గజ్వేల్‌ నుంచి.. కేటీఆర్‌..

– స్థానిక బీఆర్‌ఎస్‌లో రెండు గ్రూపులు
– ఇతరులెవ్వరు పోటీ చేసినా నెగిటివ్‌ ఫలితం
– ఇంటలిజెన్స్‌ రిపోర్టుతో తెరపైకి యువరాజు పేరు
– కామారెడ్డి లేదా పెద్దపల్లిలో కేసీఆర్‌..!
– మెదక్‌ ఎంపీ సీటుపై వంటేరు కన్ను
ఇప్పటి వరకూ కేసీఆర్‌ అంటే గజ్వేల్‌.. గజ్వేల్‌ అంటే కేసీఆర్‌ అంటారు.. ఇక నుంచి గజ్వేల్‌ అంటే కేటీఆర్‌.. కేటీఆర్‌ అంటే గజ్వేల్‌ కానుందా..? అంటే అవుననే చర్చ నడుస్తోంది. తండ్రి స్థానంలో తనయుడు పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. దాంతో సీఎం కేసీఆర్‌ కామారెడ్డి లేదా పెద్దపల్లికి షిఫ్ట్‌ అవుతారనే చర్చ సాగుతోంది. ఉత్తర తెలంగాణలో పట్టుబిగించేందుకు ఆ ప్రాంతంలో కేసీఆర్‌ పోటీ చేయాలనే వ్యూహంలో భాగంగానే ఈ మార్పులకు అవకాశముందంటున్నారు. కేసీఆర్‌ స్థానంలో కేటీఆర్‌ గజ్వేల్‌కు వస్తే గెలుపు సునాయాసం కావడమే కాకుండా స్టార్‌ క్యాంపెయినర్‌గా ఇతర జిల్లాలకు ఎక్కువ సమయం ఇవ్వడానికి వీలుంటుందనే ఆలోచన చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014, 2018లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్‌పై పోటీ చేసిన వంటేరు ప్రతాప్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరడంతో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మెన్‌ పదవి ఇచ్చారు. అప్పటి నుంచి గజ్వేల్‌ నియోజకవర్గంలో విపక్షాల ఉనికే లేకుండా పోయింది. బీఆర్‌ఎస్‌గా పార్టీ పేరు మారినందున కేసీఆర్‌ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశముంది. అందుకే వచ్చే ఎన్నికల్లో ఆయన గజ్వేల్‌ నుంచి కాకుండా కామారెడ్డి లేదంటే పెద్దపల్లి.. పరిస్థితులను బట్టి మరో చోటి నుంచి పోటీ చేయొచ్చంటున్నారు. మహారాష్ట్రలోని ఓ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి అక్కడ పట్టు బిగించాలని చూస్తున్నట్టు కూడా తెలుస్తోంది. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ కామారెడ్డి నుంచి పోటీ చేయబోతున్నట్టు వెల్లడించారు. అదే జరిగితే గజ్వేల్‌ నుంచి ఎవరు పోటీ చేస్తారనే చర్చ ముందుకొచ్చింది. స్థానికంగా బీఆర్‌ఎస్‌ బలంగానే ఉంది. కానీ..! పార్టీలో గ్రూపులున్నాయి. అనైక్యత వల్ల కేసీఆర్‌ తప్ప ఇంకెవ్వరు పోటీ చేసినా బీఆర్‌ఎస్‌కు నెగిటివ్‌ ఫలితం వస్తుందంటూ ఇంటలిజెన్స్‌ చేసిన సర్వేలో తేలడంతో కేటీఆర్‌ పోటీ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నట్టు బీఆర్‌ఎస్‌ శ్రేణులు చెబుతున్నాయి.
గజ్వేల్‌ సెంటిమెంట్‌ కోసమే కేటీఆర్‌ పేరు పరిశీలన
అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్‌ దేశ రాజకీయాల్లో యాక్టివ్‌ అయితే రాష్ట్ర రాజకీయాల్లో కేటీఆర్‌కు పట్టాభిషేకం చేస్తారనే చర్చ కూడా ఉంది. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు మెజార్టీ వచ్చాక ముఖ్యమంత్రిగా తాను కాకుండా తనయుడిని చేయాలనుకుంటున్న కేసీఆర్‌ తన సెంటిమెంట్‌కు కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెబుతున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో వర్గల్‌ మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ… గజ్వేల్‌ నుంచి ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే అదే పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనేది ఆనవాయితీ అని తెలపారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఈ నియోజకవర్గం నుంచి అందరికీ కలిసి వచ్చిందని, పోటీ చేసి గెలిచిన వారు కీలక పదవుల్లో ఉన్నారని, ఈ సెంటిమెంట్‌ను నమ్ముకునే నేనూ బరిలోకి దిగానని.. ఆయన అన్న మాటలకు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అదే సెంటిమెంట్‌తో రాబోయే ఎన్నికల్లో యువరాజుకు పట్టాభిషేకం చేయాలని భావిస్తున్న కేసీఆర్‌.. గజ్వేల్‌ నుంచి కేటీఆర్‌ను పోటీకి సిద్దం చేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కేసీఆర్‌ కుటుంబానికి గజ్వేల్‌ సేఫ్‌ జోన్‌గా మారింది. ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్న గజ్వేల్‌లో కేటీఆర్‌ పోటీ చేస్తే గెలుపు ఖాయమే కాకుండా భవిష్యత్‌లోనూ సొంతింటి మకాంగా మారనుందంటున్నారు.
ఇంటలిజెన్స్‌ సర్వే ఫలితంతోనే కేటీఆర్‌ పేరు తెరమీదికి..
బీఆర్‌ఎస్‌కు కంచుకోటగా ఉన్న గజ్వేల్‌ నుంచి ఇతర నాయకుల్ని పోటీకి దించితే ఎలా ఉంటుందనే విషయంపై సీఎం కేసీఆర్‌ దృష్టి సారించి ఇంటలిజెన్స్‌ సర్వేకు ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పార్టీలో ఉన్న గ్రూపుల వల్ల కేసీఆర్‌ కాకుండా ఇతరులెవ్వరు పోటీ చేసినా ఓడిపోయే పరిస్థితి ఉందని వారి సర్వేలో తేలినట్టు విశ్వసనీయ సమాచారం. బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మున్సిపల్‌ చైర్మెన్‌ రాజమౌళితో పాటు మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ ఒక గ్రూపుగా ఉన్నారు. అటవీ అభివృద్ధి సంస్థ చైర్మెన్‌గా ఉన్న వంటేరు ప్రతాపరెడ్డి ఒక గ్రూపుగా ఉన్నారు. గ్రూపుల లొల్లితో కేసీఆర్‌ లేదా కేటీఆర్‌ తప్ప ఇతరులెవ్వర్ని పోటీ చేయించినా బీఆర్‌ఎస్‌కు వ్యతిరేక ఫలితాలు వస్తాయని సర్వేలో స్పష్టమైంది. దాంతో కేసీఆర్‌ ఇతర అభ్యర్థుల పరిశీలనను పక్కన పెట్టి తన స్థానంలో కేటీఆర్‌ను పోటీ చేయించాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. అందు కోసం స్థానిక నాయకుల్ని ఒప్పించేందుకు తన ఫామ్‌హౌస్‌లో నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో బేటీ అయ్యేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.వేల కోట్లతో పలు అభివృద్ధి పనులూ చేశారు. జిల్లా స్థాయిలో ప్రభుత్వాస్పత్రి, సమీకృత భవనాలు, కేజీ టు పీజీ ఎడ్యుకేషన్‌ హబ్‌, సంగాపూర్‌ రోడ్డులో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల కాలనీ, దేశంలోనే అతిపెద్ద నాన్‌వెజ్‌ మార్కెట్‌ నిర్మాణం, రీజినల్‌ రింగ్‌ రోడ్‌, రాజీవ్‌ రహదారి అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి, ఆడిటోరియం, కోర్టు, బస్టాండ్‌ వంటి అభివృద్ధి పనులు కేటీఆర్‌కు కలిసిరానున్నాయి. కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌ కూడా గజ్వేల్‌ నియోజకవర్గంóలోనే ఉండటం గమనార్హం.
ఎంపీగా వంటేరుకు ఛాన్స్‌..?
గజ్వేల్‌ నుంచి సీఎం పోటీ చేస్తే తాను టికెట్‌ అడగబోనని, ఆయన చేయకపోతే తనకే టికెట్‌ ఇవ్వాలని వంటేరు ప్రతాపరెడ్డి కోరుతున్నారు. కేసీఆర్‌ పోటీ చేస్తే ఆయన గెలుపునకే పనిచేస్తానంటున్నారు. సీఎం కేసీఆర్‌ కాకుండా మరెవ్వరికీ ఇచ్చినా వంటేరు పోటీ పడే అవకాశాలుంటాయి. కేసీఆర్‌ కాకుండా కేటీఆర్‌ పోటీ చేస్తే వంటేరు టికెట్‌ అడిగే అవకాశంలేదు. దాంతో ప్రతాపరెడ్డి ఎంపీ టికెట్‌ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక నుంచి పోటీ చేయనున్నారు.

Spread the love