పేదల జోలికొస్తే ఖబడ్దార్‌

భూపోరాటం నుంచి వెనక్కి తగ్గం
 జీవించే హక్కు కోసం మహిళలు పోరాడాలి
 బీజేపీపై పోరులో కేసీఆర్‌ సర్కారుకు తోడ్పాటు
 కానీ గుడిసెలపైకి బుల్డోజర్లు పంపితే ఊరుకోం..
 మోడీ విధానాలతో ప్రమాదంలో లౌకికవాదం : మహబూబాబాద్‌ బస్సుయాత్ర సభలో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
భూపోరాటం నుంచి వెనక్కి తగ్గమని, పేదల జోలికొస్తే ఊరుకోమని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ స్పష్టం చేశారు. ఆదివారం మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో సీపీఐ(ఎం) మహబూబాబాద్‌ జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్‌ అధ్యక్షతన నిర్వహించిన బస్సు యాత్ర ప్రారంభ బహిరంగసభకు బృందా కరత్‌ హాజరై మాట్లాడారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 జీవించే హక్కును దేశ పౌరులందరికీ ప్రసాదించిందన్నారు. జీవించే హక్కు కల్పించడమంటే పౌరుడి రక్షణకు నీడ కల్పించడమని వివరించారు.. మరి నీడలేని పేదలు గుడిసెలేసుకుంటే దాడులెందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. మహబూబాబాద్‌ జిల్లాలో 40 శాతం గిరిజనులున్నారన్నారు. వీరంతా పేదరికంలో ఉన్నారని తెలిపారు. మహబూబాబాద్‌ జిల్లాకేంద్రంలో పేదలు గుడిసెలు వేసుకుంటే పోలీసులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. మహిళలపై దాడులు చేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు కోసం మహిళలంతా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మహిళలంతా భూపోరాటంలో ఐక్యంగా పాల్గొని ఇండ్ల స్థలాలను సాధించాలన్నారు. మీ పోరాటానికి అండగా ఉంటామని స్పష్టంచేశారు.
బీజేపీ విధానాలను తిప్పికొడతాం..
బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఐక్య సంఘటన ఏర్పడాల్సిన అవసరముందని బృందా కరత్‌ అన్నారు. కేంద్రంలో ప్రధాని మోడీ పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్నారని విమర్శించా రు. మోడీ విధానాలతో దేశంలో లౌకికవాదం ప్రమాదంలో పడిందన్నారు. మోడీ 75 ఏండ్ల స్వాతంత్య్ర ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన అమృతోత్సవ్‌ కార్యక్రమం అంటే ఏమిటో దేశ ప్రజలకు ఎవరికీ తెలియదన్నారు. బీజేపీ పాలనలో పెట్టుబడిదారుని ఒక్కరోజు ఆదాయం రూ.1,216 కోట్లు ఉంటుంటే.. ఒక గిరిజన మహిళకు రోజు కూలీ రూ.250 కూడా లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ అంటూ బీజేపీ నేతలు కొత్త నినాదాన్ని తెచ్చారని, కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ సర్కార్‌ ఉంటే డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ అని నిర్వచిస్తున్నారన్నారు. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో సీఎం యోగి బుల్డోజర్‌ పేదల ఛాతిని తొక్కుతూ పోతుందన్నారు.
ఎర్రజెండా ఊరుకోదు..
బీజేపీపై పోరాడుతామని సీఎం కేసీఆర్‌ చెబుతున్నారని, ఇందుకు మన తోడ్పాటు ఉంటుంద న్నారు. కాని ఇక్కడ కూడా పేదలపై బుల్డోజర్‌ నడిపిస్తే ఎర్రజెండా ఊరుకోదన్నారు. ఈ భూపోరా టం విజయవంతమయ్యే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.మహబూబాబాద్‌లో కలెక్టర్‌ భూపో రాటం చేస్తున్న పేద మహిళలపై దాడులు చేయిం చారని,వారి ప్రయత్నాలు ఫలించవని, ఎర్రజెండా నేతృత్వంలో ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.
మీ అబ్బ సొత్తా..?
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల నిధులు ఇచ్చినట్టు చెబుతున్నారని, మీ అబ్బ సొత్తు ఇస్తున్నారా అని కిషన్‌రెడ్డిని ప్రశ్నించారు. ప్రజలు చెల్లించే పన్నుల నుంచే రాష్ట్రాలకు నిధులను కేటాయిస్తున్నారని గుర్తు చేశారు. అందులోనూ రాష్ట్రాలకు అన్యాయమే జరుగుతోందని విమర్శించారు. మహబూబాబాద్‌ పట్టణంలో పోలీసుల దాడిలో గాయపడ్డ మహిళలను బృందాకరత్‌ పరామర్శించారు. వారు చేస్తున్న పోరాటాన్ని అభినందించారు.
పోరాటం ఆగదు : ఎస్‌.వీరయ్య
ఎన్ని దాడులు చేసినా భూపోరాటం ఆగదని తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్‌ ఎస్‌.వీరయ్య అన్నారు. తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక నేతృత్వంలో ఈరోజు నుంచి ఈనెల 27వ తేదీ వరకు రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 61 భూపోరాట కేంద్రాలలో ఈ జాత తిరుగుతుందన్నారు. 48 వేల మంది పేదలు ఇండ్ల కోసం గుడిసెలు వేసుకొని భూపోరాటంలో పాల్గొంటున్నారన్నారు. మహబూబాబాద్‌లో మహిళలపై దాడులు చేయడంలో భాగంగా పోలీసులు ఇష్టమొచ్చిన చోటా చేతులు వేసే ప్రయత్నం చేశారన్నారు. పోలీసుల కుటుంబాల్లో ఆడోళ్లు లేరా అని ప్రశ్నించారు. మహబూబాబాద్‌లో 5 వేల ఎకరాలు కబ్జా చేస్తే మీరేం చేశారని పోలీసులు, రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. వరంగల్‌ జక్కలొద్ది భూ పోరాటం మొదలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న భూపోరాటాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధం విధించిందన్నారు. జనగామలో భూపోరాటం చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారని, ఆ పోరాటంలో పాల్గొన్నవారంతా ఎస్సీ, ఎస్టీలేనని గుర్తించని పోలీసులకు కనీసం మెడపై తలకాయ ఉన్నట్టు లేదన్నారు. ఇండ్లు సాధించే వరకు ఈ పోరాటం ఆగదన్నారు.అధ్యక్షత వహించిన సాదుల శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఓటేసిన వాళ్లకే ఇండ్లు ఇవ్వలేదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం దేశంలో పేదోన్ని పాతాళానికి తొక్కితే, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదల ఇండ్ల విషయంలో అశ్రద్ధ వహిస్తుందన్నారు. కోటి ఇండ్లు కట్టిస్తామని మంత్రివర్గంలో నిర్ణయించిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. సభకు ముందు పట్టణంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సభలో బస్సు జాత బృందం సభ్యులు టి.సాగర్‌, ఆర్‌.వెంకట్రాములు, మల్లు లక్ష్మీ, వంగూరు రాములు, టి.స్కైలాబ్‌బాబు, పైళ్ల ఆశయ్య, కోట రమేష్‌, రాష్ట్ర నాయకులు డీజీ నర్సింగరావు, పాలడుగు భాస్కర్‌, మాచర్ల భారతి జిల్లా నేతలు గునిగంటి రాజన్న, సూర్నపు సోమయ్య, ఆకుల రాజు, అలువాల వీరయ్య, ఆంగోతు వెంకన్న, సీతారాంనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.
కబ్జా భూముల్లో ఎర్రజెండాలు పాతుతాం : జి. నాగయ్య
మహబూబాబాద్‌ పట్టణంలో సర్వేనెంబర్‌ 551, 287, 255లోని 3 వేల ఎకరాలు, మరో పది సర్వేనెంబర్‌లలో 2 వేల ఎకరాల భూములున్నాయని,ఈ భూములను అసైన్డ్‌ చేసినట్టు అధికారులు ప్రకటించాలని, లేనిపక్షంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, కబ్జాదారుల భూముల్లో ఎర్రజెండాలు పాతుతామని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య హెచ్చరించారు. భూపోరాటం చేస్తున్న సీపీఐ(ఎం)పై దుష్ప్రచారం చేయడం మానుకోవాలని అధికారులకు హితవు పలికారు. మీ అవినీతిని బయటపెడుతామని హెచ్చరించారు. తప్పుడు రిజిస్ట్రేషన్లతో ఆక్రమణకు గురైన భూములను స్వాధీనం చేసుకోవాలని, అధికారులు చర్యలు తీసుకోకపోతే మేమే ఎర్రజెండాలు పాతుతామన్నారు. హన్మకొండ నడిబొడ్డున బాలసముద్రంలో నాటి మంత్రి హయగ్రీవాచారి ఆక్రమించిన 22 ఎకరాలను సీపీఐ(ఎం) 20 ఏండ్లపాటు న్యాయపోరాటం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించిందన్నారు. కలెక్టర్‌తో సహా రెవెన్యూ అధికారులు ఆ భూమి ప్రభుత్వానిది కాదని, అయ్యగారిదేనని సాక్ష్యమిచ్చారని గుర్తు చేశారు. ఈ భూమిని కాపాడి ఇచ్చినందుకు నాటి సీపీఐ(ఎం) నగర కార్యదర్శి జి.రాములుకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చిందన్నారు.

Spread the love