బజార్న పడిన బీజేపీ

– బండిని కాదని కిషన్‌రెడ్డికి అధ్యక్ష పీఠం
– నేతలు, కార్యకర్తలు పార్టీ వీడకుండా చూడటమే పెద్దటాస్క్‌
– బండిని తొలగించడంపై పార్టీ శ్రేణుల ఆగ్రహం
‘శభాష్‌… మేరా చోటా భారు’ అంటూ అనేక బహిరంగ సభల్లో భుజం చరిచిమరీ ప్రశంసించిన ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్‌షాల ద్వయం ఈసారికి బండికి ‘సారీ’ చెప్పేసింది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి రాష్ట్రంలో పార్టీ సారధ్య బాధ్యతలు అప్పగించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నమ్మకమైన మిత్రుడిగా పేరున్న కిషన్‌రెడ్డిని ఆ సీట్లో కూర్చోబెట్టడంపై రాష్ట్ర బీజేపీలో ముసలం ప్రారంభమైంది. పార్టీ సీనియర్లు బీజేపీ అధిష్టానం నిర్ణయంపై గుర్రుగా ఉన్నారు. కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో తెలంగాణలో అధికారంలోకి రావడం అనే అంశంపై బీజేపీ యూటర్న్‌ తీసుకున్నదనే ప్రచారం ప్రారంభమైంది. ఈ మార్పును గమనించిన బీజేపీ సీనియర్లు ఇప్పుడు పక్కచూపులు చూసేందుకు లైన్‌ క్లియర్‌ చేసుకుంటున్నట్టు ప్రచారం. పార్టీ అధిష్టానంపై ఇప్పటికే దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు ఫైర్‌ అయ్యారు. ఈటల రాజేందర్‌ సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయనకు పార్టీలో ఇచ్చిన పదవి కూడా ‘జారిపోకుండా’ పట్టుకునేందుకే అని ఆపార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. బండి హిందూ అతివాద ‘ఓవర్‌ యాక్షనే’ ఆయన కొంప ముంచిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల నాటికి కమలంలో మరిన్ని కుదుపులు తప్పేలా లేవు!!
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అధికారం కోసం పార్టీల్లో చీలికలు తేవడం, సామదానదండోపాయాలతో భయపెట్టి నేతలను చేర్చుకోవటం ద్వారా ముందుకెళ్తున్న బీజేపీకి తెలంగాణలో మాత్రం గట్టి స్ట్రోక్‌ తగిలింది. నిర్మాణపరంగా తలెత్తిన లోపాలతో కమలం పువ్వు రెక్కలు రాలిపోవడం మొదలైంది. ఆధిపత్యపోరు రూపంలో పట్టిన చెదలు రానున్నకాలంలో దేశవ్యాప్తంగానూ విస్తరించే అవకాశముంది. ఒక్కోనాయకుడిది ఒక్కో మాట.. ఒకరిపై మరొకరు ఫిర్యాదులు..మీడియా సాక్షిగా ప్రత్యారోపణలతో ఆ పార్టీకి రాజకీయంగా ఉన్న పరువు కాస్తా పోతున్నది. తెలంగాణలో నేతలపో రుతో నాయకత్వంలో మార్పులు, చేర్పులకు మొగ్గుచూపిన జాతీయ నాయకత్వం తప్పులో కాలేసినట్టే కనిపిస్తున్నది. ఈటల రాజేందర్‌తో పాటు ఇతర వలస నేతలు హస్తం గూటికి చేరకుండా అడ్డుకట్ట వేసేందుకు వేసిన నాయకత్వ మార్పు ఎత్తుగడ కాస్తా బెడిసికొట్టే అవకాశాలున్నాయి. ఈ నిర్ణయంతో తెలంగాణలో ఆ పార్టీ మరింత బలహీనం కాబోతున్నదా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సౌమ్యుడనే ముద్ర ఉన్న కిషన్‌రెడ్డిని అధ్యక్ష పీఠం మీద కూర్చోబెట్టినా అది ఆయనకు ముండ్ల పీఠంగా మారే సూచనలే కనిపిస్తున్నాయి. బండి సంజరుని కాపాడేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ ఎంత ప్రయత్నించినా త్రిమూర్తుల (మోడీ, అమిత్‌షా, నడ్డా) ముందు అది తేలిపోయింది. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న బండి సంజరు రానున్న కాలంలో మార్పు ఎత్తుగడ కాస్తా బెడిసికొట్టే అ కిషన్‌రెడ్డికి సహకరించేది కష్టమే. బండి తన ట్విటర్‌లో ఇక నుంచి సామాన్య కార్యకర్తను మాత్రమే అని రాసుకున్నారు. మరోవైపు రఘునందన్‌రావుపై బండి గ్రూపు భగభగ మండిపోతున్నది. అధిష్టానానికి సైతం ఆ గ్రూపు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే రఘునందన్‌రావుపై వేటు పడే సూచనలు కనిపిస్తు న్నాయి. ‘పార్టీ లైన్‌కు భిన్నంగా మాట్లాడితే జశ్వంత్‌ సింగ్‌, ఉమాభారతి, కళ్యాణ్‌సింగ్‌ వంటి అగ్రనేతలనే పక్కనబెట్టిన చరిత్ర బీజేపీకున్నది. వ్యక్తులే ముఖ్యమనే వాళ్లకు పార్టీలో స్థానం ఉండదు’ అని ఆ పార్టీ సీనియర్‌ నేత కాసం వెంకటేశ్వర్లు చేసిన వ్యాఖ్యలు రఘునందన్‌రావును ఉద్దేశించి చేసినట్టే కనిపిస్తున్నది.
నాలుగు గోడల మధ్య పెద్దలతో చర్చించాల్సిన అంశాలపై మీడియాకు ఎక్కడంపై బీజేపీ సీనియర్‌ నేతలు గరంగరం అవుతున్నారు. దుబ్బాక, హుజూరాబాద్‌ ఎన్నికల్లో రఘునందన్‌ రావు, ఈటల రాజేందర్‌ అనుచరులను బీఆర్‌ఎస్‌ కొనేసిన సమయంలో బీజేపీ కార్యకర్తలు పనిచేసి గెలిపించిన విషయాన్ని మరిచిపోవద్దని ఆ పార్టీ శ్రేణులు హెచ్చరిస్తున్నాయి. మరో నేత ఎస్‌.కుమార్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ..’20 ఏండ్ల నుంచి పార్టీలో పనిచేస్తున్నా. బండి సంజరు సామాన్య కార్యకర్త నుంచి అధ్యక్షుడి వరకూ ఎదిగారు. బండి సంజరునే అధ్యక్షుడిగా కొనసాగుతారని నడ్డా, తరుణ్‌చుగ్‌ చెప్పినా సరే కావాలనే ఆయనపై పదేపదే విష ప్రచారం చేశారు.
దీని వెనుక బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కుట్రలు ఉన్నాయి. బండి సంజయ్ కండ్లు నెత్తికెక్కాయంట. ఎందుకు ఎక్కుతారు? ఏం మాట్లాడుతున్నారు?’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇలా ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ నేతలు బండి మార్పును జీర్ణించుకోలేకపోతున్నారు.
ఐ పాయే…
బండి సంజయ్ ని పదవి నుంచి తప్పించడాన్ని ఆ పార్టీలోని మెజార్టీ కార్యకర్తలు జీర్ణించు కోలేకపోతున్నారు. ‘తెలంగాణ లో బీజేపీ నడ్డి విరిచిన నడ్డా’, ‘బీజేపీ కొత్త అధ్యక్షుడు వచ్చిన వేళ బీఆర్‌ఎస్‌కు అభినందనలు’, ‘ఒక బీసీ పదవి పోయిన తర్వాత మీ కండ్లు చల్లబడ్డాయా?’, ‘ఐపాయే.. ఆ ఊపు ఉండదిక’, ‘గులాబీ ప్రభుత్వం పట్ల ఎన్నికల ముందు కమలం పువ్వు మరోమారు మానవత్వం చాటుకున్నది’ ‘గతంలో కిషన్‌రెడ్డి అధ్యక్షునిగా ఉన్నాడు. అప్పుడు బీజేపీ గ్రాఫ్‌ పెద్దగా ఏం లేదు’ అంటూ హార్డ్‌కోర్‌ బీజేపీ కార్యకర్తలే తమ వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ డీపీలలో కామెంట్లు పెట్టడం ఆ పార్టీ అధిష్టానం పట్ల ఎంత వ్యతిరేకతతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో ‘బ్రహ్మాండమైన మెసేజ్‌. టర్మ్‌ పూర్తిచేసుకున్న బండికి ధన్యవాదాలు. బండి అగ్రెసివ్‌ లీడర్‌. కిషన్‌రెడ్డి హైలీ ఆక్సెప్టబులిటీ లీడర్‌. కిషన్‌రెడ్డి నాయకత్వంలో పార్టీ మరింత ముందుకు పోతుంది’ అని ఎంపీ ధర్మపురి అరవింద్‌ కామెంట్‌ చేశారు. కిషన్‌రెడ్డి నాయకత్వాన్ని సమర్ధిస్తూ కూడా పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. ఈ పోస్టులన్నీ గ్రూపుల పోరుకు నిలువెత్తు సాక్ష్యం. బీజేపీలో ఇప్పటిదాకా నేతల మధ్య జరిగిన అంతర్గత పోరు రానున్న కాలంలో వీధిపోరుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
రఘునందన్‌రావుపై వేటు వేస్తే ఆయన పార్టీని వీడుతారనే చర్చా నడుస్తున్నది. బండి నమ్ముకుని బీజేపీలో చేరిన నేతలు ఒక్కొక్కరుగా పార్టీనే వీడే అవకాశముంది. పార్టీని త్వరలో వీడబోతున్నారన్న జాబితాలో వివేక్‌, విజయశాంతి, ఎ.చంద్రశేఖర్‌, తదితర కీలక నేతలు ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నేతలను, కార్యకర్తలను కాపాడటమే కిషన్‌రెడ్డి ముందు ఉన్న పెద్ద టాస్క్‌. అందులో ఆయన ఏమేరకు సక్సెస్‌ అవుతారా? లేదా? అనేది వేచిచూడాల్సిందే.
– బీజేపీలో జంపింగ్‌లకే అందలం
– ఏపీ, పంజాబ్‌ అధ్యక్షులు కాంగ్రెస్‌ వాళ్లే..
– బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలో చేరిన ఈటలకు తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మెన్‌ పదవి
– జాతీయ ఎగ్జిక్యూటివ్‌గా కాంగ్రెస్‌ మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి
– తెలంగాణ అధ్యక్షుడిగా జి.కిషన్‌ రెడ్డి, ఏపీకి పురందేశ్వరి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన జంపింగ్‌ నేతలకు ప్రాధాన్యత పెరుగుతోంది. ఎప్పటి నుంచో పార్టీ జెండా పట్టుకొని, కష్టనష్టాలకు ఓర్చి నిలబడిన వారిని కాదని నిన్న మొన్న బీజేపీలో చేరిన నేతలకు అగ్ర తాంబూలం లభిస్తోంది. కాంగ్రెస్‌ పాలనలో కేంద్ర మంత్రిగా చేసిన డి. పురం దేశ్వరిని బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షరాలిగా నియమించారు. అలాగే కాంగ్రెస్‌ పంజాబ్‌ అధ్యక్షు డిగా పని చేసిన సునీల్‌ జక్కర్‌ను పంజాబ్‌ బీజేపీ అధ్యక్షుడి గా నియ మించారు. బీఆర్‌ఎస్‌లో రాష్ట్ర మంత్రిగా చేసిన ఈటల రాజేందర్‌ను బీజేపీ తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ అధ్యక్షుడిగా నియమించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డిని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యునిగా నియమించారు. జార్ఖండ్‌ వికాస్‌ మోర్చా (జేవీఎం) అధ్యక్షుడిగా ఉన్న బాబూలాల్‌ మరాండీ, తన పార్టీని బీజేపీ (2020 ఫిబ్రవరి)లో విలీనం చేయడంతో ఆయనకు బీజేపీ జార్ఖండ్‌ అధ్యక్ష పదవి దక్కింది.
bjpతెలంగాణకు జి.కిషన్‌ రెడ్డి,ఏపీకి పురందేశ్వరి
ఎన్నికలు సమీపిస్తున్న తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్ష మార్పులను చేసింది. తెలంగాణలో బండి సంజరు, ఆంధ్రప్రదేశ్‌లో సోము వీర్రాజును పార్టీ అధ్యక్ష పదవుల నుంచి తప్పించి, వారి స్థానంలో జి.కిషన్‌రెడ్డి, డి. పురందేశ్వరిలను నియమించింది.ఈమేరకు ఈ విషయాన్ని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆరుణ్‌ సింగ్‌ మంగళవారం ఒక ప్రక టనలో వెల్లడించారు. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని పేర్కొ న్నారు. అలాగే, తెలంగాణలో బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మెన్‌గా ఈటల రాజేందర్‌ని, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఏపీ మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డిని ఎంపిక చేశారు. వీరితో పాటు జార్ఖండ్‌ అధ్యక్షునిగా దీపక్‌ ప్రకాశ్‌ స్థానంలో మాజీ సీఎం జాబూలాల్‌ మరాండీ, పంజాబ్‌ అధ్యక్షుడిగా అహ్వానీ శర్మ స్థానంలో సునీల్‌ జక్కర్‌ను నియమించినట్టు ప్రకటనలో పేర్కొ న్నారు. ఇదిలా ఉండగా జులై 7న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్య దర్శులు, రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌లందరితో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమా వేశానికి బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్‌ సంతో ష్‌ అధ్యక్షత వహిస్తారు. బుధవారం ఉదయం 10:30 గంటలకు కేంద్ర మం త్రివర్గ సమావేశం కూడా జరిగే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉంది.

Spread the love