– తెలంగాణ పై ప్రియాంకాగాంధీ ఫోకస్
– టిక్కెట్ అంత ఈజీ కాదు
– రాష్ట్రంలోనూ హిమాచల్ ప్రదేశ్, కర్నాటక ఫార్ములానే…
– కాంగ్రెస్‌లో సర్వేల ఆధారంగానే బీ-ఫారాలు
– పైరవీలు, పెద్దలతో సంబంధాలు పనిచేయవు
కాంగ్రెస్‌లో టికెట్‌దేముంది? పైసలిస్తేనో, పౖౖెరవీలు చేస్తేనో, అధిష్టానం పెద్దలతో సత్ససంబంధాలు కొనసాగిస్తేనో టికెట్ వస్తుందనే అభిప్రాయం ఆశావాహుల్లో ఉన్నది. అందుకు తగ్గట్టుగానే గతంలో పారాచూట్‌లో వచ్చిన నేతలకు ఘన స్వాగతం పలికి బీఫామ్ చేతిలో పెట్టేవారు. కానీ, ఇప్పుడు లెక్క మారింది. టికెటు ఆశిస్తున్న నాయకులంతా ప్రజాసేవలో ఉన్నారా? పార్టీకి ఎంత సర్వీసు చేశారు? వారికి ప్రజల్లో ఉన్న పలుకుబడి ఏంటి? అనేది పక్కన పెట్టి టికెట్లు ఇచ్చి తీవ్రంగా నష్టపోయామని ఏఐసీసీ భావిస్తోంది. పార్టీని ఎట్లా గెలిపించాలనే దానిపై ఫోకస్ పెట్టింది.అందుకే రాష్ట్రంలో ప్రతి విషయాన్ని ఏఐసీసీ అగ్రనేత ప్రియాంకగాంధీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని నేతలు చెబుతున్నారు.
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో విజయం కోసం హస్తం పార్టీ పావులు కదుపుతున్నది. అందు కోసం ఏఐసీసీ అగ్రనేత ప్రియాంకగాంధీ ప్రత్యేకంగా దృష్టిసారించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఆయా రాష్ట్రాల సక్సెన్ మంత్రను తెలంగాణలో అమలు చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. హిమాచల్‌ప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో హస్తం పార్టీ అమలు చేసిన వ్యూహాలను, అనుసరించిన పద్దతులను తెలంగాణలోనూ ఆచరించాలని అధిష్టానం బలంగా విశ్వసిస్తున్నది. 2014, 2018 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ ఘోరపరాజయం పాలైంది. దాన్నించి గుణపాఠాలు తీసుకుని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి తెలంగాణ రాష్ట్రాన్ని కైవసం చేసుకోవాలనే తపనతో నజర్ పెట్టింది. ఎవరికి ఇష్టం ఉన్నా..లేకపోయినా అధిష్టానం సూచనలు తూ.చ తప్పకుండా పాటించాలనేది ఆదేశం. ఇప్పటివరకు టికెట్ల విషయంలో నాయకులు ఆడిందేే ఆట, పాడిందే పాటగా కొనసాగింది.కానీ ఈసారి ప్రజలతో సంబంధాలు లేకపోతే టికెట్ వచ్చే పరిస్థితి లేదనే సంకేతాలి స్తోంది. పెద్ద నాయకులం అని చెప్పుకునేవారు కూడా హైదరాబాద్‌కే పరిమితమై…ఢిల్లీలో పైరవీలు చేసుకుని టికెట్లు దక్కించుకున్న నేతలు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిని అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం షాక్‌కు గురి చేస్తున్నది. ఈసారి టికెట్ అంత ఈజీ కాదని వారికి ఇప్పడిప్పుడే బోధపడుతున్నదట!. శుక్రవారం టీపీసీసీ ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీని ఏఐసీసీ ప్రకటించడంతో టికెట్ల విషయం మరింత చర్చనీయాంశమవుతున్నది. ప్రతి నియోజకవర్గానికి చెందిన ముగ్గురు బలమైన అభ్యర్థుల పేర్లను ఈ కమిటీ ఖరారు చేయనుంది. ఆ జాబితాపై ఏఐసీసీ తమ వేగులతో సర్వేలు చేయించనుంది. ఆ సర్వేల ఆధారంగా బలమైన అభ్యర్థిని గుర్తించి ప్రకటించనున్నట్టు తెలిపింది. వారిని రంగంలోకి దించిన తర్వాత అన్ని రకాల సహాయ సహకారాలు అందించనుంది. గతంలో టికెట్లు ఇచ్చి ‘నీ చావు నీవు చావు’ అన్న రీతిలో ఉండేది. అభ్యర్థిపై సరైన అంచనాలు లేకుండా టికెట్లు ఇచ్చిన సంఘటనలెన్నో ఉన్నాయి. 2018 సాధారణ ఎన్నికల్లో సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్, మిర్యాలగూడకు ఆర్.కృష్ణయ్యతోపాటు మరో 15 మంది అభ్యర్థులకు రాత్రికి రాత్రి బీ ఫారాలు ప్రకటించి తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంది. ఆయా నియోజకవర్గాల్లో కొంత మంది నేతలు దశాబ్ధాలుగా పోటీ చేస్తూ గెలుస్తూ…ఓడుతూ వస్తున్నారు. వారితోపాటు పక్క నియోజకవర్గాల్లో తమ రక్తసంబంధీకులకు, అనుచరులకు కూడా టికెట్లు ఇప్పించుకునే వారు. ఈసారి అటువంటి పరిస్థితులకు ఫుల్‌స్టాఫ్ పెట్టనున్నట్టు తెలుస్తోంది. 60 ఏండ్లు దాటిన వారు కూడా పోటీకి సై అంటున్నారు. కానీ ఏఐసీసీ మాత్రం మీరు చేస్తారా? మీ వారసులు చేస్తారో తేల్చుకోవాలని సూచిస్తున్నది. అది కూడా ప్రజల్లో బలం ఉంటేనే ప్రయత్నించాలని కోరుతున్నది. మరి కొంత మంది నియోజకవర్గాలను తమ సంస్థానాలుగా భావిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ద్వితీయ శ్రేణి నాయకులను ఎదగనీయకుండా అణచివేస్తున్నారనే ఆవేదనలు వినిపిస్తున్నాయి. ఎవరైనా సరే నిబంధనలమేరకు టికెట్లు ఉంటాయని అధిష్టానం స్పష్టం చేయడం గమనార్హం. అందుకే పార్టీలో చేరుతున్న వారికి కూడా షరతులు పెట్టొదనీ, స్వచ్ఛందంగా చేరాలంటూ అధిష్టానం విజ్ఞప్తి చేస్తున్నది. బీఆర్‌ఎస్ లాంటి కొండను కొట్టేందుకు సైనికుల్లా కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకరావాలని సర్ధిచెబుతున్నారు. కుటుంబానికి రెండు టికెట్లు ఇవ్వాలనే నేతల ప్రతిపాదనను ఏఐసీసీ తిరస్కరించినట్టు తెలిసింది. దీంతోపాటు పార్టీలోనే ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న వారికి మీదారి మీరు చూసుకోవాలని కూడా చెబుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇన్నాళ్లూ నాయకుల మధ్యే టికెట్ల పంపిణీ అనే సాంద్రాయానికి ఏఐసీసీ ఫుల్‌స్టాప్ పెట్టనుందా? ఒత్తిళ్లకు లోనై పాత పద్దతినే కొనసాగించి బొక్కబోర్లా పడుతుందా? అనేది ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే…