– మణిపూర్ ఘటనపై ప్రధాని మోడీ స్పందించాలి
నవతెలంగాణ-సిటీబ్యూరో
మణిపూర్ దుర్మార్గపు ఘటన దేశానికే సిగ్గుచేటు.. మహిళలను నగంగా ఊరేగించిన ఘటనపై ప్రధాని మోడీ స్పందించాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. మణిపూర్‌లో మహిళలపై జరిగిన లైంగికదాడులు, హత్యలను నిరసిస్తూ సీపీఐ(ఎం) హైదరాబాద్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో శనివారం నిరసన తెలిపారు. గోల్కొండ క్రాస్‌రోడ్స్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నర్సింహారావు మాట్లాడుతూ.. మణిపూర్‌లో మారణహోమం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించి.. మీరు చర్యలు తీసుకుంటారా, లేక మమ్మల్ని తీసుకోమ్మం టారా అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినా ఇంత వరకు మోడీ స్పందించడం లేదని విమర్శించారు. మూడు నెలలుగా మణిపూర్ అట్టుడుకుతుంటే బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. రెండు తెగల మధ్య విభేదాలను మోడీ పెంచిపోషిస్తున్నారని తెలిపారు. అక్కడి ముఖ్యమంత్రి.. ఇది ఒక్క సంఘటనే కాదు, వందల సంఘటనలు జరిగాయని చెప్పడం సిగ్గుచేటన్నారు. మణిపూర్ బీజేపీ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తక్షణమే గద్దెదిగాలని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జ్యోతి మాట్లాడుతూ.. మణిపూర్‌లో వందలాది మంది ప్రాణం కోల్పోయినా ప్రధాని మోడీ మౌనం వహించడం సరికాదన్నారు. విదేశీ పర్యటన లు, ఎన్నికల ప్రచారాలకు వెళ్తున్న మోడీ మణిపూర్ వెళ్లలేరా అని ప్రశ్నించా రు.సీపీఐ(ఎం) గ్రేటర్ హైద రాబాద్ సెంట్రల్‌సిటీ కమిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ.. మణిపూర్‌లో ఇద్దరు గిరిజన మహిళలను వివస్త్రలను చేసి, ఊరేగించిన దుర్ఘటన యావత్ భారతదేశానికే సిగ్గుచేటన్నారు. ఇంత జరుగుతున్నా అక్కడి ప్రభుత్వం, పోలీసులు, ఆర్మీ ఏం చేయలేకపోవడం దారుణమన్నారు. ఇప్పటికే ఆ రాష్ట్రంలో వందలాది మంది మైనార్టీలను వెంటాడి చంపారని, మరో 50వేల మంది నిరాశ్రయులయ్యా రని తెలిపారు. మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న మారణహోమం మోడీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మణిపూర్ ఘటనలపై ఇతర దేశాలు స్పందిస్తున్నా దేశ ప్రధాని మోడీ ఇప్పటి వరకు ఒక్కమాట కూడా మాట్లాడలేని దుస్థితి నెలకొందని విమర్శించారు. ఒక రాష్ట్రాన్ని కాపాడలేని వాళ్లు దేశాన్నేమి ఉద్ధరిస్తారని ప్రశ్నించారు. వెంటనే దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అక్కడ శాంతిని నెలకొల్పాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మణిపూర్ అల్లర్ల ద్వారా రాజకీయంగా లబ్ది పొందడానికే అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. సీపీఐ(ఎం) సిటీ కార్యదర్శివర్గ సభ్యులు కె.నాగలక్ష్మి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.దశరథ, ఎం.శ్రీనివాసరావు, కెఎన్.రాజన్న, ఎమ్.మహేందర్, ఎం.వెంకటేష్, నాయకులు ఎన్.మారన్న, ఆర్.వెంకటేష్, కుమారస్వామి, సి.మల్లేష్, జి.నరేష్, అజరుబాబు, ఆర్.అశోక్, ఆర్.వాణి, జి.కిరణ్ పాల్గొన్నారు.