– పర్మినెంట్‌కు నోచుకోని రెండో ఏఎన్‌ఎంలు
– 15-20 ఏండ్ల కాంట్రాక్టు సర్వీస్
– డీఎస్సీ ద్వారా మెరిట్ ఆధారంగా నియామకం
– ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో 36 రకాల రిజిస్టర్ల నమోదు
– కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి వైద్య సేవలు
– తాజా నోటిఫికేషన్‌తో ఇంటికి పంపే కుట్ర
– యథావిధిగా పర్మినెంట్ చేయాలని 16 నుంచి సమ్మె
‘తెలంగాణ ఏర్పడితే కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ విధానమనేదే ఉండదు. అందరూ ప్రభుత్వ ఉద్యోగులవుతారు. ప్రస్తుతం ఆ పద్ధతిలో పనిచేస్తున్న వారందర్నీ రెగ్యులర్ చేస్తాం’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ కాలంలో చెప్పారు. తెలంగాణ ఏర్పడి పదేండ్లు కావస్తున్నా వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు సర్వీస్‌లో 15-20 ఏండ్లు ఉన్న మమ్ముల్ని ఎందుకు పర్మినెంట్ చేయట్లేదని రెండో ఏఎన్‌ఎంలు ప్రశ్నిస్తున్నారు. తాజాగా నియామకాల నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం ఈ రెండో ఏఎన్‌ఎంలను ఇంటికి పంపేందుకు కుట్ర చేస్తోంది. కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి వైద్య సేవలందించిన తమను నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండానే పర్మినెంట్ చేయాలని రెండో ఏఎన్‌ఎంలు కోరుతున్నారు.
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో రెండో ఏఎన్‌ఎంలను కాంట్రాక్టు పద్ధతిలో నియమించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, కమ్యూనిటీ ఆస్పత్రులు, జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో పనిచేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల మంది రెండో ఏఎన్‌ఎంలున్నారు. సిద్దిపేట జిల్లాలో 130 మంది, సంగారెడ్డిలో 95 మంది, మెదక్‌లో 119 మంది కలిపి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 344 మంది పనిచేస్తున్నారు.
పని ఎక్కువ..జీతం తక్కువ
రెండో ఏఎన్‌ఎంలకు పని ఎక్కువ.. జీతం తక్కువగా ఉంది. 36 రకాల రిజిస్టర్లను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతిలో నమోదు చేయాలి. డయేరియా, మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులకు సంబంధించి సర్వే చేసి రక్త నమూనాలు సేకరించాలి. డ్రై డే, ప్రైడే, పల్స్‌ఫోలియో, పిల్లలకు వివిద రకాల టీకాలు వేయించడం, గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య సేవలు అందించడం, జాతీయ ఆరోగ్య మిషన్‌లో భాగంగా అనేక రకాల కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. కరోనా కష్ట కాలంలో ఇంటింటికీ తిరిగి క్యారంటెన్ ముద్రలు వేసి మెడికల్ కిట్లను అందజేశారు. ఆ సందర్భంగా కొందరు రెండో ఏఎన్‌ఎంలకు కరోనా వైరస్ ప్రబలడంతో.. వారి నుంచి కుటుంబ సభ్యులకు వచ్చింది. కొందరు ఏఎన్‌ఎంలు కరోనా వల్ల మరణించారు. పగలంతా వైద్య సేవలకు సంబంధించిన డ్యూటీలు చేసి.. రాత్రివేళల్లో 36 రకాల రికార్డులను ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. డీఎంహెచ్‌ఓ, డాక్టర్లు, కమిషనరేట్ నుంచి సమీక్షలకు వెళ్లాలి. తరచూ అడిగే డేటా వివరాలు ఇవ్వాలి. ఇన్ని పనులు చేస్తే ప్రభుత్వం ఇచ్చేది రూ.25 వేల వేతనమే. పీఆర్‌సీ వర్తింప చేయకపోవడంతో జీతాలు పెరగట్లేదు.
నోటిఫికేషన్ పేరిట ఇంటికి పంపే కుట్ర
ప్రభుత్వం ఎంపీ(ఎఫ్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ 2/2023ను జారీ చేసింది. 1520 పోస్టుల భర్తీ కోసం రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తామని అధికారులు ప్రకటించారు. కాంట్రాక్టు సర్వీస్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు 20 మార్కులు సర్వీస్ వెయిటేజ్ ఇచ్చారు. మిగిలిన 80 మార్కులు పరీక్షలో తెచ్చుకోవాలని నిబంధన పెట్టారు. వయో పరిమితి 44 ఏండ్లుగా ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అదనంగా 5 ఏండ్ల సడలింపు ఇచ్చారు. నోటిఫికేషన్ ప్రకారం 49 సంవత్సరాలు దాటిన వాళ్లెవ్వరూ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కారు. దీంతో ఇన్నాళ్లుగా కాంట్రాక్టు సర్వీసులో పనిచేస్తున్న రెండో ఏఎన్‌ఎంలు, ఈసీ ఏఎన్‌ఎంలు, అర్బన్ హెల్త్ సెంటర్ ఏఎన్‌ఎంలు, హెచ్‌ఐఆర్ ఏఎన్‌ఎంల పేరిట పనిచేస్తున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 15 నుంచి 20 ఏండ్ల సర్వీస్ ఉన్న వాళ్లల్లో ఎక్కువ మంది వయో పరిమితి దాటిపోయారు. వీరందర్నీ ఇంటికి పంపే ప్రమాదముంది. 20 ఏండ్ల కిందట ఏఎన్‌ఎం కోర్సు చదివి కాంట్రాక్టు సర్వీస్‌లో పనిచేస్తున్న వాళ్లు.. పోటీ పరిక్షలో ఇప్పటి అభ్యర్థులతో ఎలా పోటీ పడి మెరిట్ సాధించగల్గుతారనేది ప్రశ్నార్థకంగా మారింది.
యథావిధిగా పర్మినెంట్ చేయకపోతే సమ్మె
తమ సర్వీస్‌ను గుర్తించి మెరిట్ ఆధారంగా వెయిటేజ్ ఇచ్చి రెగ్యులర్ చేయాలని రెండో ఏఎన్‌ఎంలు డిమాండ్ చేస్తున్నారు. వారం రోజులుగా వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు విన్నవించారు. అయినా పట్టించుకోలేదు. దీంతో ఈనెల 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపడతామని ఏఎన్‌ఎంలు ప్రకటించారు. రాష్ట్రంలో కాంట్రాక్టు సర్వీస్‌లో పనిచేస్తున్న 5 వేల మంది ఏఎన్‌ఎంలు డీఎస్సీ ద్వారా నియమించబడ్డారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్స్, రోస్టర్, మెరిట్ ప్రకారం ఎంపిక అయ్యారు. వీరి సీనియారిటీ, సేవల్ని గుర్తించి రెగ్యులర్ చేయాల్సిన ప్రభుత్వం పట్టించుకోలేదు. వైద్య ఆరోగ్య శాఖలోని కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణకు సంబంధించిన విధివిధానాల విషయంలో ప్రభుత్వం ద్వంద ప్రమాణాలు అనుసరిస్తుందన్న విమర్శలున్నాయి. కాంట్రాక్టు మెడికల్ ఆఫీసర్లను మెరిట్ ఆధారంగా సర్వీస్‌కు వెయిటేజి ఇచ్చి రెగ్యులర్ చేశారు. అదే పద్ధతిలో రెండో ఏఎన్‌ఎంలను కూడా రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
కాంట్రాక్టు ఏఎన్‌ఎంలను రెగ్యులర్ చేయాలి
ఎం.యాదగిరి, తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర కార్యదర్శి
ఈ నెల 16 నుంచి సమ్మె చేపడతాం. వైద్య సేవల్ని స్తంభింపచేస్తాం. కాంట్రాక్టు సర్వీస్‌లో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలను రెగ్యులర్ చేయాలి. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌కు సంబంధం లేకుండా ప్రస్తుతం పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలి. వీరంతా డీఎస్సీ, ఇతర నిబంధనల ప్రకారం నియమించబడ్డారు. వారం రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
16 ఏండ్లుగా సేవ చేస్తున్నం..
జ్యోతి, రెండో ఏఎన్‌ఎం, పెద్దశంకరంపేట
2008 డీఎస్సీ ద్వారా మమ్మల్ని నియామకం చేశారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్లు, మెరిట్ ప్రకారం ఎంపిక చేశారు. తక్కువ జీతంతో పనిచేస్తున్నాం. మొదటి ఏఎన్‌ఎంలతో సమానంగా పని చేస్తున్న మాకు రూ.25 వేల జీతం.. వారికేమో రూ.80 వేల జీతమిస్తున్నారు. నోటిఫికేషన్‌తో నిమిత్తం లేకుండా మమ్ముల్ని రెగ్యులర్ చేయాలి. ఉద్యమ కాలంలో కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి.