. రిజర్వుబ్యాంకు మొదలు ప్రపంచబ్యాంకు వరకు అప్పులు చేస్తూనే ఉంది. కేంద్ర సర్కారు పరిస్థితే అలా ఉంటే, రాష్ట్రాలూ అదే బాటలో నడుస్తున్నాయి. ఇక ప్రజలూ వ్యక్తిగత రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అన్నింటికీ కేంద్ర బిందువు కేంద్రంలోని మోడీ సర్కారు ఆర్థిక దివాళా పరిస్థితే కారణంగా కనిపిస్తున్నది. దీన్ని గాడిన పెట్టాల్సిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రపంచమే ఆర్థిక మాంద్యంలో ఉందంటూ అసమర్థతను కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం!

న్యూఢిల్లీ : 2014వ సంవత్సరం నుండి దేశం క్రమేపీ అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. గడచిన తొమ్మిది సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు 200% పెరగగా, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రుణం సుమారు 150% పెరిగింది. ఇవి సాక్షాత్తూ రిజర్వ్‌బ్యాంక్‌ వెల్లడించిన అప్పుల చిట్టాలు. కేంద్ర ప్రభుత్వ రుణభారం 2022-23 సంవత్సరాంతానికి రూ.157 లక్షల కోట్లకు చేరగా, రాష్ట్రాలు రూ.76 లక్షల కోట్ల మేర అప్లుల్లో ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికి వివిధ బ్యాంకుల నుండి ప్రజలు తీసుకున్న వ్యక్తిగత రుణాలు కూడా రూ.41 లక్షల కోట్లకు చేరాయి. 2014తో పోలిస్తే ఈ అప్పులు 400% పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌ రూ.45 లక్షల కోట్లు కాగా ప్రజల వ్యక్తిగత రుణాలు దాదాపుగా అదే స్థాయిలో ఉండడం విశేషం.
మరోవైపు చిన్న, మధ్యతరహా పరిశ్రమలు బ్యాంకు రుణాలను పెద్దగా తీసుకోవడం లేదు. దీనిని బట్టి అవి తమ సామర్ధ్యాలను పెంచుకోవడం లేదని అర్థమవుతోంది. అంటే ఏమిటి? ఆ పరిశ్రమలు ఉద్యోగాలను కల్పించలేకపోతున్నాయి. దీంతో కుటుంబ ఆదాయాలు పరిమితంగానే ఉంటున్నాయి. స్థూల దేశీయోత్పత్తిలో ప్రయివేటు వినియోగ వ్యయం తగ్గిపోతోందని ఆర్‌బీఐ గణాంకాలు చెబుతున్నాయి. అంటే కుటుంబాలను నెట్టుకురావడం కష్టమవుతోందన్న మాట.
మనకు మేలు చేయదు
     వ్యక్తిగత రుణాలు పెరగడం శుభ పరిణామమని కొందరు వాదిస్తున్నారు. వస్తువులు, సేవల కొనుగోలు కోసం ప్రజలు రుణాలు తీసుకుంటారని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిదని వారి వాదన. అయితే మంచి ఆదాయాలు, మేలైన సామాజిక భద్రత, నిలకడైన ఉద్యోగాలు కలిగి ఆర్థికంగా పురోభివృద్ధి చెందుతున్న వ్యవస్థలకు ఇది మేలు చేయవచ్చు. కానీ భారత ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను పరిగణనలోకి తీసుకుంటే ఇదేమీ మంచి సంకేతాన్ని ఇవ్వదు. పైగా పరిస్థితి మరింత క్షీణిస్తుంది. ఎందుకంటే మన దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నాయి. ఉద్యోగులు, కార్మికులకు వేతనాలు కూడా తక్కువగానే లభిస్తున్నాయి. పారిశ్రామిక రంగం తక్కువ వృద్ధిరేటును నమోదు చేస్తోంది. వచ్చే జీతం సరిపోక ప్రజలు రుణాలు తీసుకోవాల్సి వస్తోంది తప్ప ఖరీదైన విలాస వస్తువుల కొనుగోలు కోసం కాదు.
ఈ రుణాలన్నీ ఎవరికి ఖర్చవుతున్నాయంటే..?
     తీసుకున్న రుణాలను ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేస్తే దానిని సమర్ధించవచ్చు. కానీ ప్రభు త్వాలు సంక్షేమానికి కోత పెడుతున్నాయి. భారీ వ్యయా న్ని భరించలేమని, బడ్జెట్‌ను సమతూకం చేసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నాయి. మరి ప్రభుత్వం తీసుకుంటున్న రుణాలు ఎక్కడికి పోతున్నాయి? కార్పొరేట్‌ రంగంలోకి. ఈ రంగానికి ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తోంది. పన్ను మినహాయింపులు, సబ్సిడీలు వంటి తాయిలాలు ఇస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న రుణాలలో ఎక్కువ భాగం ఈ రాయితీలు ఇచ్చేందుకే ఖర్చు చేస్తున్నారు. జాతీయ రహదారులు, వందేభారత్‌ వంటి వేగంగా నడిచే రైళ్లు వంటి భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపౖెెనా రుణాలలోనూ ను వెచ్చిస్తున్నారు. నిధుల వినియోగం నిత్యం ప్రశార్థకమవుతోంది.
రాష్ట్రాలు సైతం…
     రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తామేమీ తక్కువ తినలేదన్నట్లు భారీగానే రు ణాలు తీసుకుంటు న్నాయి. 2014-15లో అన్ని రాష్ట్రాల రుణభారం రూ.25 లక్షల కోట్లు ఉంటే అది ప్రస్తుత సంవత్సరంలో రూ.76 లక్షల కోట్లకు చేరిందని అంచనా. 2017లో జీఎస్టీని ప్రవేశపె ట్టిన తర్వాత పన్నులు, సుంకాల విషయంలో రాష్ట్రాలకు అధికారాలు లేకుండా పోయాయి. దీంతో వాటి ఆదాయం తగ్గిపోయింది. పైగా పెట్టుబడుల కోసం మూలధనాన్ని పెంచేందుకు కేంద్రం కఠినమైన, ఆర్థికంగా భారమైన షరతులు విధిస్తోంది. వివిధ పథకాలకు నిధుల కేటాయింపుపై కూడా కేంద్రం పెత్తనం చెలాయిస్తోంది. ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద సమస్యగా మారింది.
అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణాల సేకరణ విషయంలో కేంద్రాన్నే అనుసరిస్తున్నాయి. రాజకీయంగా ప్రయోజనం చేకూర్చే ప్రాజెక్టులు చేపట్టి భారీగా ఖర్చు చేస్తున్నాయి. కేంద్రం మాదిరిగానే స్థానిక కార్పొరేట్‌ శక్తులు, వ్యాపారులకు రాయితీలు ఇస్తున్నాయి. వీటన్నింటి ఫలితంగా దేశ ప్రజల నెత్తిపై మోయలేని రుణభారం పడుతోంది. ఎందుకంటే అంతిమంగా ఈ అప్పులు తీర్చాల్సింది ప్రజలే.
వడ్డీలకే సరి
     ప్రభుత్వాలు తమ కార్యకలాపాల కోసం తరచుగా రుణాలు తీసుకుంటాయి. బ్యాంకులు వంటి ప్రైవేటు వాణిజ్య వనరుల ద్వారా లేదా ప్రజలకు జారీ చేసిన బాండ్ల ద్వారా లేదా ప్రావిడెంట్‌ ఫండ్‌ కార్పస్‌ నుండి లేదా చిన్న మొత్తాల పొదుపు నిధి నుండి ప్రభుత్వాలు రుణాన్ని సేకరిస్తాయి. అయితే ఈ రుణాల మొత్తం కొండలా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 2022-23లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రుణాలలో 58% మార్కెట్‌  వనరుల నుండి పొందినవే. అంటే బ్యాంకుల వంటి వాణిజ్య సంస్థల నుండి తీసుకున్నవి. ఈ తరహా రుణాలపై వడ్డీ భారం అధికంగా ఉంటుంది. 2023-24 బడ్జెట్‌ అంచనాల ప్రకారం వడ్డీ చెల్లింపులకే సుమారు రూ.11 లక్షల కోట్లు వినియోగించాల్సి వస్తుంది. సంవత్సరంలో చేసే మొత్తం వ్యయంలో ఇది 23%. అంటే ప్రజల సొమ్ములో అధిక భాగం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రుణాలపై వడ్డీ చెల్లింపులకే వినియోగిస్తున్నారు. రుణాలను చెల్లించడం సంవత్సరాల తరబడి కొనసాగుతూనే ఉంటోంది. తదుపరి ఏర్పడే ప్రభుత్వాలకు ఇది పెద్ద తలనెప్పిగా మారుతుంది.

Spread the love