అవిశ్వాసానికి ఓకే

– అనుమతించిన లోక్‌సభ స్పీకర్‌
– వేర్వేరుగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ తీర్మానాలు
– మోడీతో మాట్లాడించే ప్రయత్నం : ఇండియా కూటమి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు బుధవారం లోక్‌సభలో వేర్వేరుగా అవిశ్వాస తీర్మానాలను ప్రతిపాదించాయి. సభలో కాంగ్రెస్‌ పార్టీ ఉప నాయకుడు గౌరవ్‌ గొగోరు అందజేసిన తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా చర్చకు అనుమతించారు. వివిధ పార్టీల సభా నాయకులను సంప్రదించి, తీర్మానంపై చర్చించే తేదీని తెలియజేస్తానని ఆయన చెప్పారు. మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాకాండపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనం దాల్చడాన్ని ప్రతిపక్షాలు నిరసిస్తున్న విషయం తెలిసిందే. ఆయనను ఎలాగైనా పార్లమెంట్‌కు రప్పించి మాట్లాడించాలనే ప్రయత్నంలో భాగంగానే కేంద్ర మంత్రిమండలిపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు వేర్వేరుగా అవిశ్వాస తీర్మానానికి నోటీసులు అందించాయి. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ప్రధాని మోడీ మాట్లాడటంతో పాటు తమకూ పలు అంశాలను లేవనెత్తే అవకాశం లభిస్తుందనే యోచనతో ప్రతిపక్ష కూటమి ఈ అడుగు వేసింది.
తొలుత కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగోరు, బీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావు అవిశ్వాస తీర్మానం నోటీసులను లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ ఉత్పల్‌ కుమార్‌ సింగ్‌కు అందజేశారు. సభా కార్యక్రమాల నియమాలు, నిర్వహణకు సంబంధించి 17వ అధ్యాయంలోని 198-బీ నిబంధన కింద అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించాలని కోరారు. గొగోరు అందజేసిన నోటీసుకు కాంగ్రెస్‌, డీఎంకే, తృణమూల్‌ కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేన (ఉద్ధవ్‌ ఠాక్రే), జేడీయూ, వామపక్షాలు మద్దతు తెలిపాయి. నామా నాగేశ్వరరావు అందజేసిన నోటీసుపై ఎంపీలు బీబీ పాటిల్‌, రంజిత్‌ రెడ్డితో పాటు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ కూడా సంతకాలు చేశారు.
ఉదయం సభ సమావేశం కాగానే కాంగ్రెస్‌ సభ్యుడు గౌరవ్‌ గొగోరు లేచి తాను అవిశ్వాస తీర్మానాన్ని అందజేశానని, దానిపై చర్చను చేపట్టాలని స్పీకర్‌ను కోరారు. దీనిపై స్పీకర్‌ స్పందిస్తూ ‘మీరు మీ స్థానంలో కూర్చోండి. సభను జరగనివ్వండి. మీరు అనుభవం కలిగిన సభ్యులు. నిబంధనలు తెలిసిన వారు’ అని అన్నారు. అనంతరం ఓం బిర్లా ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టగానే కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్ష సభ్యులు సభ మధ్యలోకి వెళ్లి నినాదాలు చేశారు. మణిపూర్‌ హింసపై సభలో మాట్లాడాలని ప్రధానిని డిమాండ్‌ చేశారు. ‘మణిపూర్‌ కోసం భారతదేశం’, ‘విద్వేషాలకు వ్యతిరేకంగా దేశం సంఘటితంగా ఉంది’ అని రాసివున్న ప్లకార్డులు ప్రదర్శించారు. మరోవైపు రాజస్థాన్‌కు చెందిన బీజేపీ ఎంపీలు లేచి అశోక్‌ గెహ్లోత్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎరుపు డైరీని ప్రదర్శించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన కొందరు బీజేపీ ఎంపీలు కూడా నినాదాలు చేయడం కన్పించింది. సభలో గందరగోళం చెలరేగడంతో స్పీకర్‌ సభను 40 నిమిషాల పాటు వాయిదా వేశారు. తీర్మానాన్ని ప్రవేశపెట ి్టన కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగోరు మాట్లాడు తూ ”లోక్‌సభలో తనకున్న బలం ఏమిటో ఇండియా కూటమికి తెలుసు.
కానీ ఇది కేవలం బలపరీక్షకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. న్యాయం కోసం చేస్తున్న ప్రయత్నం. మణిపూర్‌ ప్రజలకు ప్రధాని మోడీ నుంచి ఒక సందేశం వెళ్లాలి. మణిపూర్‌ని ప్రభుత్వం విస్మరిస్తోంది. కాని ఈ విషాద సమయంలో ఇండియా కూటమి అక్కడి ప్రజలకు అండగా నిలుస్తుంది. మేం వారి హక్కుల కోసం పార్లమెంటు లోపల పోరాడుతున్నాం. ఇప్పుడు ఈ వ్యవహారం కేవలం మణిపూర్‌కే పరిమితం కాలేదు. దేశం యావత్తూ ప్రధాని ప్రకటన కోసం ఎదురు చూస్తోంది. దేశ భద్రత, సమగ్రతలను దృష్టిలో పెట్టుకొని ప్రధాని పార్లమెంటులో జాతిని ఉద్దేశించి ప్రసంగించాలి” అని డిమాండ్‌ చేశారు.
నోటీసుకు అనుమతి
వాయిదా అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు సభ తిరిగి సమావేశమైన వెంటనే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు గొగోరుని స్పీకర్‌ ఓం బిర్లా అనుమతించారు. దీంతో ఆయన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తీర్మానానికి ఎంతమంది మద్దతు ఇస్తున్నారని స్పీకర్‌ సభ్యులను అడిగారు. కాంగ్రెస్‌ నాయకురాలు సోనియా గాంధీ సహా పలువురు ప్రతిపక్ష నేతలు తమ మద్దతు ప్రకటిస్తూ లేచి నిలుచున్నారు. చర్చకు అవసరమైన మద్దతు లభించడంతో తీర్మానాన్ని స్పీకర్‌ అనుమతించారు. దీనిపై అన్ని పక్షాలతో చర్చించిన తర్వాత సమయం, తేదీ నిర్ణయిస్తామని ప్రకటించారు. సభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశంలో తీర్మానంపై ఎప్పుడు చర్చ ప్రారంభించాలో, చర్చలో ఏ పార్టీకి ఎంత సమయం ఇవ్వాలో నిర్ణయిస్తారు. చర్చ ముగిసిన తర్వాత ప్రధాని మోడీ సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ జరుగుతుంది. 2018 జూలై 20న మోడీ ప్రభుత్వంపై మొట్టమొదటి సారిగా తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. 126 మంది సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయగా 325 మంది వ్యతిరేకించడంతో ప్రభుత్వం గట్టెక్కింది. ఆ తరువాత మళ్లీ ఇప్పుడు మోడీ ప్రభుత్వం అవిశ్వాసాన్ని ఎదుర్కోబోతోంది.
కొనసాగిన ఆందోళన
మణిపూర్‌ హింసపై పార్లమెంట్‌ ఉభయసభల్లో ప్రతిపక్షాల ఆందోళన బుధవారం కూడా కొనసాగింది. మరోవైపు దీనికి ప్రతిగా అధికారపక్షం సైతం ఆందోళన కొనసాగించింది. దీంతో ఉభయ సభలలో వాయిదాల పర్వం కొనసాగింది. కార్గిల్‌ విజరు దివస్‌ను పురస్కరించుకుని దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పిస్తూ ఉభయసభలలో సభ్యులంతా మౌనం పాటించారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు అనుమతించిన తర్వాత అధికార, ప్రతిపక్ష సభ్యులు మళ్లీ ఆందోళనకు దిగారు. దీంతో సభ మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా పడింది. ఆ తర్వాత అటవీ సంరక్షణ సవరణ బిల్లు సహా పలు బిల్లులను ఆమోదించారు. అనంతరం సభను గురువారానికి వాయిదా వేశారు.
రాజ్యసభలో ప్రతిపక్షాలు వాకౌట్‌
అటు రాజ్యసభలోనూ ప్రతిపక్షాలు మణిపూర్‌ అంశాన్ని లేవనెత్తగా వారి ఆందోళన మధ్యే కొద్దిసేపు సభా కార్యకలాపాలు కొనసాగించారు. ఆ తరువాత ప్రతిపక్ష సభ్యులకు పోటీగా అధికారపక్ష సభ్యులు కూడా నినాదాలు చేశారు. దీంతో ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌కర్‌ సభను మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతున్న సమయంలో మైక్‌ కట్‌ చేయడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తన ఆత్మాభిమానాన్ని సవాలు చేయడమేనని చెప్పారు. చైర్మెన్‌ అనుమతితో మాట్లాడుతున్నప్పటికీ మైక్‌ కట్‌ చేయడం తనను అవమానించడమేనని అన్నారు. పలు అంశాలను సభ దృష్టికి తీసుకువస్తున్నానని చెప్పారు. ‘267వ నిబంధన కింద 50 మంది సభ్యులు నోటీసులు ఇచ్చినప్పటికీ పార్లమెంటులో మాట్లాడేందుకు నాకు అవకాశం రాలేదు. కనీసం నేను మాట్లాడేటప్పుడైనా అది పూర్తి కాకుండానే మైక్‌ను ఆఫ్‌ చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ సభ నడుస్తోందని అనుకుంటే అది ప్రజాస్వామ్యం కాదనే నేను భావిస్తా’ అని అన్నారు. ఖర్గేకు మద్దతుగా ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. దీంతో అధికార పార్టీ సభ్యులు కూడా ‘మోడీ మోడీ’ అంటూ ప్రతి నినాదాలు చేయడంతో సభ మొత్తం గందరగోళంగా మారింది.సభను క్రమ పద్ధతిలోకి తీసుకురావా లని ఛైర్మన్‌ కోరినప్పటికీ సభ్యుల నినాదాలతో సభ హోరెత్తింది. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు వాకౌట్‌ చేశాయి. హిమాచల్‌ ప్రదేశ్‌కు సంబంధించిన బిల్లును ఆమోదించిన అనంతరం సభను గురువారానికి వాయిదా వేశారు.
విప్‌ జారీ చేసిన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌
ఢిల్లీ ఆర్డినెన్స్‌ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు తమ ఎంపీలందరికీ విప్‌ జారీ చేశాయి. ఎంపీలం దరూ 26, 27, 28 తేదీల్లో సభకు హాజరై బిల్లుపై ఓటింగ్‌లో పాల్గొనాలని సూచించారు.
అవిశ్వాస తీర్మానం అంటే….
నిజానికి రాజ్యాంగంలో అవిశ్వాస తీర్మానం ప్రస్తావనే లేదు. కానీ, ఆర్టికల్‌ 118 ప్రకారం ప్రతి సభ సొంతగా విధానాన్ని రూపొందించుకోవచ్చు. రూల్‌ 198 ప్రకారం ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి సభ్యులు స్పీకర్‌కు నోటీసు ఇవ్వవచ్చు.
అనుమతి ఇలా…
అవిశ్వాస తీర్మానానికి సభాపతి అనుమతి లభించాలంటే ముందుగా ఎవరైనా సభ్యుడు లోక్‌సభ స్పీకర్‌కు లిఖితపూర్వకంగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. కనీసం 50 మంది సభ్యుల మద్దతు ఉన్నప్పుడే ఈ తీర్మానాన్ని చర్చకు అనుమతిస్తారు. అంటే అవిశ్వాస తీర్మానంపై కనీసం 50 మంది ఎంపీలు సంతకం చేయాలి. లోక్‌సభ స్పీకర్‌ ఆమోదం పొందిన తర్వాత 10 రోజుల్లో దానిపై చర్చ జరుగుతుంది. చర్చ అనంతరం స్పీకర్‌ అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ నిర్వహిస్తారు. లేదా ప్రత్యేక పరిస్థితులలో ఆయన నిర్ణయం తీసుకోవచ్చు.
అటవీ సంరక్షణ బిల్లు ఆమోదం
 లోక్‌సభలో ముజువాణి ఓటుతో పాస్‌
అటవీ సంరక్షణ బిల్లు ఆమోదం లోక్‌సభలో అటవీ సంరక్షణ సవరణ బిల్లు ఆమోదం పొందింది. బుధవారం లోక్‌సభలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ అటవీ సంరక్షణ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. దీనిపై బీజేపీ ఎంపీలు దియా కుమారి, రాజు బిస్తా, వైసీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, శివసేన (షిండే) ఎంపీ భావన గావాలి మాత్రమే పాల్గొన్నారు. దీనిపై కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ సమాధానం చెప్పారు. అనంతరం మళ్లీ బీజేడీ ఎంపీ భర్తృహరి మహతాబ్‌, బీఎస్పీ ఎంపీలు రితీష్‌ పాండే, రాం శిరోమని వర్మ ఒక్కో నిమిషం మాట్లాడారు. అనంతరం బిల్లును ముజువాణి ఓటుతో ఆమోదించారు. బిల్లుపై చర్చ జరిగే సందర్భంలో ఆర్‌ఎస్పీ ఎంపీ ఎన్‌కె ప్రేమ్‌చంద్రన్‌ జోక్యం చేసుకొని పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ లేవనెత్తారు. అవిశ్వాస తీర్మానం పెండింగ్‌లో ఉన్నప్పుడు ఎటువంటి ప్రభుత్వ విధానపరమైన అంశాలపై సభలో చర్చ జరగ కూడదని అన్నారు. ప్రస్తుతం అవిశ్వాస తీర్మానం స్పీకర్‌ వద్ద పెండింగ్‌లో ఉందని, అటువంటప్పుడు విధానపరమైన అటవీ సంరక్షణ బిల్లుపై ఎలా చర్చ నడుపుతారని ప్రశ్నించారు.ఈ బిల్లులో జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టులను త్వరితగతిన చేపట్టేందుకు, చట్టం పరిధిలోని భూములను మినహాయించాలని బిల్లు ప్రతిపాదిస్తోంది. రైల్వే ట్రాక్‌, ప్రభుత్వం నిర్వహించే పబ్లిక్‌ రోడ్డు పక్కన ఉన్న 0.1 హెక్టార్ల వరకు అడవులను తొలగించడానికి ముందస్తు అటవీ క్లియరెన్స్‌ అవసరాన్ని మినహాయించాలని సవరణ ప్రతిపాదిస్తుంది.
ఏ ప్రధానిపై ఎన్నిసార్లు?
దేశాన్ని పరిపాలించిన ప్రధానులలో అందరికంటే ఎక్కువగా ఇందిరాగాంధీయే అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కొన్నారు. ఇప్పటి వరకూ సభ ముందుకు వచ్చిన 27 అవిశ్వాస తీర్మానాలలో సగానికి పైగా అంటే 15 తీర్మానాలు ఆమె నేతృత్వంలోని ప్రభుత్వాల మీద ప్రవేశపెట్టినవే. లాల్‌ బహదూర్‌ శాస్త్రి ప్రభుత్వంపై మూడుసార్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఐదు సంవత్సరాల పాటు మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపిన పీవీ నరసింహారావు కూడా మూడు తీర్మానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే మన్మోహన్‌ సింగ్‌ పది సంవత్సరాలు ప్రధాని పదవిలో ఉన్నప్పటికీ ఆయనపై ఎవరూ అవిశ్వాసాన్ని ప్రతిపాదించలేదు. అవిశ్వాస తీర్మానాలను అత్యధికంగా ప్రతిపాదించిన ఘనత సీపీఐ (ఎం) ఎంపీ జ్యోతిర్మయి బసుకే దక్కుతుంది. ఆయన నాలుగు అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టగా అవన్నీ ఇందిరాగాంధీ ప్రభుత్వంపై ప్రతిపాదించినవే. ఇక అటల్‌ బిహారీ వాజ్‌పేయి, మధులిమాయేలు రెండేసి అవిశ్వాస తీర్మానాలు ప్రతిపాదించారు. ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొదటి తీర్మానాన్ని, నరసింహారావు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండో తీర్మానాన్ని వాజ్‌పేయి ప్రవేశపెట్టారు. 2003లో సోనియా గాంధీ కూడా ‘అవిశ్వాస తీర్మానం’ ప్రవేశపెట్టారు. ఇప్పుడు మోడీపై రెండో సారి ‘అవిశ్వాస తీర్మానం’ ప్రవేశపెట్టనున్నారు.

Spread the love