అన్ని రంగాల్లో…తెలంగాణ అభివృద్ధి కావాలి

‘కూలిబంధు’ ప్రవేశపెట్టాలి
– మధ్యతరగతి వరకే రైతుబంధు అమలు చేయాలి
– సామాజిక, ఆర్థిక అసమానతలను పోగొట్టాలి
– వృత్తులను ఆధునీకరించే ప్రణాళిక రూపొందించాలి
– అన్ని జిల్లాల్లోని ప్రాజెక్టులపై దృష్టిసారించాలి
– నిరుద్యోగుల్లో అసంతృప్తిపై కేంద్రీకరించాలి
– బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అప్రజాస్వామిక ధోరణులను విడనాడాలి
– హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ
– తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నవతెలంగాణతో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామి కావాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆకాంక్షించారు. రైతుబంధు తరహాలో వ్యవసాయ కార్మికులు, సెంటు భూమి లేని వారికి ‘కూలిబంధు’ను ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. రైతుబంధును వందల ఎకరాలున్న భూస్వాములకు ఇవ్వకుండా పరిమితి విధించాలని కోరారు. మధ్యతరగతి రైతుల వరకే రైతుబంధును అమలు చేయాలని సూచించారు. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక అసమానతలను పోగొట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. వృత్తులను ఆధునీకరించే ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. కాళేశ్వరంతోపాటు అన్ని జిల్లాల్లోని సాగునీటి ప్రాజెక్టులపై కేంద్రీకరించాలని, నిధులు కేటాయించి వాటిని పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అప్రజాస్వామిక ధోరణులను విడనాడాలని, రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాలు, పౌరసమాజంతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. అయితే హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నవతెలంగాణ ప్రతినిధి బొల్లె జగదీశ్వర్‌కు తమ్మినేని ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు…
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రగతిపై ఏమంటారు?
ఈ తొమ్మిదేండ్లలో కొన్ని అంశాల్లో తెలంగాణ మంచి అభివృద్ధి సాధించింది. కొన్ని సంక్షేమ పథకాల అమల్లో దేశంలోనే ముందున్నది. అందుకు మనం సంతోషపడాలి. తలసరి ఆదాయం, జీఎస్‌డీపీలో ముందున్నందుకు గర్వపడాలి. తెలంగాణలో హైదరాబాద్‌ ఉండడం, పారిశ్రామిక సంస్థలుండడంతో ఆదాయం ఎక్కువగా ఉంటున్నది. మనకున్న ఈ వనరులతో మరింత అభివృద్ధి సాధించే అవకాశమున్నది. గత ప్రభుత్వాలతో పోల్చితే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని అభినందించాలి. అభివృద్ధి అనేది ప్రజల జీవితాల్లో మార్పు తేవాలి. కుటుంబాల స్థాయిలో అభివృద్ధిని పరిగణనలోకి తీసుకోవాలి. ఆర్థికం, ఆరోగ్యం, విద్యాస్థాయి, సామాజిక, సాంఘిక హోదా మెరుగుపడినప్పుడే ఆ కుటుంబాలు నిజంగా అభివృద్ధి చెందినట్టు అవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. విద్యావైద్యంలో వెనుకబాటును అధిగమించాలి. సాంస్కృతిక జీవనంలోనూ అభివృద్ధి కావాల్సి ఉన్నది. రాష్ట్రంలో నేటికీ మూఢ విశ్వాసాలు, ఫ్యూడల్‌ సంస్కృతి కొనసాగుతున్నది.
తెలంగాణలో సామాజిక తరగతుల స్థితిగతులపై ఏమంటారు?
కొన్ని పథకాల్లో ఉన్న అహేతుకతను సరిచేయాలి. భూములున్న వారికి రైతుబంధు అమలవుతున్నది. పెట్టుబడి సాయం అందించడం పట్ల మాకు అభ్యంతరం లేదు. దానికి పరిమితిని విధించాలి. వందలకొద్దీ ఎకరాలున్న భూస్వాములకు రూ.లక్షలు ఇవ్వడం సరైంది కాదు. మధ్యతరగతి రైతుల వరకు పరిమితం చేయాలి. ఆ వనరులు ఇతరులకు ఉపయోగించడానికి వీలవుతుంది. భూమి ఉన్న వారికి రైతుబంధు ఉన్నది. మరి భూమి లేకుండా రెక్కల కష్టం మీద ఆధారపడే వ్యవసాయ కార్మికులకు సాయమేదీ?. రెండెకరాలున్న రైతు చనిపోతే రూ.ఐదు లక్షల రైతు బీమా వస్తున్నది. సెంటు భూమి లేని వారు చనిపోతే ఏమీ రావడం లేదు. ఇది అన్యాయం. అందుకే రైతుబంధు తరహాలో ‘కూలిబంధు’ ప్రవేశపెట్టాలి. దళితబంధు తరహాలో బీసీ బంధు పెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఆర్థిక సాయానికి ఆర్థిక స్థితిగతులు ప్రాతిపదికగా ఉండాలి. సామాజిక వెనుకబాటు తనానికి సామాజిక ప్రాతిపదిక ఉండాలి. ఎస్సీలు అంటరానితనం, ఊరికి దూరంగా ఉండడం, వెలివేత వంటి వివక్షను ఎదుర్కొంటున్నారు. దీన్ని నివారించాలి. సామాజిక అసమానతలను, ఆర్థిక అసమానతలను తొలగించే పనిచేయాలి. తెలంగాణ ఏర్పాటు కావడంలో నీటి వనరులకు సంబంధించి ఆంధ్రాకు ఎక్కువ ప్రాజెక్టులు వెళ్లాయన్న చర్చ జరిగింది. ఇప్పుడు తెలంగాణలోనూ కొన్ని జిల్లాలకే నీళ్లు వెళ్లే ప్రాజెక్టులు చేపట్టడం, నిధులు కేటాయించడం సరైంది కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు కొన్ని జిల్లాలకే వెళ్తాయి. ప్రభుత్వం దానిపై కేంద్రీకరించింది. ఉమ్మడి ఖమ్మంకు సీతారామ ప్రాజెక్టు, ఉమ్మడి వరంగల్‌కు దేవాదుల ప్రాజెక్టు, ఉమ్మడి నల్లగొండకు డిండి ప్రాజెక్టు, ఎలిమినేటి మాధవరెడ్డి కెనాల్‌, ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు కల్వకుర్తి ఎత్తిపోతల, ఉమ్మడి రంగారెడ్డికి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను పూర్తి చేయాలి. అది జరిగితే తెలంగాణ అభివృద్ధి మరింత సాకారమవుతుంది.
రాష్ట్రంలో నిరుద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతున్నది. దానిపై ఏమంటారు?
నిరుద్యోగ యువతకు ఆశించిన మేరకు ఉద్యోగాలు కల్పించలేదు. దీంతో నిరుద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతున్నది. దీన్ని ప్రభుత్వం పరిష్కరించాలి. బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించడం లేదు. దీన్ని గుర్తించిన సీఎం కేసీఆర్‌ బీసీలకు రూ.లక్ష సాయం అందిస్తున్నారు. బీసీ వృత్తుల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలి. కల్లు గీత కార్మికుల నీరాను అభివృద్ధి చేయాలి. గొర్రెలకు రుణాలు ఇవ్వడం వరకే పరిమితం కాకుండా మాంసాన్ని ఎగుమతి చేసే సౌకర్యాలను కల్పించాలి. వృత్తులను ఆధునీకరించడం కోసం ప్రణాళిక రూపొందించాలి. చేపల అభివృద్ధికి చర్యలు చేపట్టాలి. ట్యాంకులు, షెడ్డుల్లో రీసైక్లింగ్‌ ఆక్వా కల్చర్‌ను ప్రోత్సహించాలి. వృత్తులకు ప్రోత్సాహం లభించాలి. తెలంగాణలో ఎస్టీలు కూడా ఎక్కువున్నారు. లంబాడాలు, అటవీ ప్రాంతాల్లో కోయలున్నారు. అటవీ సంపదను ప్రాసెస్‌ చేసి ఆ పరిశ్రమల వైపు యువతను ప్రోత్సహించాలి. భద్రాచలంలో ఎదురుబొంగు పరిశ్రమను నెలకొల్పవచ్చు. ఖనిజాలను ప్రయివేటు సంస్థలకు తాకట్టు పెట్టకుండా స్థానిక యువతను ప్రోత్సహించాలి. తాండూరులో నాపరాయి పరిశ్రమను అభివృద్ధి చేయాలి. వివిధ ప్రాంతాల్లోని సహజ వనరులను ప్రాసెస్‌ చేసేందుకు పరిశ్రమలను అభివృద్ధి చేయాలి.
తెలంగాణలో సాంస్కృతిక అభివృద్ధి జరిగిందంటారా?
సాంస్కృతికంగా అభివృద్ధి చేసేందుకు చేపడుతున్న చర్యలు చాలవు. తెలంగాణ భాషను సినిమాల్లో తక్కువ చేసి చూపించేవారు. ఇప్పుడు తెలంగాణ యాసతో సినిమాలు రావడాన్ని అభినందించాలి. ప్రభుత్వం వాటిని ప్రోత్సహించాలి. భాషా సాంస్కృతికాభివృద్ధికి నిపుణులతో కమిటీ వేయాలి. వర్సిటీల్లో పరిశోధనలు చేయాలి. గిరిజన సంస్కృతి గొప్పదనాన్ని, భాషను పరిరక్షించాలి. వారి వాడుక వస్తువులను, కళాఖండాలను సేకరించి వాటిని ప్రదర్శనగా పెట్టాలి. ప్రభుత్వం అందుకు స్థలం కేటాయించి పదిల పర్చడానికి భవనం నిర్మించాలి. అప్పుడే భావితరాలకు వాటిని అందించడానికి వీలవుతుంది. కొన్ని చారిత్రక కట్టడాలను పదిల పరుస్తూనే యాదాద్రి ఆలయం, సచివాలయం వంటి ప్రముఖ కట్టడాలకు రూపకల్పన జరిగింది. మొదట అపోహలు, విమ్శలు వచ్చినా అవి మన సంస్కృతికి ప్రతీకలుగా నిలిచాయి. ప్రాచీన చిహ్నాలున్నాయి. వాటిని పరిరక్షించే కృషి జరగాలి. తెలంగాణ అభివృద్ధి అనేది భాషా సాహిత్యాలు, కళలు వంటి అనేక సాంస్కృతిక విషయాల్లోనూ జరగాలి. ఈ కృషిలో ప్రభుత్వంతోపాటు పౌరసమాజం కూడా భాగస్వామ్యం కావాలి.
భాగస్వామ్యం చేయడంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అనేక పాజిటివ్‌ అంశాలు ఉన్నా కేసీఆర్‌ ప్రభుత్వ అప్రజాస్వామిక ధోరణి వాటిని మసకబారుస్తున్నది. వివిధ విషయాల్లో ప్రజలతో, వివిధ రంగాల పెద్దలు, ప్రతిపక్షాలతో, రాజకీయ పార్టీలతో చర్చించడం ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన చర్య. వారి మాట పాటించడం, పాటించకపోవడం వేరు. ఆలకించడం ముఖ్యమైన విషయం. అది చేయకపోవడం ప్రభుత్వానికి మచ్చ తెస్తున్నది. ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే లౌకిక సిద్ధాంతం పట్ల నిబద్ధతతో వ్యవహరించాలి. బీజేపీ పట్ల ఇప్పుడున్నంత కరుకుగానే భవిష్యత్తులోనూ కొనసాగాలి. మళ్లీ బీజేపీతో సఖ్యత ప్రదర్శిస్తే అవకాశవాదంతో వ్యవహరిస్తే అది ప్రజలకు ప్రమాదం. అదే జరిగితే ఈ ప్రభుత్వం విశ్వసనీయత కూడా దెబ్బతింటుంది. ఈ జాగ్రత్తలు తీసుకుని ప్రభుత్వం ముందుకు సాగాలి.
మునుగోడు ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌కు, కమ్యూనిస్టులకు మధ్య కొంత గ్యాప్‌ వచ్చినట్టుగా కనిపిస్తున్నది ఇది నిజమేనా?
గ్యాప్‌ అని అనుకోవడం లేదు. అప్రజాస్వామిక ధోరణిలో భాగంగా ప్రతి విషయంలో అందరినీ సంప్రదించి ముందుకెళ్లే లక్షణం ఈ ప్రభుత్వానికి లేదు. కమ్యూనిస్టులతో కూడా చర్చించడం తక్కువగా ఉన్నది. దాన్ని సరిచేసుకోవాలి. లెఫ్ట్‌తో కలిసుండడం, వదిలిపెట్టడం సెంటిమెంట్‌ మాత్రమే కాదు. నేటి అవసరం కూడా. కొన్ని జిల్లాల్లో లెఫ్ట్‌ లేకుండా ముందుకెళ్లడం అసాధ్యం. సీపీఐ, సీపీఐ(ఎం)తో కలిసే ఉంటారని భావిస్తున్నాం.
తొమ్మిదేండ్ల కాలంలో సీపీఐ(ఎం) పోరాడి సాధించిన విజయాలు ఎలా ఉన్నాయి?
ప్రతి ప్రజా సమస్యపై సీపీఐ(ఎం) పోరాటాలు సాగిస్తున్నది. తెలంగాణ సాధించిన సంతృప్తి ప్రజల్లో ఉన్నది. అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నారు. కొంత జరిగింది కూడా. ఆ మేరకు ప్రజల కదలికలోనే తేడా ఉన్నది. కొన్ని సెక్షన్ల ప్రజలు కదలికలోకి వస్తున్నారు. కార్మికులు, భూ నిర్వాసితులు, పోడు భూముల గిరిజనులు, స్కీం వర్కర్లు, ఇండ్లు, ఇండ్ల స్థలాల్లేని ప్రజలను కదిలించి పోరాడుతున్న పార్టీ సీపీఐ(ఎం). మిగతా పార్టీలు కేవలం కేసీఆర్‌ను విమర్శిస్తున్నాయి. కానీ పునాది వర్గాల్లో పోరాటాలన్నీ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి.
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మీ సందేశమేంటీ?
తెలంగాణ మరింత అభివృద్ధి కావాలి. మతోన్మాదం, కార్పొరేట్‌ విధానం అభివృద్ధికి ఆటంకం. దాన్ని తెలంగాణలో ప్రవేశించనీయొద్దు. దాన్ని తేవడానికి బీజేపీ సర్వశక్తులూ ఒడ్డి కృషి చేస్తున్నది. రాష్ట్రంలో ఆ పార్టీ పెరిగే పరిస్థితి లేదు. కానీ బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నది. మతోన్మాదం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బండి సంజరు హిందూ ఏక్తా యాత్ర చేశారు. కానీ ప్రజాసమస్యలపై ముఖ్యంగా డబుల్‌ బెడ్రూం ఇండ్లు, భూపంపిణీ, రైతులకు గిట్టుబాటు ధర, పంట నష్టపరిహారం కోసం యాత్ర చేయడం లేదు. రాష్ట్రంలో నాలుగు కోట్ల మందిలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, జైనులు, సిక్కులున్నారు. మెజార్టీగా ఉన్న హిందువుల ఓట్ల కోసం వారు పాకులాడుతున్నారు. రాష్ట్రంలో హిందువులు, ముస్లింల మధ్య చిచ్చు పెట్టే పని చేస్తున్నారు. ఈ వలలో పడొద్దు. తెలంగాణ అభివృద్ధిని కోరుకోవాలి. ప్రజలు, కుటుంబాలు, పిల్లల అభివృద్ధి కావాలి. విద్యావైద్యం, సాంస్కృతిక అభివృద్ధిని కోరుకోవాలి తప్ప మత ఘర్షణల అభివృద్ధి కోరుకోవద్దు. ఈ అప్రమత్తత ప్రజల్లో ఉన్నంత కాలం మతోన్మాదం ఏమీ చేయలేదు. ఆ రకంగా ముందుకు సాగాలి.

Spread the love