పార్లమెంట్‌లో మణిపూర్‌ సెగలు

– ఉభయసభల్లో చర్చకు ప్రతిపక్షాల పట్టు
– ప్రధాని సమాధానమివ్వాలని డిమాండ్‌
– విపక్షాలిచ్చిన నోటీసులు తిరస్కరణ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మణిపూర్‌ అంశం పార్లమెంటును కుదిపేసింది. అక్కడి అల్లర్లు, మహిళలపై జరుగుతున్న అమానుష ఘటనలపై సభలో చర్చ జరగాల్సిందేనంటూ ప్రతిపక్షాలు పార్లమెంటును స్తంభింపచేశాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌ రాజీనామా చేయాలనీ, పార్లమెంటుకు ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశాయి. లోక్‌సభ, రాజ్యసభల్లోనూ ప్రతిపక్షాలు ఇదే తరహాలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశాయి. ప్రతిపక్ష సభ్యులు ఈ అంశంపై వెల్‌లోకి వెళ్లి ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ చైర్మెన్‌ వారిని తమ స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాలని పలుమార్లు సూచించినా, ప్రతిపక్షాలు పట్టు వీడలేదు. ఒక రాష్ట్రంలో దుర్మార్గమైన హింస చెలరేగుతుంటే, ప్రధాని మౌనంగా ఉండటం ఏంటని తీవ్రంగా విమర్శించాయి. దీనితో ఉభయసభల్లో ఎలాంటి కార్యకలాపాలు జరక్కుండానే సోమవారానికి వాయిదా పడ్డాయి. మంగళవారం ఉదయం లోక్‌సభ, రాజ్యసభలు ప్రారంభంకావడానికి కంటే ముందే మణిపూర్‌ హింసపై చర్చించాలని కాంగ్రెస్‌, సీపీఐ(ఎం), సీపీఐ, బీఆర్‌ఎస్‌, టీఎంసీ సహా పలు పార్టీలు వాయిదా తీర్మాన నోటీసు లిచ్చాయి. కానీ వీటిని లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ చైర్మెన్‌ అనుమతించలేదు. ఆ తీర్మాన నోటీసుల్ని తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో సభలో ఒక్కసారిగా అలజడి ఏర్పడింది. సభలో చర్చించడానికి ఇంతకంటే ప్రధాన సమస్య ఏముందంటూ ప్రతిపక్షాలు వారితో వాగ్వివాదానికి దిగాయి. చర్చ జరగాల్సిందేనంటూ పట్టుబట్టి, వెల్‌లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ అంశంపై కేంద్ర హౌంమంత్రి అమిత్‌ షా సభలో ప్రకటన చేస్తారని స్పీకర్‌ ఓం బిర్లా చెప్పారు. అయినా ప్రతిపక్షాలు వెనక్కి తగ్గలేదు. ప్రధాని మోడీ సభలో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో నిముషాల వ్యవధిలోనే లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. ఆ తరువాత సభ తిరిగి ప్రారంభమైనా, పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదు. ప్రతిపక్ష సభ్యులు అదే డిమాండ్‌తో మళ్లీ అందోళనలకు దిగారు. దీనితో సభను సోమవారానికి (జులై 24) వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.
కేంద్రం ఎదురుదాడి
‘మణిపూర్‌ ఘటన చాలా తీవ్రమైంది. అక్కడ జరిగిన ఘటన యావత్‌ దేశం సిగ్గుతో తలదించుకునేలా చేసిందని స్వయంగా ప్రధాని చెప్పారు. మణిపూర్‌ అంశంపై చర్చించాలని ప్రభుత్వం కోరుకుంటుంది. ప్రతిపక్షాలు చర్చ జరక్కుండా గందరగోళం సష్టిస్తున్నాయి. దీనిపై ప్రతిపక్షాలు సీరియస్‌గా లేవని భావిస్తున్నా’ అంటూ కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. ఈ అంశంపై చర్చకు కేంద్రం సిద్ధమేననీ, దీనిపై కేంద్ర హౌం మంత్రి ప్రకటన చేస్తారని పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ ప్రకటించారు. అయితే, ప్రతిపక్షాలు మాత్రం పార్లమెంట్‌లో చర్చించాల్సిన ఇతర అంశాలను పక్కన పెట్టి.. మణిపూర్‌ అంశంపై మాత్రమే చర్చ జరగాలని డిమాండ్‌ చేస్తున్నాయన్నారు.
సుదీర్ఘచర్చే జరగాలి
మణిపూర్‌ హింస, అక్కడ జరుగుతున్న పరిణామాలపై పార్లమెంటులో సుదీర్ఘ చర్చ జరగాలని కోరుతూ ప్రతిపక్షాలు రూల్‌ 276 కింద అత్యవసర చర్చకు పట్టుపడుతున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో రూల్‌ 176 కింద చర్చకు సిద్ధమని పేర్కొంది. రూల్‌ 176 కింద ఇతర సభా కార్యకలాపాలు పూర్తయ్యాక, సమయాన్ని బట్టి చర్చకు అనుమతి ఇస్తారు. ప్రతిపక్షాలు ఈ ప్రతిపాదనను తిరస్కరించాయి.
మణిపూర్‌ సీఎం రాజీనామా చేయాల్సిందే..
రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్‌ ఖర్గే మాట్లాడుతూ మణిపూర్‌ ముఖ్యమంత్రితో తక్షణం రాజీనామా చేయించాలని డిమాండ్‌ చేశారు. మణిపూర్‌ హింసపై చర్చకు తాము రూల్‌ 267 ప్రకారం నోటీసు ఇచ్చామన్నారు. దీనిపై కేవలం ఓ అరగంట చర్చిస్తే సరిపోదన్నారు. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్‌ చేశారు. ప్రతిపక్షాలు ఈ అంశంపై వెనక్కి తగ్గకపోవడంతో రాజ్యసభను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా పడింది. ఆ తర్వాత కూడా సభలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో సభను సోమవారానికి వాయిదా వేశారు.
మణిపూర్‌ సీఎం రాజీనామా చేయాలి; సీపీఐ(ఎం) డిమాండ్‌
 దేశవ్యాప్తంగా నిరసన కార్యాచరణకై పిలుపు
న్యూఢిల్లీ : మణిపూర్‌ ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూ రో డిమాండ్‌ చేసింది. మణిపూర్‌ లో జరిగిన సంఘటనలను నిరసిస్తూ, మణిపూర్‌ మహిళా బాధితులకు, ప్రజలకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యాచరణ చేపట్టాలని, ముఖ్యమంత్రి రాజీనామాకై డిమాండ్‌ చేయాలని సీపీఐ(ఎం) తన శాఖలకు పిలుపిచ్చింది. ఈ మేరకు పొలిట్‌బ్యూరో ఒక ప్రకటన చేసింది. మణిపూర్‌లో ఇద్దరు గిరిజన మహిళలను వివస్త్రలను చేసి, ఊరేగించిన ఘటనతో దేశం యావత్తు రగిలిపోయింది. పైగా వారిలో ఒక మహిళపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు, ఆమెను కాపాడేందుకు వెళ్లిన ఆమె కుటుంబ సభ్యులు ఇద్దరిని హత్య చేశారు. సంఘటన జరిగిన రెండు వారాల్లోపే బాధిత కుటుంబాలు అత్యంత ధైర్యసాహసాలతో ఫిర్యాదు చేసినప్పటికీ, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినప్పటికీ పోలీసులు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంటే ఈ ఘాతుకానికి పాల్పడిన నేరస్తులకు రక్షణ కల్పించడానికి మణిపూర్‌లోని బీజేపీ ప్రభుత్వం ప్రత్యక్షంగా సాయపడుతోందని పొలిట్‌బ్యూరో విమర్శించింది. రెండున్నర మాసాలుగా రాష్ట్రం మండుతోంది. అయినా ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ అగ్ర నాయకత్వం సమర్ధిస్తూ వస్తోంది. నెలల తరబడి మౌనం పాటిస్తూ వచ్చిన ప్రధాని చిట్టచివరకు చేసిన ప్రకటన జరిగిన సంఘటనను, మణిపూర్‌లో సుదీర్ఘంగా చెలరేగుతున్న హింసాకాండను, పైగా ముఖ్యమంత్రి పక్షపాత పాత్రను ఆయన తేలిగ్గా తీసుకున్నారని తెలియజేస్తున్నదని పొలిట్‌బ్యూరో విమర్శించింది. డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం జవాబుదారీతనం అనే సూత్రాన్ని తుదికంటా సమాధి చేసిందని ఆ ప్రకటన విమర్శించింది. బీజేపీ చేస్తున్న సుపరిపాలన వాదనపై ఇది అత్యంత గ్రాఫిక్‌ వ్యాఖ్యానమని పేర్కొంది.
మోడీ బాధ నిజమే అయితే…సీఎంను బర్తరఫ్‌ చేయాల్సింది : ఖర్గే
మణిపూర్‌లో మహిళలను నగంగా ఊరేగించిన ఘటనను ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిజంగానే తీవ్రంగా పరిగణిస్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌ను ఆయన తొలుత బర్తరఫ్‌ చేసి ఉండేవారని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలపై తప్పుడు ఆరోపణలు చేయడం మాని ముందు మణిపూర్‌ సీఎంను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. మణిపూర్‌ ఘటనపై ప్రధాని నేడు పార్లమెంటులో ప్రకటన చేస్తారని దేశం ఎదురుచూస్తోందన్నారు. 80 రోజులుగా మణిపూర్‌ మండిపోతున్నా ప్రభుత్వం నోరు మెదపలేదని, పూర్తి నిస్సహాయంగా ఉండిపోయిందని, ఎలాంటి పశ్చాత్తాపం చెందలేదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో నేడు పార్లమెంటులో ప్రధాని మోడీ ఈ ఘటనపై ప్రకటన చేస్తారని దేశం మొత్తం ఆశిస్తోందని ట్వీట్‌ చేశారు.

Spread the love