– ఆహార భద్రతను తుంగలో తొక్కిన కేంద్రం
– పౌష్టికాహార లేమితో రోగాల పాలవుతున్న మహిళలు
– మణిపూర్ చిచ్చుకు బీజేపీయే కారణం.
– ఐద్వా జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మరియం ధావలే, పీకే శ్రీమతి
– ఆగస్టులో జాతీయ స్థాయి సింపోజియం
– అదే నెల 5న చలో ఢిల్లీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మహిళా వ్యతిరేక విధానాలను అవలంభిస్త్తున్నదని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మరియం ధావలే, పీకే శ్రీమతి విమర్శించారు. ఆ సంఘం జాతీయ కమిటీ సమావేశాలు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. రెండో రోజైన శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఐద్వా జాతీయ కోశాధికారి ఎస్ పుణ్యవతి, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన
కార్యదర్శులు ఆర్ అరుణజ్యోతి, మల్లు లక్ష్మితో కలిసి వారు మాట్లాడారు. మోడీ తొమ్మిదేండ్ల పాలనలో మహిళల అభివృద్ధిని మరింత వెనక్కు నెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. మనిషి బతకటానికి కూడు, గూడు, గుడ్డ కనీస అవసరమని చెప్పారు. పేదల మౌలిక అవసరాలు తీర్చలేని సర్కార్ ఎవరి కోసం పనిచేస్తున్నదని ప్రశ్నించారు. తినటానికి తిండిలేక, సరైన పౌష్టికాహారం లేక మహిళలు రోగాలు, నొప్పులు, రక్తహీనతతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆహార ధాన్యాలను సరఫరా చేయటంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఆహార భద్రతా చట్టాన్ని అది నిర్వీర్యం చేస్తోందని వాపోయారు. కరోనా కాలంలో ఉచితంగా 5కిలోల బియ్యం ఇచ్చారనీ, ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో ఉచిత బియ్యం, గోదుమలు, ఇతర సరుకుల పథాన్ని ఎత్తేశారని వివరించారు. పేదలకు కావాల్సిన కనీస అవసరాలను తీర్చలేని మోడీ ప్రభుత్వం మహిళలు, దళితులు,ఇతర తరగతులపై హింసను ప్రేరేపిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిజ్‌భూషణ్ వ్యవహారంపై అంతపెద్ద పోరాటం జరిగినా ఈ ప్రభుత్వం స్పందించలేదంటే ప్రభుత్వం మహిళల పట్ల ఎంత మొండిగా వ్యవహరిస్తున్నదో అర్థమవుతున్నదని చెప్పారు. మణిపూర్‌లో కుకీలకు, మైటీలకు మధ్య మంటపెట్టింది బీజేపీ సర్కారేనని తెలిపారు. దీంతో అక్కడ ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారనీ, గాయాల పాలవుతున్నారనీ,వేల మంది రోడ్డుపాలయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. వీరి విభజన రాజకీయాల్లో మహిళలు సమిథలవుతున్నారని చెప్పారు. ఈ పాపం బీజేపీ ప్రభుత్వానిదేనని విమర్శించారు. మరో పక్క కులాంతర వివాహాలు చేసుకున్న దంపతులను అత్యంత దారుణంగా హత్య చేస్తున్నారని వివరించారు. మత దురహంకారం వ్యక్తిగత జీవితాన్ని శాసించే స్థితికి దేశంలో వైషమ్యాలు పెరిగాయని చెప్పారు. దేశ ప్రజలు లౌకికత్వం కోసం, సర్వమానవ సమానత్వ ఆకాంక్షతో ఎన్నో ఏండ్లుగా కలిసి బతుకుతున్నారని గుర్తు చేశారు. కానీ.. ఆ వాతావరణాన్ని బీజేపీ కలుశితం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠ్యపుస్తకాల్లో ఆధ్యాత్మిక భావాజాలాన్ని జొప్పించటమేగాక, డార్విన్ సిద్ధాంతాన్ని తొలగిస్తున్నారని చెప్పారు. ఉమ్మడి పౌరస్మృతిని సమానత్వం కోసం తీసుకొస్తున్నామంటూ నమ్మబలుకుతున్నారనీ, ఇదంతా పచ్చి మోసమని విమర్శించారు. వాస్తవంగా ఉమ్మడి పౌరస్మృతి లక్ష్యం వేరుగా ఉందని చెప్పారు. దేశంలో 40శాతం మంది జనాలు ఆకలి, దారిద్య్రంతో అల్లాడిపోతున్నారన్నారని గుర్తు చేశారు. దేశంలో నిరుద్యోగం రాజ్యమేలుతున్నదని చెప్పారు. వీటి గురించి మాట్లాడకుండా..యూసీసీ గురించి ప్రధాని ప్రస్తావించడం అత్యంత శోచనీయమని అన్నారు. ఇది లౌకిక దేశమని చెప్పారు. ఇక్కడ అనేక మతాలు, జాతులు, సంస్కృతులు, సంప్రదాయాలు, జీవన విధానాలున్నాయన్నారు. వీటన్నింటిని కాదని యూసీసీని తీసుకురావటమేంటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న మహిళా వ్యతిరేక విధానాలపై ఆగస్టు రెండో వారంలో జాతీయ స్థాయి సింపోజియాన్ని నిర్వహిస్తున్నామనీ, అదే నెల 5న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు. మల్లు లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇండ్లు, ఇండ్ల స్థలాలు లేని ప్రజలు గణనీయంగా ఉన్నారని చెప్పారు. వారు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్నారని తెలిపారు. వారికి వెంటనే పక్కా ఇండ్ల నిర్మాణాలు చేపట్టాలనీ, పట్టాల పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పేదలపై ప్రభుత్వం పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.కేరళ తరహాలో 14రకాల నిత్యావసర వస్తువులు అందించాలన్నారు. మహిళా పారిశ్రామిక కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.