బాయ్ కాట్‌…

రాజ్యాంగ స్ఫూర్తికి భంగమని విమర్శ
పార్లమెంట్‌ భవన ప్రారంభానికి ప్రతిపక్షాలు దూరం
రాష్ట్రపతిని విస్మరించడం ప్రజాస్వామ్యంపై దాడేనని మండిపాటు
పార్లమెంట్‌ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి దూరంగా ఉండాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. తాము ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు 20 పార్టీలు ప్రకటించాయి. కాంగ్రెస్‌, ఆమ్‌ఆద్మీ, తృణమూల్‌ కాంగ్రెస్‌, డీఎంకే, సీపీ (ఐ) ఎం, సీపీఐ, ఆర్‌ఎస్‌పీ, ఆర్జేడీ, జేడీయూ, ఎన్‌సీపీ, సమాజ్‌వాదీ పార్టీ, శివసేన (ఉద్ధవ్‌ ఠాక్రే), జేఎంఎం, వీసీకే, ఆర్‌ఎల్డీ, ఎండీఎంకే, ముస్లింలీగ్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కేరళ కాంగ్రెస్‌, ఎంఐఎం పార్టీలు బుధవారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి.
మోడీ నిర్ణయం అప్రజాస్వామికం
‘రాష్ట్రపతిని పూర్తిగా విస్మరించి, తానే పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభించాలని మోడీ నిర్ణయించడం మన ప్రజాస్వామ్యానికి అవమానకరమే కాకుండా దానిపై దాడి చేయడమే అవుతుంది. రాష్ట్రపతి పదవిని కించపరచడానికే ఇలాంటి అమర్యాదకరమైన చర్యకు పాల్పడుతున్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి కూడా ఇది భంగకరం. రాష్ట్రపతి పదవిని తొలిసారిగా మహిళా ఆదివాసీ నేత చేపట్టినందుకు జాతి యావత్తూ సంబరాలు జరుపుకుంటుంటే ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం ఆ స్ఫూర్తిని తక్కువ చేయడమే అవుతుంది. అప్రజాస్వామిక చర్యలు ప్రధానికి కొత్త కావు. ఆయన పార్లమెంటును ఏనాడూ ఖాతరు చేసింది లేదు. ప్రతిపక్ష సభ్యులను అనర్హులను చేశారు. సభ నుండి సస్పెండ్‌ చేశారు. వారు ప్రజా సమస్యలను లేవనెత్తితే మౌనం వహించారు. ప్రజాస్వామ్య ఆత్మను పార్లమెంట్‌ నుండి గెంటివేస్తే కొత్త భవనంలో ఏమి విలువ ఉంటుంది?’ అని ప్రతిపక్షాలు ఒక సంయుక్త ప్రకటనలో విమర్శించాయి.
న్యూఢిల్లీ :నూతన పార్లమెంట్‌ భవనాన్ని రాష్ట్రపతి కాకుండా తానే ప్రారంభించాలని ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని ఇరవై ప్రతిపక్ష పార్టీలు ముక్తకంఠంతో నిరసిం చాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికలలో రాజకీయ ప్రయోజనం పొందేందుకే ప్రధాని ఈ నిర్ణయం తీసుకు న్నారని మండిపడ్డాయి. కనీసం రాష్ట్రపతికి ఆహ్వానం సైతం అందించక పోవటం దుర్మార్గమని విమర్శించాయి. పైగా జాతీయోద్యమం నుంచి పలాయనం చేసి, బ్రిటీష్‌ వారి సేవలో మునిగిన కరడుకట్టిన హిందూత్వ వాది వీడీ సావర్కర్‌ జయంతి రోజు పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభించడాన్ని కొన్ని పార్టీలు తప్పుపట్టాయి. ప్రతిపక్షాల నిర్ణయంపై బీజేపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కు తున్నారు. అందరినీ ఆహ్వానించామని, రావడం రాకపో వడం వారి విజ్ఞతకే వదిలేశామని హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. ప్రతిపక్షాలు తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషీ కోరారు.
రాష్ట్రపతే ఎందుకు ప్రారంభించాలి?
ఈ నెల 28న జరిగే పార్లమెంట్‌ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. ఈ భవనాన్ని ప్రధాని మోడీ ప్రారంభించడాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతికి, పార్లమెంటుకు విడదీయరాని సంబంధం ఉంది. పార్లమెంటులో రాష్ట్రపతి ఒక భాగం. అందుకే నూతన భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఆ పార్టీ నేతలు మనీష్‌ తివారీ, శశి థరూర్‌లు ఇదే డిమాండ్‌ వినిపించారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ రాజ్యాంగానికి తప్పుడు భాష్యం చెబుతోందని కేంద్ర మంత్రి హర్‌దీప్‌ పూరి విమర్శిం చారు. అయితే దీనిపై తివారీ ఘాటుగానే స్పందించారు. పూరి వేరే రాజ్యాంగాన్ని చదువుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఆయన రాజ్యాంగంలోని 79వ అధికరణను ప్రస్తావించారు. దేశానికి పార్లమెంట్‌ ఉండాలని, అందులో రాష్ట్రపతి, ఉభయసభలు భాగస్వా ములని ఆ అధికరణ చెబుతోందని గుర్తు చేశారు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతికి కార్యనిర్వాహక, శాసనపరమైన, న్యాయప రమైన, అత్యవసర, సైనిక అధికారాలు ఉంటాయి. శాసనప రమైన అధికారాలలో ఉభయ సభలు…. (ఎగువసభ రాజ్యసభ, దిగువసభ లోక్‌సభ) కూడా ఉంటాయి. రాజ్యాంగంలోని 74(1) అధికరణ ఏం చెబుతోందంటే… ‘ప్రధాని నాయ కత్వంలో మంత్రిమండలి పనిచేస్తూ రాష్ట్రపతికి సహాయకారిగా ఉంటూ సలహాలు ఇవ్వాలి. ఆ సలహాల మేరకు రాష్ట్రపతి నడుచుకోవాలి. అయితే ఆ సలహాలను మరోసారి పరిశీలించాలని మంత్రి మండలిని రాష్ట్రపతి కోరవచ్చు. మంత్రిమండలి దానిని పాటించవచ్చు. పాటించకపోవచ్చు. పున:పరిశీలన తర్వాత మంత్రి మండలి ఇచ్చే సలహా ప్రకారం రాష్ట్రపతి నడుచు కోవాల్సి ఉంటుంది’. ఇక 87వ అధికరణ ప్రకారం పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు ప్రతిసారీ రాష్ట్రపతి ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉంటుంది. పార్లమెంట్‌ ఆమోదం పొందిన బిల్లులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయకపోతే అవి చట్టరూపం దాల్చవు. ఈ విధంగా భారత రాజ్యాంగం పార్లమెంట్‌ పనితీరులో రాష్ట్రపతికి ప్రముఖ పాత్ర ఇచ్చింది.

Spread the love