బీజేపీకి మరో షాక్‌

– కాంగ్రెస్‌ గూటికి మాజీ మంత్రి చంద్రశేఖర్‌ రేవంత్‌తో భేటీ
– అనంతరం హస్తం పార్టీలో చేరుతున్నట్టు వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో క్రమంగా తమ ప్రభను కోల్పోతున్న కమలం పార్టీకి మరో షాక్‌ తగిలింది. ఇతర పార్టీల నుంచి ఎంత వేగంగా బీజేపీలో చేరారో, అక్కడ ఇముడలేక అంతే వేగంగా తిరిగి వచ్చేస్తున్నారు. అంతర్గత కుమ్ములాటలు తట్టుకోలేకనే బయటకు వస్తున్నట్టు చెబుతున్నారు. తాజాగా అదేదారిలో బీజేపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి డాక్టర్‌ ఏ.చంద్రశేఖర్‌ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని చంద్రశేఖర్‌ నివాసానికి టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి వెళ్లారు. సుదీర్ఘ చర్చలనంతరం చంద్రశేఖర్‌ మాట్లాడుతూ రేవంత్‌ ఆహ్వానం మేరకు కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌పార్టీయే ప్రత్యామ్నాయమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌కు బీజేపీ రక్షణగా ఉంటున్నదని విమర్శించారు. బీజేపీ విధానాలు నచ్చకనే ఆ పార్టీకి రాజీనామా చేసినట్టు స్పష్టం చేశారు. అధ్యక్షుడిగా బండి సంజరును మార్చటంతోనే బీజేపీ పని అయిపోయిందన్నారు. కారు, కమలం ఒక్కటేనన్న చర్చ గ్రామస్థాయిలో జరుగుతున్నదని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ మూడో స్థానంలో ఉందన్నారు. కేసీఆర్‌ సర్కార్‌పై అవినీతి ఆరోపణలు వస్తున్నా…బీజేపీ పెద్దలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి వచ్చాక సంతప్తిగా ఉన్నాడో, లేదో బండి సంజరుకే తెలియాలన్నారు. 2021 జనవరి 18న బీజేపీలో చేరిన ఆయన పార్టీ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ రెడ్డికి శనివారం రాత్రి లేఖ పంపిన విషయం తెలిసిందే.
మన టార్గెట్‌ వంద సీట్లు
– గ్రామ, గ్రామాన తిరగండి…ప్రతీ తలుపు తట్టండి : పార్టీ శ్రేణులకు రేవంత్‌ పిలుపు
– కాంగ్రెస్‌లో చేరిన పలువురు కార్యకర్తలు
రాబోయే ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘వంద సీట్లు సాధించే బాధ్యత మాదే..గ్రామ, గ్రామాన తిరగండి…ప్రతీ తలుపు తట్టండి’ అని పార్టీ శ్రేణులకు రేవంత్‌ పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో కొల్లాపూర్‌కు చెందిన కొంత మంది కార్యకర్తలు..రేవంత్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్‌లో నోరు తెరవకపోయినా…2009లో కేసీఆర్‌ను పాలమూరు జిల్లా భుజాలపై మోసిందని గుర్తు చేశారు. పాలమూరులో ఏ ప్రాజెక్టు నిర్మించినా కొల్లాపూర్‌ ప్రజల భూములే గుంజుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే కాంగ్రెస్‌ ప్రభుత్వంలో భూ నిర్వాసితులందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 2018లో కొల్లాపూర్‌లో కాంగ్రెస్‌ను గెలిపించారు కానీ అభివృద్ధి ముసుగులో ఆ నల్లికుట్లోడు దొరగారి దొడ్లో చేరాడని ఎద్దేవా చేశారు. పాలమూరు ప్రజలు జెండాలను, ఎజెండాలను పక్కనబెట్టి కాంగ్రెస్‌ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
పాలమూరు జిల్లాలో 14 సీట్లను గెలిపించాలని కోరారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టుకునేందుకు రూ. 5లక్షలు, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. డిసెంబర్‌ 9న రూ.2లక్షల రుణమాఫీ చేస్తుందనీ, రైతులు బ్యాంకులకు ఒక్క రూపాయి చెల్లించొద్దని పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామనీ, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తామని పునరుద్ఘాంటించారు.
వచ్చే ఎన్నికల్లో ఆదివాసీలకు సముచిత స్థానం కల్పించాలి ఆదివాసీ దినోత్సవంలో బెల్లయ్య నాయక్‌
వచ్చే ఎన్నికల్లో ఆదివాసీలకు సముచిత స్థానం కల్పించాలని ఆదివాసీ కాంగ్రెస్‌ చైర్మెన్‌ డాక్టర్‌ బెల్లయ్యనాయక్‌ టీపీసీసీని కోరారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఇందిరాభవన్‌లో ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 79 స్థానాల్లో గిరిజన, ఆదివాసీల ఓట్లు అభ్యర్థులను గెలిపించడంలో కీలకపాత్ర పోషిస్తారని తెలిపారు. దేశంలో చాలా రాష్ట్రంలో ఆదివాసీలకు ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఆదివాసీలు జనరల్‌ స్థానాల్లో పోటీ చేసి గెలుపొందారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్‌, ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ రోహిత్‌ చౌదరి మాట్లాడారు.

Spread the love