ధరణితో ఎన్నో లాభాలు

– రాబంధులు లేరు..పైరవీకారులు లేరు
– తీసివేస్తామన్న వారికి బుద్ధి చెప్పండి
– పక్క రాష్ట్రాల్లో కరెంట్‌ కటకట.. ఇక్కడ 24 గంటల విద్యుత్‌
– ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మళ్లీ సహకరించాలి
– జోగులాంబ గద్వాల సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
”పుట్టినప్పటి నుంచి మరణించే వరకు అన్నివర్గాల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది.. మూడు సంవత్సరాలు కష్టపడి రైతులకు ఇబ్బందులు ఉండకూడదని ధరణి పథకాన్ని తీసుకొచ్చాం. దానివల్లే రాబంధులు.. పైరవీకారులు లేకుండా పోయారు.. ఇవాళ కొందరు దళారీలు మోపై, వాళ్ల జమానాలో కింద మీద చేసిన వారు ధరణిని తీసివేసి బంగాళాఖాతంలో వేస్తామంటున్నారు..” అని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా పర్యటనలో సోమవారం ఆయన బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయం, పోలీస్‌ ప్రధాన కార్యాలయం, సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించారు. అనంతరం అయిజ రోడ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘ధరణితో డబ్బులు నేను హైదరాబాద్‌లో వేస్తే.. నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లో జమవుతున్నాయి. ఇవాళ పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ అవుతుంది. ఐదు నిమిషాల్లో పట్టా అయిపోతోంది. ఇంత మంచి సదుపాయాన్ని కాంగ్రెస్‌ పార్టీ బంగాళాఖాతంలో విసిరి వేస్తామంటుంది. ఇది ధరణిని వేయడమా? ప్రజలను బంగాళాఖాతంలో వేయడమా?’ అంటూ సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. ధరణి ఉంచాలా? తీసేయాలా? అని సీఎం కేసీఆర్‌ సభలో పాల్గొన్న ప్రజలను ప్రశ్నించగా.. ఉండాలంటూ చేతులెత్తి నినదించారు. ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిర్మల్‌లో ఎక్కడైనా ప్రజలు ధరణి ఉండాలని చెబుతున్నారని, ధరణిని తీసేస్తామన్న వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని కోరారు. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగించాలన్నారు.
లావుగా, పొడుగ్గా ఉన్న నేతలు సాగునీటి ప్రాజెక్టులను కడతామని చెప్పి.. వాటిని గీకి మధ్యలోనే వదిలేశారని, ప్రజలు తాగు, సాగునీటికి ఇబ్బందులు పడ్డారని చెప్పారు. తెలంగాణ వచ్చాకే ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నామన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 15 లక్షల నుంచి 20 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించుకోగలుతున్నా మన్నారు. ఉద్యమ సమయంలో తాను జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించానని.. ఇక్కడి పరిస్థితుల ను చూసి కన్నీళ్లు పెట్టుకున్నానని గుర్తు చేసుకు న్నారు. రాష్ట్రం వచ్చాక గతంలో ఒకసారి గద్వాల పర్యటనకు వచ్చినప్పుడు పాలమూరు ప్రాంతాన్ని చూసి సంతోషపడ్డానని, ఎక్కడ చూసినా ధాన్యపు రాసులు కనిపించాయని చెప్పారు. ఇదే గద్వాలలో ఉన్న పెద్దపెద్ద నాయకులు అడ్డం పొడుగు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదని, మహబూబ్‌నగర్‌లో 14 రోజులకో సారి మంచినీళ్లు వచ్చేవని చెప్పారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మిషన్‌ భగీరథ ద్వారా నల్లాల పథకం తెచ్చుకున్నామని చెప్పారు. ఇలాంటి పథకం దేశంలో ఎక్కడా లేదన్నారు. తెలంగాణ సాధనలో మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్ నిరంజన్‌ రెడ్డి కృషి అభినందనీయని కొనియాడారు.
తేడాను గమనించండి
‘కరెంటు రాదు, తెలంగాణ చీకటిమయం అవుతుందని కొందరు గతంలో మాట్లాడారు. ఇక్కడకు ఆంధ్ర కేవలం 25 కిలోమీటర్ల దూరమే. ఇప్పుడు రాష్ట్రంలో 24 గంటల విద్యుత్‌ ఉంటే.. పక్కన ఉన్న కర్నాటక, ఆంధ్ర రాష్ట్రాల్లో కరెంటుకు కటకట ఉంది’ అని కేసీఆర్‌ అన్నారు. తేడాను గమనించాలని సూచించారు. గట్టు ఎత్తిపోతల పథకంతోపాటు జిల్లాలో మిగిలిపోయిన పనులు అన్నింటినీ పూర్తి చేసుకుని సాగునీటిని అందిస్తామ న్నారు. ఆర్డీఎస్‌కు తుమ్మిళ ద్వారా మళ్లీ పునరుజ్జీవం కల్పించామని, గట్టు ఎత్తిపోతల పూర్తయితే గద్వాల వజ్రపుతునకవుతుందని చెప్పారు. ఒకప్పుడు పంజాబ్‌ రాష్ట్రం ధాన్యం పండించడంలో దేశంలో ప్రథమ స్థానంలో ఉండేదని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలోకి వచ్చిందని తెలిపారు. గద్వాల, నారాయణపేట జిల్లాలో మెడికల్‌ కళాశాలలు వస్తాయని ఎవరూ ఊహించలేదని, ఇది ఈ ప్రాంత ప్రజలకు వరం లాంటిదన్నారు.
ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీ, సీఎస్‌ శాంతికుమారి, రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్‌, రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎంపీ మన్నె శ్రీనివాస్‌ రెడ్డి, గద్వాల జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, అలంపూర్‌ డాక్టర్‌ అబ్రహం, డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి, హర్షవర్ధన్‌ రెడ్డి, రాజేందర్‌ రెడ్డి, చిట్టెం రాంమోహన్‌ రెడ్డి, ఎమ్మెల్సీలు కూచుకుళ్ల దామోదర్‌ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, కలెక్టర్‌ వల్లూరు క్రాంతి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
నిధులు కేటాయింపు
‘గద్వాలలో 255 గ్రామపంచాయతీలు ఉన్నాయి.. 12 మండలాలు ఉన్నాయి.. నాలుగు మున్సిపాలిటీలున్నాయి.. ప్రతి గ్రామపంచాయతీకీ రూ.10 లక్షల గ్రాంట్‌ ఇస్తున్నాం.. ప్రతి మండలానికి 15 లక్షల గ్రాంట్‌ ఇస్తున్నాం’ అని సీఎం చెప్పారు. గద్వాల మున్సిపాలిటీకి రూ.50 కోట్లు మంజూరు చేస్తామని, మిగతా మూడు మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున అభివృద్ధికి కేటాయిస్తామని ప్రకటించారు.

Spread the love