రాష్ట్రానికి అగ్రనేతలు

– ముమ్మరంగా ఎన్నికల ప్రచారం
– రిజర్వేషన్లు, రాజ్యాంగంపై వాఖ్యలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదారబాద్‌
లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు వారం రోజులే మిగిలి ఉండటంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఎర్రటిఎండల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. అగ్రనేతల మధ్య మాటల యుద్ధనం నడస్తున్నది. తెలంగాణ వేదికగా రెండు జాతీయ పార్టీల మధ్య విమర్శల యుద్ధం నడుస్తున్నది. 10 నుంచి 12 సీట్లు లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ, ప్రచారాన్ని ముమ్మరం చేసింది. 14 సీట్లల్లో గెలుపే టార్గెట్‌గా పెట్టుకున్న కాంగ్రెస్‌ అగ్రనేతలను బరిలోకి దింపింది. ఆదివారం రాహుల్‌గాంధీ, బీజేపీ నుంచి హోంమంత్రి అమిత్‌షా రాకతో రాష్ట్రంలో ఒక్కసారిగా సీన్‌గా మారిపోయింది. సున్నితమైన అంశాలపై పరస్ఫర విమర్శలు గుప్పించున్నారు. బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని రాహుల్‌ మరోసారి పునరుద్ఘాటించారు.
ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామనీ, ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజ్యాంగాన్ని రద్దుచేయబోమనీ అమిత్‌షా చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి విస్త్రృతంగా ప్రచారంలోకి తెచ్చిన రిజర్వేషన్ల రద్దు అంశాన్ని రాష్ట్రానికి వచ్చిన బీజేపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. ఏప్రిల్‌ 30న ప్రధాని నరేంద్రమోడీ ఉమ్మడి మెడక్‌ జిల్లా పరిధిలో అల్లాదుర్గంలో పర్యటించినన సంగతి తెలిసిందే. ఈ నెల ఒకటిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా హైదరాబాద్‌, ఆదివారం కాగజ్‌నగర్‌, నిజామాబాద్‌, మాల్కాజ్‌గిరిలో జరిగిన సభల్లో మాట్లాడారు. మళ్లీ ఈనెల 9, 10 లేదీల్లో వికారాబాద్‌, భువనగిరి, వనపర్తిలోనూ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సోమవారం ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సికింద్రాబాద్‌, మహబూబ్‌నగర్‌, మహబూబాబాద్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌ థామీ సైతం ఈ మూడు చోట్లా పర్యటించనున్నారు. రాజస్థాన్‌ సీఎం భజన్‌లాల్‌ సికింద్రాబాద్‌ పరిధిలో నిర్వహించే ప్రవాసీ సమ్మెళన్‌లో పాల్గొంటారు. మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, తమిళనాడు బీజేపీ చీఫ్‌ అన్నామలై సైతం రాష్ట్రంలో పర్యటన చేయనున్నారు.
ప్రధాని మోడీ ఈనెల ఎనిమిది, పదో తేదీల్లో ప్రచారం చేయనున్నారు. ఆదివారం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అలంపూర్‌, నిర్మల్‌ సభల్లో పాల్గొన్న విషయం విదితమే. తిరిగి ఈనెల తొమ్మిదిన రాష్ట్రానికి వస్తున్న రాహల్‌, కరీంనగర్‌, సరూర్‌నగర్‌ జనజాతర సభల్లో పాల్గొంటారు. కాంగ్రెస్‌కు చెందిన మరో అగ్రనేత ప్రియాంక గాంధీ ఈనెల 10న రాష్ట్రానికి రానున్నారు. ఆరోజు కామారెడ్డి, తాండూరు, షాద్‌నగర్‌లో ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. ఈ రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అత్యధిక సీట్లల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రచారం ముమ్మరం చేశాయి.

Spread the love