50 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించాలి

– పీఆర్సీ చైర్మెన్‌కు జీజేఎల్‌ఏ ప్రతిపాదనలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని ఉద్యోగులకు 50 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించాలని ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్ల సంఘం (జీజేఎల్‌ఏ) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు పీఆర్సీ చైర్మెన్‌ శివశంకర్‌ను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి మధుసూదన్‌రెడ్డి నేతృత్వంలో సోమవారం హైదరాబాద్‌లో కలిసి ప్రతిపాదనలను సమర్పించారు. కనీస వేతనం రూ.35 వేలుండాలని కోరారు. పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా వేతన సవరణ చేయాలని సూచించారు. రాష్ట్రంలో పెరిగిన తలసరి ఆదాయం, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ నిధులకు తోడు, భారీగా రుణాలు సేకరించి ఖర్చు చేయడం ద్వారా ద్రవ్య సరఫరా పెరిగి సగటు జీవన వ్యయం (వినియోగ వ్యయం) మిగతా రాష్ట్రాల కంటే పెద్ద ఎత్తున పెరిగిందని వివరించారు. తద్వారా జీతభత్యాలపై ఆధారపడే వేతన జీవుల జీవన ప్రమాణాలపైన తీవ్ర ప్రభావం పడిందనీ, దీన్ని ఆధారంగా చేసుకుని వేతన సవరణ చేపట్టాలని కోరారు. ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీం 5/10/15/20/25గా ఉండాలని సూచించారు. హెచ్‌ఆర్‌ఏ గ్రామాల్లో 15 శాతం, మున్సిపాల్టీల్లో 18 శాతం, జిల్లా కేంద్రాల్లో 20 శాతం, జీహెచ్‌ఎంసీలో 27 శాతం ఉండాలని తెలిపారు. గ్రాట్యూటీ రూ.25 లక్షలుండాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్‌ను నియమించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్‌ విద్యా జేఏసీ నాయకులు కృష్ణ కుమార్‌, కేఎస్‌ రామారావు, రవీందర్‌రెడ్డి, రామానుజాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love