పెరిగిన ఎండలు అల్లాడుతున్న జనం

– ఉదయం 9 గంటల నుండే వేసవి ప్రతాపం
– వీస్తున్న వడగాల్పులు
– ఫ్యాన్లు, కూలర్లను ఆశ్రయిస్తున్న జనావాసులు
– సాయంత్రం ఏడైనా తగ్గని వేడి
– పమ్మిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు
నవతెలంగాణ-ముదిగొండ
ఈ ఏడాది వేసవికాలం ప్రారంభం మార్చి మాసం నుండే తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఎండాకాలం కాదు, మండే కాలంలా దగదగమంటూ ఎండ వేడిమి మెరుపుల మోహరించి జనాన్ని అతలాకుతలం చేస్తోంది. ఏప్రిల్‌ నెలలో పెరిగిన ఎండలతో జనం అల్లాడుతున్నారు. ఉదయం 9 గంటల నుండి ఎండ మిడిసి పడుతుంది. దీంతో మండల ప్రజానీకం బయటికి వెళ్లాలంటే భయపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మిరప తోటలో ఏరటానికి వెళుతున్న కూలీలు ఉదయం ఏడు గంటలకే కూలి కెళ్ళి ఒంటిగంటకు ఇల్లు చేరుతున్నారు. అధిక ఉష్ణోగ్రతతో ఇబ్బంది పడుతూ ఫ్యాన్లు, కూలర్స్‌ ను ఆశ్రయిస్తూ సేద తీర్చుకుంటున్నారు. రేకులు షెడ్లుతో ఉన్న ఇండ్లలో తిరుగుతున్న ఫ్యాన్లు, వేడిగాలులు రావడంతో తట్టుకోలేక జనం నీడ ఉన్న చెట్ల కిందకి చేరి ఊపిరి పీల్చుకుంటున్నారు. ఏసీలు, కూలర్స్‌ కు గిరాకీ పెరిగింది. ఆర్థిక స్తోమత ఉన్నోళ్లు ఏసి, కూలర్స్‌ వాడితే, పేద ప్రజలు చెట్లని కూలర్స్‌గా భావించి సేద తీర్చుకుంటున్నారు. జనవాసులు వేసవి ప్రతాపానికి ఉబ్బతీయడంతో ప్రధానంగా వృద్ధులు, చిన్నారులు ఉక్కిరి, బిక్కిరి అవుతున్నారు. ఉపాధి హామీ పనికి వెళ్లిన కూలీలు పనిచేసే ప్రదేశంలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఎండ తీవ్రతకు ఇబ్బందికి గురవుతున్నారు. మండలంలోని ప్రజలు అవసరమైతేనే బయటికి రావాలని అధికారులు చెబుతున్నప్పటికీ, పల్లె వాసులు పనుల నిమిత్తం ద్విచక్రవాహనాలు, ఆటోల్లో ప్రయాణాలు చేస్తూనే ఉన్నారు. మండలంలో ఉష్ణోగ్రత 43 నుండి 44 వరకు ఉండటంతో ఉక్కపోతకు జనలోకం హైరానా పడుతున్నారు. ఏప్రిల్‌ నెలలో ఎండలు ఇలా ఉంటే, రాబోయే మే, జూన్‌ నెలలు ఎండ తీవ్రత ఎలా ఉంటుందోని, మండల వాసులు వాపోతున్నారు. మండలంలోని పమ్మి గ్రామంలో గత వారం రోజుల నుండి అత్యధిక ఉష్ణోగ్రత 44.2 నమోదు కావడం విశేషం. వేసవి ప్రతాపం తగ్గుముఖం పట్టాలంటే రుతుపవనాలు రావాల్సిందే.

Spread the love