బండి ఔట్‌..!

– అధ్యక్షులుగా కిషన్‌రెడ్డి
– ప్రచార కమిటీ చైర్మెన్‌ బాధ్యతలు ఈటలకే
– సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి?
– త్రిముఖ ప్యూహంతోఎత్తుగడ

– బీఆర్‌ఎస్‌కు లబ్ది చేకూర్చేందుకే ఈ నిర్ణయమంటూ ప్రచారం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్ ను అధిష్టానం తప్పించినట్టు జోరుగా ప్రచారం జరుగుతు న్నది. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డినే అధ్యక్ష పీఠం ఎక్కించనున్నట్టు తెలిసింది. ఎన్నికల ప్రచార కమిటీ చైర్మెన్‌ బాధ్యతలను ఈటల రాజేందర్‌కు కట్టబెట్టాలనే తుది నిర్ణయానికి బీజేపీ అధిష్టానం వచ్చిందనే వార్త కోడై కూస్తున్నది. పదవుల పంచాయితీతో కొద్దిరోజులుగా నేతల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుకు చెక్‌ పెట్టాలనే అధిష్టానం ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. కానీ, ఈ నిర్ణయమే ఆ పార్టీలో కొత్త పంచాయితీకి తెరదీయబోతున్నది. ఇది అగ్గి రాజేసే ప్రమాదముంది. మరోవైపు ఈ వార్తలను బండి గ్రూపు జీర్ణించుకోలేకపోతున్నది. రాష్ట్రంలో పార్టీకి బండి మంచి హైప్‌ తీసుకొస్తున్న తరుణంలో ఇలాంటి నిర్ణయమేమిటని ప్రశ్నిస్తున్నది. మరోవైపు ఇది టీఆర్‌ఎస్‌కు మేలు చేసేందుకేననే ప్రచారమూ జరుగుతున్నది. ఎట్లాగూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేమని నిర్ణయానికి బీజేపీ వచ్చిందనీ, రానున్న కాలంలో బీఆర్‌ఎస్‌ ఎంపీ సీట్లు అవసరం గనుకనే అధిష్టానం ఇలా ముందుకెళ్తున్నదనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నది. కర్నాటక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్‌ రోజురోజుకీ పడిపోతున్నది. మరోవైపు కాంగ్రెస్‌ పుంజుకుంటున్నది. మంచిగా ఉన్నప్పుడు అందరూ గమ్ముగా ఉండి ఆహో..ఓహో అని బండి సంజ రుని పొగిడేశారు. రఘునందన్‌రావు, ఈటల గెలుపుతో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతున్నది అని తెగ ఆరాటం చేశారు. తేడా కొట్టగానే ఒక్కొక్క రూ లోపాలు ఎత్తిచూపటం మొదలుపెట్టారు. సీను సితార కావడంతో బీజేపీ లుకలుకలు కొంతకాలంగా బయటపడుతూనే ఉన్నాయి. నేతలంతా మూడు, నాలుగు గ్రూపులుగా విడిపోయి ఎవరికివారే యమునా తీరే అన్నట్టు వ్యవహరి స్తూ బీజేపీని తెలంగాణలో ఎక్కడ మొదలుపెట్టారో తిరిగి అదే స్థాయికి తీసుకొ చ్చారు. ఇలాంటి తరుణంలో తెలంగాణ శాఖలో ప్రక్షాళనకు బీజేపీ అధిష్టానం పూనుకున్నది. ఈటల రాజేందర్‌, డీకే అరుణ, రాజగోపాల్‌రెడ్డి, తదితర పేర్లను పరిశీలించిన అధిష్టానం చివరకు కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి వైపు మొగ్గుచూపు తున్నట్టు తెలిసింది. అయితే, మొదట రాష్ట్ర అధ్యక్ష పదవిని తీసుకునేందుకు ఆయన ససేమిరా అన్నట్టు ప్రచారం జరుగుతున్నది. దీంతో జాతీయ నాయకులు ఆయన్ను ఒప్పించారనే వార్త వినిపిస్తున్నది. కిషన్‌రెడ్డికి సౌమ్యుడిగా, బీజేపీలో అందర్నీ కలుపుకుని పోయే నేతగా ప్రచారముంది. అయితే, ఆయన సీఎం కేసీ ఆర్‌కు సన్నిహితంగా ఉంటారనే విమర్శా ఉంది. ఇదే విషయాన్ని బండి గ్రూపు ఎత్తిచూపుతున్నది. కిషన్‌రెడ్డి, ఈటల, రాజగోపాల్‌రెడ్డి, పలువురు సీనియర్లు ఒక్కటై బండిని పదవి నుంచి దింపేసే పనికి పూను కున్నారని బీజేపీ రాష్ట్ర శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. బండి సంజరుకి కేంద్ర సహాయ మంత్రి పదవి ఇచ్చి రాష్ట్రంలో కీలకంగా పనిచేసేలా బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారముంది. ఇలాగైతే బండి అనుకూల, వ్యతిరేక గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు మరింత తీవ్రమయ్యే అవకాశమే ఎక్కువ. ఇష్టం లేని పదవుల్లో ముగ్గురు నేతలు ఎంత కాలం కొనసాగుతారో, ఎన్నికల ముందు రెక్కలు రాలకుండా కమలం పువ్వును ఎంత ముందుకు తీసుకెళ్తారో, అనూహ్యనిర్ణయాలు, వ్యూహాలు, ప్రయోగాలతో కమలం పువ్వు వికసిస్తుంతో, వాడిపోతుందో వేచిచూడాల్సిందే.

Spread the love