రిజర్వేషన్లు రద్దు చేయడమే బీజేపీ విధానం

– సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు చలమాల విఠల్‌ రావు
నవతెలంగాణ-వేంసూరు
కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్లు ఎత్తివేస్తుందని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు చలమాల విటల్‌ రావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఎర్ర రామయ్య భవనం నందు జరిగిన మండల కమిటీ సమావేశంలో మాట్లాడుతూ మతోన్మాద బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగిందని, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌ శక్తులకు కారుచౌకగా కట్టబెడుతూ లబ్ధిపొందుతున్నారన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో లౌకిక వాద శక్తులను గెలిపించడమే సీపీఐ(ఎం) లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని తెలిపారు. నేడు కేంద్ర ప్రభుత్వం బ్రిటిష్‌ విధానాన్ని అనుసరిస్తోందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ ఎన్నికలు కీలకంగా మారాయని, ప్రమాదకర బీజేపీ పట్ల అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని తెలిపారు. రైతు వ్యతిరేక విధానాలు నల్ల చట్టాలపై గతంలో పోరాడిన సందర్భాలను గుర్తు చేశారు.
మే డే విజయవంతం చేయాలి
ప్రపంచ కార్మికుల దినోత్సవం సీఐటీయూ, సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని కార్యకర్తలకు సూచించారు. వాడవాడలా ఎర్రజెండా రెపరెపలాడాలని కార్మిక శక్తిని చాటాలని అన్నారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శి అరవపల్లి జగన్మోహన్రావు, రైతు సంఘం నాయకులు కొత్త సత్యనారాయణ, మండల కమిటీ సభ్యులు మోరంపూడి వెంకటేశ్వరరావు, మల్లూరు చంద్రశేఖర్‌, అరవపల్లి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love