ఉత్సవాలు సరే..హామీల మాటేమిటి…?

విభజన అంశాల ఊసెత్తని బీజేపీ
– రైల్వే కోచ్‌, యూనివర్సిటీల ప్రస్తావనే లేని వైనం
– నిధులు, ఆర్థిక సాయాలపై నోరు మెదపని మంత్రి కిషన్‌రెడ్డి
– రాష్ట్రాన్ని విస్మరించిన ‘గోల్కొండ కోట’ ఉత్సవాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
‘పైన పటారం.. లోన లొటారం…’ అన్నట్టుగా ఉంది బీజేపీ నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వానికి ధీటుగా హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో ఉత్సవాలను నిర్వహిస్తామంటూ ప్రగల్భాలు పలికిన కమలం పార్టీ…’ఆత్మస్తుతి, పరనింద’ అనే టైపులోనే వ్యవహరించింది తప్ప వాటి వల్ల రాష్ట్రానికి, ప్రజలకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అంతా తానై అన్నట్టు వ్యవహరించిన ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోడీనీ, బీజేపీని పొగుడుతూ.. రాష్ట్ర ప్రభుత్వాన్నీ, సీఎం కేసీఆర్‌ను తిడుతూ ఊకదంపుడు ఉపన్యాసం దంచారు తప్పితే… ఇతమిద్దంగా తెలంగాణకు ఇప్పటి వరకూ ఏం చేశారో, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారనే విషయాలను కనీసం ప్రస్తావించకపోవటం గమనార్హం. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 2014లో అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్‌… విభజన హామీలు, రాష్ట్రానికి నిధులు, విధులు, అధికారాలు, ప్రత్యేక గ్రాంట్లు, ఆర్థిక సాయాల విషయంలో తీవ్ర అన్యాయం చేసింది. ఈ క్రమంలో వీటన్నింటినీ మరుగు పరుస్తూ బీజేపీ ఉత్సవాలను నిర్వహించిందే తప్ప… కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా తన బాధ్యతను సక్రమంగా నిర్వహించలేకపోయింది.
రాష్ట్ర విభజన హామీల్లో హైదరాబాద్‌కు ట్రిబుల్‌ ఐటీ, కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, ములుగులో గిరిజన యూనివర్సిటీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ తదితరాలు ముఖ్యమైనవి. వీటి గురించి కిషన్‌రెడ్డి తన ప్రసంగంలో ఒక్క ముక్కా చెప్పలేదు. కేంద్రంలో బీజేపీ గద్దెనెక్కిన తర్వాత ఈ తొమ్మిదేండ్ల కాలంలో వీటిని ఎందుకు ఏర్పాటు చేయలేదో.. అసలు మున్ముందు ఏర్పాటు చేస్తారా..? లేదా..? అనే విషయాన్ని కూడా బీజేపీ నేతలు స్పష్టం చేయలేదు. రాష్ట్రంలో ఆ పార్టీకి నలుగురు ఎంపీలున్నారు. వారు గత నాలుగేండ్ల నుంచి తెలంగాణకు ఎంత మేర నిధులు తెచ్చారు..? ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారనే దానిపై కూడా క్లారిటీ ఇవ్వలేదు. తాను స్వయానా కేంద్ర మంత్రిగా ఉన్న నేపథ్యంలో తెలంగాణకు రావాల్సిన జీఎస్టీ బకాయిలు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులను ఆయన తెప్పించలేకపోయారు. ఈ విషయాన్ని కూడా మంత్రి ఒప్పుకోలేదు.
జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్ల సంఖ్య పెంపునకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడు ఆందోళన మొదలైంది. దీనిపై రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ఇప్పటికే స్పందించారు. కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం కొన్నేండ్ల నుంచి కుటుంబ నియంత్రణను పాటిస్తూ జనాభాను నియంత్రించిన దక్షిణాదికి ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చిన కొత్త రూల్స్‌ తీవ్ర నష్టాన్ని చేకూరుస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ప్రాంతం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి… ఆ అంశం గురించి మాట మాత్రం కూడా ప్రస్తావించకపోవటం శోచనీయమని పలువురు విమర్శిస్తున్నారు.
మరోవైపు సామాన్యుడి బతుకులో కుంపట్లు రాజేస్తోన్న పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరల తగ్గింపుపై కమలం పార్టీ పెద్దలు నోరు మెదరపలేదు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ ఊసెత్తలేదు. విదేశాల నుంచి నల్లధనం తెప్పించి ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్న మాటను మరిచారు. పెద్ద నోట్ల రద్దు పర్యవసానాలను వారు విస్మరించారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి పోటీగా ఉత్సవాలను నిర్వహించాలనే ఆతృత బీజేపీ నేతల్లో కనిపించింది తప్ప ఆ సభ వల్ల ఇటు రాష్ట్రానికి, అటు ప్రజలకు ఒరిగిందేమీ లేదని ప్రజలు, మేధావులు వాపోతున్నారు.

Spread the love