దుర్మార్గం

హరగోపాల్‌,ఇతరులపై ఉపా చట్టాన్ని ఉపసంహరించుకోవాలి : వామపక్ష పార్టీల డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రొఫెసర్‌ హరగోపాల్‌తోపాటు ఇతరులపై నమోదు చేసిన ఉపా చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వామపక్ష పార్టీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు తమ్మినేని వీరభద్రం (సీపీఐఎం), కూనంనేని సాంబశివరావు (సీపీఐ), పోటు రంగారావు (సీపీఐఎంఎల్‌ ప్రజాపంథా), వేములపల్లి వెంకట్రామయ్య (సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ), సాదినేని వెంకటేశ్వరరావు (సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ), గాదగోని రవి (ఎంసీపీఐయూ), సిహెచ్‌ మురహరి (ఎస్‌యూసీఐసీ), బి సురేందర్‌రెడ్డి (ఫార్వర్డ్‌బ్లాక్‌), జానకి రాములు (ఆరెస్పీ), మూర్తి (సీపీఐఎంఎల్‌ లిబరేషన్‌), ప్రసాదన్న (సీపీఐఎంఎల్‌) సంయుక్తంగా
శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పౌర హక్కుల నేత హరగోపాల్‌ నిరంతరం ప్రజా సమస్యలపై మాట్లాడుతూ, ప్రభుత్వానికి సరైన సూచనలు చేస్తూ, అభ్యుదయ భావాలతో రాష్ట్ర, దేశాభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. సమాజంలో గౌరవమున్న వ్యక్తిపై మావోయిస్టులతో సంబంధాలున్నాయనే నెపంతో రాష్ట్ర ప్రభుత్వం దేశద్రోహం కేసును బనాయించడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రొఫెసర్‌గా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించిన హరగోపాల్‌ రిటైర్డ్‌ అయిన తర్వాత కూడా ప్రజా సేవ చేస్తున్నారని పేర్కొన్నారు. ఉపాధి, తాగునీరు, భూసమస్యలు, దళిత, గిరిజనులపై దాడులు తదితర అంశాలపై స్పందిస్తూ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తున్నారని వివరించారు. 2022, ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ప్రసాద్‌తో 50 మంది మావోయిస్టులు సమావేశమైనట్టు ప్రకటించిన ప్రభుత్వం, ఇందులో పాల్గొన్నవారిలో 44వ వ్యక్తిగా హరగోపాల్‌ పేరును నమోదు చేసిందని పేర్కొన్నారు. ఆయనతోపాటు వి సంధ్య, విమలక్క, ప్రొఫెసర్‌ పద్మజాషా, ప్రొఫెసర్‌ ఖాసీం తదితర 152 మందిపై పోలీసులు దేశద్రోహం కేసులను నమోదు చేశారని వివరించారు. ఇలా రాష్ట్రంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తున్న వారిపై ఏదో ఒక వంకతో రాజద్రోహం కేసు మోపడం అప్రజాస్వామికమంటూ ఈ చర్యను ఖండించా రు. ఈ లెక్కన ఉద్యమాలు చేస్తున్నవారందరినీ దేశద్రోహం చట్టం కింద జైళ్ళల్లో పెట్టే అవకాశమున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. హక్కుల కోసం నినదిస్తే పీడీ యాక్ట్‌ కింద జైళ్లపాలు చేస్తున్నదని పేర్కొన్నారు. అధికార పార్టీకి చెందినవారు నేరాలు చేస్తే వారిపై ఎలాంటి చర్యల్లేవని విమర్శించారు. కనీసం కేసులు కూడా లేవని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడుతున్నామంటూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో ప్రకటించుకున్న రాష్ట్ర ప్రభుత్వం వామపక్షవాదులను లక్ష్యంగా చేసుకుని వారిపై కేసులు బనాయించడం అత్యంత దుర్మార్గమని విమర్శించారు. వామపక్షాలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయడం తప్ప తమ స్వార్థానికి ఏనాడూ ఉద్యమాలు నిర్వహించలేదని స్పష్టం చేశారు. వామపక్షాలు ఉండడం వల్లే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కొనసాగుతున్నదని తెలిపారు. వామపక్షాలను అణచివేయడమంటే, ప్రజాస్వామ్యాన్ని, లౌకికతత్వాన్ని అణచివేయడమేనని వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న దేశద్రోహ చట్టాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కులు అందరికీ అందుబాటులో ఉండాలని సూచించారు. హరగోపాల్‌, ఇతరులపై పెట్టిన దేశద్రోహం కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని వామపక్షాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.
 ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌
న్యూఢిల్లీ : ప్రొఫెసర్‌ హరగోపాల్‌పై ఉపా చట్టాన్ని ఉపసంహరించాలని, ప్రజలకు ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ డిమాండ్‌ చేశారు. అప్పుడే ముఖ్యమంత్రి చెప్పే ప్రజాస్వామ్యానికి
ప్రత్యామ్నాయమంటే ఇదేనా?
విలువ ఉంటుందన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్యం దేశంలో నరేంద్రమోడీ ప్రభుత్వం నియంతృత్వాన్ని అమలు చేస్తున్నదనీ, అందుకు ఉపా చట్టం కేంద్రానికి సాధనంగా ఉందని అన్నారు. అలాంటి చట్టాన్ని రద్దు చేయాలనీ, రాష్ట్రంలో అమలుచేయనని చెప్పాల్సిన రాష్ట్ర ప్రభుత్వం… అదే ఉపా చట్టాన్ని ప్రొఫెసర్‌ హరగోపాల్‌, తదితరులపై ప్రయోగించడాన్ని ఆయన ఖండించారు. ప్రొఫెస ర్‌ హరగోపాల్‌ ఉత్తమ అధ్యాపకుడిగా అందరి మన్ననలను పొందారని, విద్యా బోధనతో పాటు సామాజిక బాధ్యతను నెరవేర్చుతున్నారని అన్నారు. ప్రజా ఉద్యమాలకు తన వంతు మద్దతును కొనసాగిస్తున్నారనీ, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. రాజ్యంగ హక్కులపై జరిగే దాడులను ప్రతిఘటించి అన్ని ఉద్యమాలలో భాగస్వామ్య మవుతున్నారనీ, అలాంటి వ్యక్తిపై ఎక్కడో ఎవరి డైరీలో పేర్లు ఉన్నాయనే పేరుతో ఉపా చట్టాన్ని ప్రయోగించటం దుర్మార్గమైందని విమర్శించారు. నరేంద్రమోడి ప్రభుత్వానికి ప్రత్యామ్నాయమంటే ఉపా చట్టాన్ని ప్రయోగించడం కాదనీ, దాన్ని రద్దు చేయాలని పిలుపు నివ్వటమని తెలిపారు. ఆ చట్టాన్ని రద్దు చేయాలని కోరాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని ప్రయోగించడం నియంతృత్వాన్ని నెత్తినెట్టుకోవటమేనని పేర్కొన్నారు.
 సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రొఫెసర్‌ హరగోపాల్‌, తదితరులకు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే నెపంతో ఉపా చట్టాన్ని ప్రయోగిం చడాన్ని సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యులు బివి రాఘవులు తీవ్రంగా ఖండించారు. ఈ కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని శుక్రవారం
కేసును వెంటనే ఉపసంహరించుకోవాలి ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. హరగోపాల్‌ వివిధ అంశాలపై స్పందిస్తూ సామాజికంగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తున్నారని వివరించారు. వారితోపాటు మరో 152 మందిపై దేశద్రోహం కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. వామపక్షవాదులపై కేసులు బనాయించడం అత్యంత దుర్మార్గమని విమర్శించారు. సమాజంలో గౌరవించబడే మేధావులు, ఇతరులనే ఇలాంటి చట్టంలో ఇరికిస్తే సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం, రాజ్యాంగ హక్కులపై జరిగిన దాడులను ప్రతిఘటించటంలో భాగస్వాములవుతున్న హరగోపాల్‌, ఇతరులపై పెట్టిన దేశద్రోహం కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Spread the love