ఇబ్బందులు పడుతున్నాం..

– రెండు నెలలుగా నిలిచిన వేతనాలు
– ఆందోళనలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు
– మా మొర ప్రభుత్వం ఆలకించదా..?
నవతెలంగాణ బ్యూరో-
గూడూరు / హైదరాబాద్‌
అంగన్వాడీి టీచర్లు, హెల్పర్లు వేతనాల కోసం రెండు నెలలుగా ఎదురు చూస్తున్నారు. కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నెల మొదట్లోనే వేతనాలు అందించకపోవడంతో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఆందోళన చెందుతున్నారు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ఐసీడీఎస్‌ ప్రాజెకుల పరిధిలో 65 వేల మంది అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు పని చేస్తున్నారు.మహబూబాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఐదు ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. దీనిలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు కలిపి సుమారు 2500 మంది ఉన్నారు. ప్రభుత్వాలు చేపట్టే ప్రతి సర్వేలోనూ అంగన్వాడీ టీచర్ల పాత్ర కీలకం. పనిభారం పెరుగుతున్నప్పటికీ సమయానికి వేతనాలు అందకపోవడంతో కుటుంబ పోషణ వారికి భారంగా మారింది. వారు అందిస్తున్న సేవలను ప్రభుత్వం గుర్తించడం లేదన్న విమర్శ ఉంది. ప్రతి నెలా 14వ తేదీన రావాల్సిన వేతనాలు 2 నెలలు దాటినప్పటికీ ప్రభుత్వం అందించకపోవడంతో సీఐటీయూ ఆధ్వర్యంలో ఈనెల 2న హైదరాబాద్‌లో ఐసీడీఎస్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ, డైరెక్టర్లకు వినతిపత్రాలు అందజేశారు. వేతనాలు వెంటనే అందచేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మెయిల్‌ ద్వారా కోరారు. మార్చి, ఏప్రిల్‌ నెలలకు సంబంధించిన వేతనాలు అందజేయాలని కోరారు. మా మొర ఆలకించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
వేతనాలను తక్షణమే అందించాలి
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.విజయలక్ష్మి
రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు రెండు నెలల వేతనాలను తక్షణమే ప్రభుత్వం అందచేయాలి. వారికి పీఎఫ్‌, ఈఎస్‌ఐ కూడా వర్తింపజేయాలి. ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు. లేనిపక్షంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తాం.
ఇబ్బందులు పడుతున్నాం..
సరస్వతి, అంగన్వాడీ టీచర్‌, చింతగూడెం
సకాలంలో వేతనాలు అందక ఇబ్బందులకు గురవుతున్నాం. తక్షణమే ప్రభుత్వం రెండు నెలల వేతనాలు అందించి ఆదుకోవాలి. కుటుంబ పోషణ భారంగా మారింది. ఏజెన్సీలో విధులు నిర్వహిస్తున్న మాకు సమయానికి వేతనాలు ఇచ్చి అండగా నిలవాలి.
వేతనాల కోసం ఎదురుచూస్తున్నాం
పి.తిరుపతమ్మ, పాతమచర్ల, గూడూరు
వేతనాలు ఎప్పుడు వస్తాయో అని ఎదురు చూడవలసిన పరిస్థితి నెలకొంది. చాలీచాలని వేతనాలతో సమస్యలతో సతమతమవుతున్నాం. కొద్దిపాటి జీతమైనా నిత్యం సేవలందిస్తున్నాం. నిలిచిపోయిన రెండు నెలల వేతనాలు వేసి ప్రభుత్వం ఆదుకోవాలి. అంగన్వాడి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి.

అంగన్‌వాడీల వేతన బకాయిలు చెల్లించాలి : సీఎంకు తమ్మినేని లేఖ
అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు 2024 మార్చి, ఏప్రిల్‌ వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన సీఎంకు ఒక లేఖ రాశారు. రాష్ట్రంలో 48 ఏండ్లుగా 65వేల మంది అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు ఐసీడీఎస్‌ ద్వారా సేవలందిస్తున్నారని తెలిపారు. వీరంతా బడుగు, బలహీనవర్గాలకు చెందిన మహిళలేనని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతి నెలా 14వ తేదీన వేతనాలు చెల్లించిందనీ, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు నెల్ల నుంచి వేతనాలు చెల్లించలేదని తెలిపారు. దీంతో అంగన్‌వాడీలు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. కుటుంబ అవసరాల కోసం అధిక వడ్డీలకు అప్పులు చేసే స్థితికి నెట్టబడుతున్నారని గుర్తుచేశారు. అందువల్ల వారికి ప్రభుత్వం బకాయి ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. అంగన్‌వాడీ ఉద్యోగులకు కనీస వేతనం, పిఎఫ్‌, ఈఎస్‌ఐ తదితర సౌకర్యాలు లేవని తెలిపారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల వల్ల ఒక కుటుంబం బతకాలంటే కనీసం రూ.26వేలు అవసరమవుతాయని గుర్తు చేశారు. కానీ అంగన్‌వాడీ టీచర్లకు రూ.13,650లు, హెల్పర్లకు రూ.7,800లు మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. దీనిపై గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందనీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం తక్కువ వేతనాలను కూడా సకాలంలో చెల్లించకపోవడం సరైందికాదని పేర్కొన్నారు.

Spread the love