మోగిన బడిగంట

– పాఠశాలలకు విద్యార్థుల పరుగులు
– అందని యూనిఫారాలు
– పారిశుధ్య కార్మికుల్లేక అవస్థ

– తొలిరోజు అంతంత మాత్రమే హాజరు
– ఎండల తీవ్రత

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో బడిగంట మోగింది. అన్ని జిల్లాల్లో బడులు సోమవారం పున:ప్రారంభమయ్యాయి. 2023-24 విద్యాసంవత్సరం కూడా ప్రారంభమైంది. ఆదివారంతో వేసవి సెలవులు ముగిశాయి. దీంతో సోమవారం ఉదయం పాఠశాలలకు విద్యార్థులు పరుగులు తీశారు. అయితే మొదటి రోజు కావడంతో విద్యార్థుల హాజరు అంతంత మాత్రంగానే ఉంది. బడులకు తక్కువ మంది వచ్చినట్టు సమాచారం. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడం ఒక కారణంగా ఉన్నది. అయితే రోజురోజుకూ హాజరుశాతం పెరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 26,065 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ బడుల్లో తొమ్మిదో తరగతి వరకు తెలుగు మీడియంతోపాటు ఇంగ్లీష్‌ మీడియంలో బోధన సమాంతరంగా ప్రారంభం కానుంది. ఈనెల మూడో తేదీ నుంచి జయశంకర్‌ బడిబాట ప్రారంభమైన విషయం తెలిసిందే. 49 రోజుల తర్వాత ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకున్నాయి. దీంతో పాఠశాలల ఆవరణ, తరగతి గదులు అపరిశుభ్రంగానే కనిపించాయి. బడుల్లో పారిశుధ్యం బాధ్యతను గ్రామపంచాయతీలు, మున్సిపాల్టీలకు ప్రభుత్వం అప్పగించింది. అక్కడి కార్మికులు పాఠశాలల ఆవరణ, పరిసరాల పరిశుభ్రం చేయడానికే పరిమితమయ్యారు. దీంతో తరగతి గదులు దుమ్ము, ధూళితో ఉన్నాయి. పాఠశాలల్లో పారిశుధ్య కార్మికుల కొరత తీవ్రంగా ఉన్నది. స్వచ్ఛ కార్మికులను నియమించాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి. రూ.వంద కోట్లు కేటాయిస్తే ఏడాది మొత్తం ప్రతి బడికీ స్వచ్చ కార్మికులను నియమించొచ్చని సూచిస్తున్నాయి. అయినా ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నది. రాష్ట్రంలో కొన్ని చోట్ల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులే సొంతంగా డబ్బులు ఇచ్చి పారిశుధ్య కార్మికులను నియమించుకున్న సంఘటనలున్నాయి. ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో ఎక్కువ చోట్ల విద్యార్థులకు యూనిఫారాలు ఇవ్వలేదు. దీంతో సాధారణ బట్టలు, పాత యూనిఫారాలతోనే విద్యార్థులు బడులకు హాజరయ్యారు. పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు పాఠశాలలకు వచ్చినా అన్ని చోట్ల విద్యార్థులకు పంపిణీ చేయలేదు. ఇంకోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వేధిస్తున్నది. దాదాపు 22 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సమాచారం. విద్యాసంవత్సరం ప్రారంభమైనా ఉపాధ్యాయుల నియామకానికి నోటిఫికేషన్‌ జారీ ప్రక్రియ ఊసేలేదు. ఇంకోవైపు విద్యావాలంటీర్ల నియామకంపైనా స్పష్టత లేదు. రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మనబడి, మనబస్తీ-మనబడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. రూ.7,289 కోట్లతో 26,065 సర్కారు బడుల్లో 12 రకాల మౌలిక వసతులను కల్పిస్తున్నట్టు ప్రకటించింది. మొదటి విడతలో రూ.3,497 కోట్లతో 9,123 బడుల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 20న విద్యాదినోత్సవం సందర్భంగా 1,600 స్కూళ్లలో నిర్మించిన 4,800 డిజిటల్‌ తరగతి గదులు, 10 వేల గ్రంథాలయాలను ప్రారంభించనుంది. అయితే మన ఊరు-మనబడి కింద మౌలిక వసతులు కల్పించినా ఏ విధంగా నిర్వహణ చేయాలంటూ ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి.
1.46 లక్షల మంది చేరిక
బడిబాట కార్యక్రమంలో సోమవారం 8,381 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన ఒక ప్రకటనలో ప్రకటించారు. ఇందులో అంగన్‌వాడీ కేంద్రాల నుంచి 2,607 మంది, ప్రయివేటు స్కూళ్ల నుంచి 391 మంది, నేరుగా చేరిన వారు 1,397 మంది కలిపి మొత్తం 4,386 మంది ప్రవేశం పొందారని తెలిపారు. ఇప్పటి వరకు సర్కారు బడుల్లో 1,46,824 మంది విద్యార్థులు ప్రవేశం పొందారని తెలిపారు.
విద్యార్థులను పంపేందుకు ఆసక్తి చూపని తల్లిదండ్రులు
ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ, ప్రయివేట్‌ విద్యార్థులు సోమవారం ప్రారంభమయ్యాయి. విద్యార్థులు మాత్రం నామమాత్రంగా హాజరయ్యారు. ఖమ్మం జిల్లాలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో పాఠశాలలకు విద్యార్థులను పంపించడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో పలు ప్రభుత్వ పాఠశాలలకు పదుల సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. ముదిగొండ మండలం ఖానాపురం ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు గ్రామ సర్పంచ్‌ చేతుల మీదుగా ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. కల్లూరులో పలు పాఠశాలల విద్యార్థులకు డీఈవో సోమశేఖర శర్మ పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. మధిర మండలం మహాదేవపురం గ్రామంలో ఎస్‌ఎంసీ చైర్మెన్‌ కలక కృష్ణయ్య చేతుల మీదుగా పుస్తకాలు పంపిణీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో మొత్తం 92 పాఠశాలలకు గాను 3276 మంది విద్యార్ధులకు మొదటి రోజు అయిన సోమవారం 594 మంది మాత్రమే హాజరయ్యారు. హాజరు శాతం 18.13 గా నమోదు అయింది. అశ్వారావుపేట సీపీఎస్‌ పాఠశాలలో 60 మంది విద్యార్థులకు గాను ఇద్దరు మాత్రమే వచ్చారు.
రంగారెడ్డిలో 20 శాతం హాజరు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు అంతగా ఆసక్తి చూపలేదు. రంగారెడ్డి జిల్లాలో లక్ష 40 వేల మంది విద్యార్థులకుగాను మొదటి రోజు 28 వేల మంది మాత్రమే పాఠశాలకు హాజరయ్యారు. కేవలం 20 శాతం మంది పాఠశాలలకు హాజరయ్యారు. ఎండలు ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణంగా జిల్లా అధికారులు భావిస్తున్నారు. అలాగే వేసవి సెలవుల్లో ఊర్లకి వెళ్లిన వారు తిరిగి రాకపోవడం కూడా కారణంగా అధికారులు తెలిపారు. వికారాబాద్‌ జిల్లాలోని దోమ, కుల్కచర్ల మండలాలతోపాటు మరికొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు.

 

Spread the love