– డాక్టర్.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
జీహెచ్‌ఎంసీలో చాలాకాలంగా పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులను క్రమబద్ధీకరించాలని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. సుమారు 100 మంది జీహెచ్‌ఎంసీ కార్మిక సంఘం జేఏసీ నాయకులు బుధవారం బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానని ఇచ్చిన హామీ విషయాన్నిసీఎం కేసీఆర్‌కు గుర్తు చేశారు. ఇచ్చిన వాగ్ధా నాలను నెరవేర్చడంలో సీఎం పూర్తిగా వైఫల్యం చెందారని విమర్శించారు. జీహెచ్‌ఎంసీలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను అక్రమంగా రాంకీ ప్రయివేటు సంస్థకు అప్పగించి కార్మికుల పొట్టగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పారిశుద్య కార్మికులతో పాటు మిగిలిన అన్ని శాఖల్లోని అన్ని కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు కే.అరుణ, రుద్రవరం సునీల్, కార్మిక సంఘం జేఏసీ నాయకులు మిద్దె కృష్ణ, సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.