కోవిన్‌ పోర్టల్‌ డేటా చౌర్యం !

– కేటీఆర్‌ వివరాలు కూడా…
– పలువురు నేతల డేటా సైతం…
– బయటపెట్టిన ‘ది న్యూస్‌ మినిట్‌’
– దర్యాప్తు చేస్తున్నాం : కేంద్రం
న్యూఢిల్లీ : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సహా కోవిన్‌ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకున్న లక్షలాది మంది వ్యక్తిగత సమాచారం చౌర్యానికి గురైంది. కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ తీసుకోవడానికి దేశ ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరి వ్యక్తిగత సమాచారం ఇప్పుడు టెలిగ్రామ్‌ గ్రూప్‌ ద్వారా బహిర్గతం అయింది. పేరు, పుట్టిన తేదీ, ఫోన్‌ నెంబర్‌, పాస్‌పోర్ట్‌ లేదా ఆధార్‌ నెంబర్‌ వంటి వ్యక్తిగత వివరాలన్నీ ఇప్పుడు తెలిసిపోయాయి. ఈ విషయాన్ని తొలుత ‘ది ఫోర్త్‌’ అనే మళయాళీ న్యూస్‌ పోర్టల్‌ బయటపెట్టింది. ఈ పోర్టల్‌ టెలిగ్రామ్‌ గ్రూప్‌ నుంచి కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌, కోవిన్‌ ప్యానల్‌ ఛైర్‌పర్సన్‌ రామ్‌ సేవక్‌ శర్మ, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, కేంద్ర మంత్రి మీనాక్షి లేఖీల వ్యక్తిగత సమాచారం తెలుసుకుంది. కోవిన్‌ యాప్‌లో 110 కోట్ల మందికి పైగా ప్రజలు తమ వివరాలు నమోదు చేసుకున్నారు.
మళయాళీ పోర్టల్‌ తెలిపిన వివరాల ప్రకారం బీజేపీ సీనియర్‌ నేత లేఖీ న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌ 8వ అంతస్తులోని కౌంటర్‌లో వాక్సిన్‌ వేయించుకున్నారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ పంగప్పర ఆరోగ్య కేంద్రంలో తన ఆధార్‌ నెంబర్‌ నమోదు చేసి వాక్సిన్‌ తీసుకున్నారు. కేరళ ఆరోగ్య మంత్రి తన వ్యక్తిగత సెల్‌ నెంబర్‌తో నమోదై భర్తకు, కుమార్తెకు వాక్సిన్‌ వేయించారు. ఇదిలా ఉండగా ఈ సమాచార
చౌర్యాన్ని ‘ది న్యూస్‌ మినిట్‌’ అనే స్వతంత్ర డిజిటల్‌ వేదిక ధృవీకరించింది. దక్షిణ భారతదేశంలోని ఐదు రాష్ట్రాలకు చెందిన తాజా వార్తలను ఈ వేదిక అందిస్తూ ఉంటుంది. లోక్‌సభ సభ్యురాలు కనిమొళి, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, కేంద్ర మాజీ మంత్రి హర్షవర్ధన్‌, బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై, కాంగ్రెస్‌ ఎంపీ కార్తి చిదంబరం తదితర నేతల సమాచారాన్ని టెలిగ్రామ్‌ గ్రూప్‌ ద్వారా ది న్యూస్‌ మినిట్‌ సేకరించింది. కోవిన్‌ పోర్టల్‌లో నమోదు చేసుకున్న వారి వివరాలు పొందాలంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఆ యాప్‌లో పేరు నమోదు చేసుకున్న వ్యక్తి ఫోన్‌ నెంబర్‌ లేదా ఆధార్‌ నెంబర్‌ ఇస్తే చాలు…మిగిలిన వివరాలన్నీ తెలిసిపో తాయి. ది న్యూస్‌ మినిట్‌ సోమవారం ఉదయం 9 గంటలకు టెలిగ్రామ్‌ గ్రూప్‌ నుంచి నేతల వ్యక్తిగత వివరాలు సేకరించింది. సమాచార చౌర్యంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ వ్యవహారంపై పరిశీలన జరిపి, నివేదిక అందించాలని ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ను ఆదేశించింది. కోవిన్‌ పోర్టల్‌ పూర్తి సురక్షితమైనదని, ప్రజల వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తోంది. పాస్‌వర్డ్‌ను నమోదు చేస్తేనే ఈ పోర్టల్‌లో ప్రవేశించే అవకాశం ఉంటుందని గుర్తు చేసింది. కోవిన్‌ పోర్టల్‌ సమాచారం నేరుగా చౌర్యానికి గురైనట్టు అనిపించడం లేదని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ చెప్పారు. అయితే ప్రజల వ్యక్తిగత సమాచారం చౌర్యానికి గురికావడం ఇది మొదటిసారి కాదు. పోర్టల్‌లో నమోదైన 15 కోట్ల మంది భారతీయుల సమాచారం తన వద్ద ఉన్నదని డార్క్‌ లీక్‌ మార్కెట్‌ అనే హ్యాకర్‌ గ్రూప్‌ 2021 జూన్‌లో ప్రకటించింది.
దర్యాప్తు చేస్తున్నాం : కేంద్రం
డేటా లీక్‌ వార్తలను దర్యాప్తు చేస్తున్నామని కేంద్రప్రభుత్వం తెలిపింది. ఈ వ్యవహారాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాలని కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సిఇఆర్‌టి)ని కేంద్రం కోరింది. డేటా లీక్‌ వార్తలను కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఖండించింది. ‘ఇవన్నీ నిరాధార వార్తలు. కోవిన్‌ పోర్టల్‌ను అన్ని భద్రతా ప్రమాణాలతో రూపొందించాం. ఒటిపి అథెంటికేషన్‌తో మాత్రమే ఇందులోని డేటాను చూడగలం’ అని పేర్కొంది. ఒటిపి లేకుండా కొవిన్‌ పోర్టల్‌లోని సమాచారాన్ని ఏ బాట్‌లోనూ షేర్‌ చేయలేమని తెలిపింది.
విచారణ జరపాలి: సీపీఐ(ఎం) డిమాండ్‌
న్యూఢిల్లీ : కొవిన్‌ పోర్టల్‌ నుంచి పెద్ద ఎత్తున డేటా లీకయిందని వచ్చిన వార్తలపై తక్షణమే విచారణ జరపాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో డిమాండ్‌ చేసింది. కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవడం కోసం తమ వ్యక్తిగత వివరాలు నమోదు చేసుకున్న కొవిన్‌ పోర్టల్‌ నుంచి ఆధార్‌ కార్డు నెంబర్లతో సహా ప్రజల వ్యక్తిగత సమాచారం లీకైనట్టు వార్తలు వచ్చాయి. ఇది తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదనీ, పైగా భారతీయుల ప్రాధమిక హక్కుగా సుప్రీంకోర్టు ప్రకటించిన గోప్యతా హక్కును ఉల్లంఘిస్తోందని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఇటువంటి ఆరోపణలనే 2021 జూన్‌లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. అయినప్పటికీ కొవిన్‌ వ్యవస్థ నుంచి లీకేజీ జరిగిందన్న ఆరోపణలపై సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కంప్యూటర్‌ హ్యాకింగ్‌ గ్రూపైన కంప్యూటర్‌ ఎమర్జన్సీ రెస్పాన్స్‌ టీమ్‌తో దర్యాప్తుకు ఆదేశించింది. ఈ దర్యాప్తు వివరాలు ఇంకా పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టలేదు. వెంటనే ఈ మొత్తం వ్యవహారంపై కూలంకషంగా దర్యాప్తు జరగాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో డిమాండ్‌ చేసింది. భారతీయుల వ్యక్తిగత సమాచార భద్రతలో జరిగిన ఇంత తీవ్ర ఉల్లంఘనకు బాధ్యులైన వారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది.

Spread the love