ఆపరేషన్‌ హస్తం

– ఢిల్లీ నుంచి హాట్‌లైన్‌ బయటకు పొక్కకుండా పక్కా ప్లాన్‌
– కాంగ్రెస్‌ వైపు కోదండరాం అడుగులు
– పొంగులేటి, జూపల్లితో చర్చలు పూర్తి
– కోడంగల్‌ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డితో రేవంత్‌ భేటీ
– రేవంత్‌ సమక్షంలో ఉధృతంగా చేరికలు
కర్నాటక ఫలితాల తర్వాత జోరుమీదున్న హస్తం పార్టీ… తెలంగాణలో సైతం అదే స్థాయిలో ఫలితాలను రాబట్టేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగా ఢిల్లీ హైకమాండ్‌ దిశా నిర్దేశంతో… కన్నడ నాట బీజేపీతో ‘ఢ అంటే ఢ’ అన్న శివకుమార్‌ మార్గదర్శకత్వంలో వడివడిగా అడుగులేస్తున్నది. ఈ క్రమంలో అధికార బీఆర్‌ఎస్‌తోపాటు బీజేపీలోని రెండో తరగతి నేతలు, ఇతర చిన్నా చితకా పార్టీల్లోని సీనియర్లు, అధ్యక్ష స్థాయి నాయకులను తనవైపునకు లాక్కునేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవలి పరిణామాల్లో ఈ ‘ఆపరేషన్‌ హస్తం’ సంకేతాలు స్పష్టంగానే కనబడుతున్నాయి.
కారు, కమలం అసంతృప్తులపై నజర్‌
టికెట్లు రావనుకున్న నేతలు, ఆయా పార్టీల్లో సరైన గుర్తింపు లేకుండా అసంతృప్తిగా ఉన్న నాయకులను గుర్తించి, ఎలాగైనా సరే వారిని పార్టీలో చేర్పించేందుకు హస్తం పార్టీ భారీ ప్రణాళికనే సిద్ధం చేసినట్టు గాంధీభవన్‌ వర్గాలు అంటున్నాయి. ఏ విషయంలోనూ తగ్గకుండా అధికార పార్టీలను ఢ కొట్టేందుకు క్యాడర్‌ను సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. అందులో భాగంగానే కోడంగల్‌ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డితో రేవంత్‌రెడ్డి భేటీ కావడం, పార్టీలో చేరేందుకు ఆయన అంగీకరించడంతో పార్టీకి మరింత ఊపొచ్చిందని కాంగ్రెస్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నిర్మల్‌ కాంగ్రెస్‌ ఇంచార్జి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి బీజేపీలో చేరడంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు బీఆర్‌ఎస్‌ నుంచి మరో ముఖ్యమైన నేతలను పార్టీలో చేర్చుకుంది. కాంగ్రెస్‌కు బలమైన పునాది ఉన్న ఆదిలాబాద్‌పై రేవంత్‌ ప్రత్యేక ఫోకస్‌ పెట్టారు. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ జిల్లాల్లో బలమైన శక్తిగా ఉన్న కాంగ్రెస్‌ మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ ఉమ్మడి జిల్లాలపై పట్టు బిగించా లని భావిస్తున్నది. ఇప్పటికే అధిష్టానం కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పినట్టు ఆ వర్గాలు అంటున్నాయి. ఈక్రమంలో కర్నాటక ఎన్నికల్లో పని చేసిన అనుభవం ఉన్న కేరళ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీపీ విష్ణునాథ్‌, కర్నాటక నేత మన్సుర్‌ అలీఖాన్‌ను సైతం రంగంలోకి దించింది.
విలీన ప్రచారం వాస్తవం కాదు : కోదండరాం
ఇతర పార్టీల్లో టీజేఎస్‌ను విలీనం చేయ బోతున్నామనే ప్రచారం వాస్తవం కాదని ఆ పార్టీ అధ్యక్షులు కోదండరాం స్పష్టం చేశారు. టీజేఎస్‌ తన అస్థితాన్ని కాపాడుకుంటూనే ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరాడుతుందని తెలిపారు. ఈమేరకు గురువారం ఆయన వీడియోను విడు దల చేశారు. టీజేఎస్‌ ఏ పార్టీలో విలీనం కాదని స్పష్టం చేశారు. తెలంగాణాను నిర్మాణం చేసే ఆలోచనతోనే ప్రజాసంఘాలను, పార్టీలను కలు స్తున్నామని వివరణ ఇచ్చారు. ఎన్నికల నాటికి తమ పోరాటం ఎలా ఉండబోతుందో ఇప్పడే చెప్పలేమని తెలిపారు.
గుడిగ రఘు
బీజేపీని అడ్డుకునేందుకు, బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ ‘ఆపరేషన్‌ తెలంగాణ’ షురూ చేసింది. రానున్న ఎన్నికల్లో అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు అస్త్రశస్త్రాలను బయటకు తీస్తున్నది. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు హాట్‌లైన్‌ ద్వారా ఆపరేషన్‌ తెలంగాణను పర్యవేక్షిస్తున్నది. బీజేపీ, బీఆర్‌ఎస్‌ కదలికలను పసిగడుతూనే…పార్టీని బలోపేతం చేసే పనిలో పడింది. ఏదీ చేసినా పక్కా ప్లాన్‌తో బయటకు పొక్కకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. ఆ రెండు పార్టీల్లోని ద్వితీయ శ్రేణి నాయకులను ఆకర్షించడంతోపాటు పెద్ద తలకాయలపై ఫోకస్‌ చేసింది. అందులో భాగంగానే గత మూడు, నాలుగు రోజులు ఆదిలాబాద్‌, నిర్మల్‌, షాద్‌నగర్‌, ఉప్పల్‌, అచ్చంపేట, జూబ్లీహీల్స్‌ నియోజకవర్గాల నుంచి చాలా మంది నాయకులు కారు దిగారు.
కోదండరాంపై ఫోకస్‌
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరాంపై కాంగ్రెస్‌ ఫోకస్‌ చేసింది. ఆయనతో పలువురు నాయకులు భేటీ అవుతున్నారు. దీంతో ఇప్పటికే ఆయన అడుగులు కాంగ్రెస్‌ వైపు పడుతున్నాయి. బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్న నాయకులను కాంగ్రెస్‌వైపు మళ్లించేందుకు కోదండరాం కృషి ప్రారంభించారు. ఇప్పటికే మాజీ ఎంపీ పొంగు లేటి శ్రీనివాసరెడ్డితో భేటీ అయిన ఆయన…. తాజాగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావుతోనూ చర్చించారు. ఇప్పటికే వారిద్దరూ కాంగ్రెస్‌లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ వెల్లడించారు. కమలం, కారు పార్టీలకు చెందిన చాలా మంది నేతలతో కోదండరాంకు సన్నిహిత ఉన్న నేపథ్యంలో ఆయన మాటకు విలువనిచ్చే నేతలు ఉన్నారు. వారందరితో కోదండరాం మాట్లాడుతున్నట్టు ఆ పార్టీలు చెబుతున్నాయి. బీఆర్‌ఎస్‌ను గద్దె దించేందుకు అవసరమైతే టీజేఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానంటూ సూర్యాపేటలో నిర్వహించిన ప్లీనరీలో ప్రకటించిన కోదండ రాం.. అందుకనుగుణం గానే కాంగ్రెస్‌కు చేరువవుతు న్నట్టు తెలుస్తోంది. విలీనం చేసేందుకు సిద్ధమవు తున్నట్టు తెలు స్తోంది. ఈ లోపుగా పార్టీ ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు ఆయన రంగంలోకి దిగినట్టు తాజా పరిణామాలు చెబుతున్నాయి.
రెండు, మూడు నెలల ముందే టికెట్లు
ఎన్నికలకు రెండు, మూడు నెలలకు ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించినట్టు ప్రచారం సాగుతోంది. టికెట్లు ఇచ్చే విషయంలో ఆషామాషీగా ఇవ్వకుండా ఆయా నియోజకవర్గాల్లో సర్వే చేసి బీ ఫామ్‌ ఇస్తామని రేవంత్‌రెడ్డి స్వయంగా చెప్పారు. దీంతో టికెట్లు ఆశించే నాయకులు కిమ్మనకుండా పని చేసుకుంటున్నట్టు పార్టీ నేత ఒకరు చెప్పారు. అంతేకాకుండా పార్టీని పట్టిపీడిస్తున్న ముఠా తగాదాల విషయంలో నిక్కచ్చిగా ఉండాలని పార్టీ నిర్ణయించింది. ఎంత పెద్ద నాయకుడైనా పార్టీపైగానీ, నాయకులపైగానీ ఇష్టమెచ్చినట్టు మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ఏఐసీసీ సందేశాలు పంపింది. ఈ నేపథ్యంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వాయిస్‌లో కొంత తేడా వచ్చిందని పార్టీని నేతలు చెబుతున్నారు.తన తమ్ముడిని కాంగ్రెస్‌లోకి రప్పించేందుకు కూడా అన్న రంగంలోకి దిగినట్టు ప్రచారం జరుగుతున్నది. పార్టీ అంతర్గతంగా పటిష్టపరుచుకుంటూనే, మరోవైపు భారీ బహిరంగ సభలకు ప్లాన్‌ చేస్తున్నది. ఆ సభల్లో ప్రజలకు పలు హామీలు ఇవ్వనుంది.
అరాచక పాలనను భరించే ఓపిక లేదు కేసీఆర్‌ను గద్దెదించాల్సిందే… :
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కేసీఆర్‌ అరాచక పాలన భరించే ఓపిక ప్రజలకు లేదని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. అందుకే బీఆర్‌ఎస్‌ను గద్దెదించాల్సిందేనన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు, న్యాయవాది గంగాపురం రాజేందర్‌, మాజీ జెడ్పీటీసీ భీముడు నాయక్‌, అచ్చంపేట, చారగొండ మండలాలకు చెందిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారిని రేవంత్‌ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌లో చేరికలు గాలివాటంతో కూడినవి కావన్నారు. ఈ చేరికలు తెలంగాణలో కేసీఆర్‌ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ కోసమేనన్నారు. ఈ చేరికలు తెలంగాణ ప్రజల చైతన్యానికి ప్రతీకగా అని అభివర్ణించారు. రాష్ట్రాన్ని కేసీఆర్‌ నుంచి విముక్తి కలిగించేందుకే ఈ చేరికలు కొనసాగు తున్నాయని తెలిపారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్‌ పదేండ్ల పాలనలో నాశనం చేశారని విమర్శించారు. రాష్ట్రాన్ని పాలించే అర్హత కేసీఆర్‌కు లేదని తెలిపారు. కేసీఆర్‌ పుట్టకపోయుంటే తెలంగాణ వచ్చేది కాదని మంత్రి కేటీఆర్‌ అన్నారనీ, కేటీఆర్‌ పుట్టకముందే తెలంగాణ ఉద్యమం పుట్టిందని గుర్తు చేశారు. పాలమూరు బిడ్డ చిన్నారెడ్డి ఆనాడు ఉద్యమానికి నాయకత్వం వహించారని తెలిపారు. ఎలక్షన్లు, కలెక్షన్ల కోసమే 2001లో కేసీఆర్‌ పార్టీ పెట్టారని ఆరోపించారు. 22ఏండ్లు జెండా మోసిన గంగాపురం రాజేందర్‌కు న్యాయం జరిగిందా? అని ప్రశ్నించారు.
గురునాథ్‌ రెడ్డిని కలిసిన రేవంత్‌ రెడ్డి
కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డితో రేవంత్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. గత కొంతకాలంగా అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన్ను.. కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని రేవంత్‌ రెడ్డి కోరారు.ఈమేరకు స్పందించిన గురునాథ్‌రెడ్డి ఆదివారం గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ లో చేరనున్నట్టు ప్రకటించారు.
కొత్తకోట దయాకర్‌ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన రేవంత్‌
మహబూబ్‌ నగర్‌ జిల్లా దేవరకద్రనియోజకవర్గంలోని చిన్నచింతకుంట మండలం పర్కాపురం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌ రెడ్డి కుటుంబాన్ని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి పరామర్శించారు. ఆయన కొద్దిరోజుల క్రితం అనార్యోగంతో మరణించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు.
జూపల్లి కృష్ణారావుతో ఏఐసీసీ కార్యదర్శి భేటీ
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో ఏఐసీసీ కార్యదర్శి ఎస్‌ఏ సంపత్‌కుమార్‌ భేటీ అయ్యారు. పార్టీలో చేరే అంశాన్ని పరిశీలించారు. ఈ సమావేశంలో టీజేఎస్‌ అధ్యక్షులు కోదండరాం కూడా ఉన్నారు.

Spread the love