చూపంతా అటువైపే… మెతుకు సీమలో రాజకీయం కుతకుత

– బీఆర్‌ఎస్‌కు 8 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు
– కాంగ్రెస్‌, బీజేపీకి చెరో ఎమ్మెల్యే ప్రాతినిధ్యం
– ఈసారి పది స్థానాల్లో గెలిచేందుకు బీఆర్‌ఎస్‌ కసరత్తు
– కాంగ్రెస్‌కు క్యాడరున్నా లీడర్లలో అనైక్యత
– ఊగిసలాటలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి
– అధిష్టానంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ అలక
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఎన్నికల కోలాహలం మొదలైంది. ఉమ్మడి మెదక్‌ జిల్లా రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు పోలింగ్‌ యుద్ధానికి సిద్దమవుతున్నాయి. ఢ అంటే ఢ అనుకునే విధంగా వ్యూహాలకు పదును పెడుతున్నాయి. సీఎం కేసీఆర్‌, ట్రబుల్‌ షూటర్‌ హారీశ్‌రావు సొంత జిల్లా కావడంతో ఉమ్మడి జిల్లాలోని అన్ని స్థానాల్లోనూ గెలిచేలా వ్యుహారచన చేస్తున్నారు. అయితే, కర్నాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ క్యాడర్‌లో బూస్టింగ్‌ వచ్చినా.. ఆ పార్టీ లీడర్లలో అనైక్యత ఏ మాత్రం తగ్గలేదు. ఇద్దరు మాజీ మంత్రులు, ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు,ఎంపీలున్నా ఐక్యత లేదు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు సైతం ఆ పార్టీ అధిష్టానంపై అసంతృప్తి గళం విప్పారు.
ఉమ్మడి మెదక్‌ జిల్లా రాజకీయ ముఖ చిత్రాన్ని పరిశీలిస్తే… సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట మూడు జిల్లాలుగా ఏర్పడ్డాయి. సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్‌(ఎస్సీ), ఆందోల్‌ (ఎస్సీ), నారాయణఖేడ్‌, సంగారెడ్డి, పటాన్‌చెరు అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయి. మెదక్‌ జిల్లాలో నర్సాపూర్‌, మెదక్‌ స్థానాలున్నాయి. సిద్దిపేట జిల్లాలో గజ్వేల్‌, దుబ్బాక, సిద్దిపేట స్థానాలున్నాయి. పాత మెదక్‌ జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు గాను 8 చోట్ల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలున్నారు. మెదక్‌, జహీరాబాద్‌ రెండు పార్లమెంట్‌ స్థానాల్లోనూ ఆ పార్టీ ఎంపీలున్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు గజ్వేల్‌, ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హారీశ్‌రావు సిద్దిపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి తూర్పు జయప్రకాశ్‌రెడ్డి(జగ్గారెడ్డి) సంగారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్‌రావు బీజేపీ నుంచి గెలిచారు.
ఆ ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌ గట్టి అభ్యర్థులు
వచ్చే ఎన్నికల్లో 10 అసెంబ్లీ స్థానాల్లోనూ గెలిచేందుకు బీఆర్‌ఎస్‌ వ్యుహారచన చేస్తోంది. మూడు జిల్లాలకు మూడు మెడికల్‌ కళాశాలు, పదుల సంఖ్యలో పరిశ్రమలొచ్చాయి. కాళేశ్వరం, గౌరవెల్లి వంటి ప్రాజెక్టులు పూర్తయ్యాయి. బసవేశ్వర, సంఘమేశ్వర లిప్ట్‌ పనులు నడుస్తున్నాయి. సంక్షేమ పథకాలు ఎక్కువ మందికి అందించడంలో కేసీఆర్‌, హరీశ్‌రావు ఇద్దరి పాత్ర ఉంది. ప్రభుత్వ పరంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దశాబ్ధి ఉత్సవాలను రాజకీయ వేదికలుగా ఉపయోగపెట్టుకున్నారు. పార్టీ పరంగా క్యాడర్‌ను యాక్టీవ్‌ చేసేందుకు ఆత్మీయ సమ్మేళనాలకు భారీ ఎత్తున సమీకరించారు. ఎమ్మెల్యేలు లేని రెండు నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాల్ని బరిలోకి దించే ప్రయత్నాల్లో ఉన్నారు. దుబ్బాకలో రఘునందన్‌రావును ఓడించేందుకు మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిని సిద్ధం చేశారు. ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మెన్‌ చింత ప్రభాకర్‌ అనారోగ్యంతో ఉన్నారు. దీంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ధీటైన అభ్యర్థిని పోటీ పెట్టేందుకు ఎమ్మెల్సీ, మాజీ కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డిని సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. లేదంటే జంగారెడ్డికే బీఆర్‌ఎస్‌ కండువా కప్పాలనే వ్యుహాంతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో ఒకరిద్దర్ని మార్చాల్సి వస్తే ప్రత్యామ్నాయ అభ్యర్థుల్ని కూడా బీఆర్‌ఎస్‌ అధిష్టానం పరిశీలిస్తున్నట్టు తెలిసింది.. జహీరాబాద్‌ లో టీపీసీసీ సభ్యులు ఎన్‌.నరోత్తంతో సీఎం కేసీఆర్‌ స్వయంగా మాట్లాడి పార్టీలో చేర్చుకున్నారు. ఆర్థిక పరిపుష్టి కల్గిన ఆయన్ను బీఆర్‌ఎస్‌లో చేర్చుకుని కాంగ్రెస్‌కు షాక్‌ ఇచ్చారు. కాంగ్రెస్‌కు చెందిన ఓ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలతో హారీశ్‌రావు చర్చలు జరుపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.
ఇంకా మేల్కొనని హస్తం
ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ రెండో పెద్ద పార్టీగా ఉంది. ఒకప్పుడు మెదక్‌ కాంగ్రెస్‌పార్టీకి పెట్టనికోట. రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాయకులున్నా ఆశించిన స్థానాల్లో గెలవలేదు. రేవంత్‌రెడ్డి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత కొంత యాక్టివ్‌ అయినా.. ఐక్యత మాత్రం లేదు. ప్రస్తుతం రాహుల్‌ జోడో యాత్రను జిల్లాలో సక్సెస్‌ చేశారు. కర్నాటకలో గెలుపు తరువాత కార్యకర్తల్లో జోష్‌ పెరగింది. కాకపోతే నియోజకవర్గాల్లో గ్రూపుల లొల్లి ఎక్కువైంది. ఇద్దరు మాజీ మంత్రులు, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలున్నా వారంత పార్టీని ఐక్యంగా నడిపేందుకు చొరవ చూపట్లేదన్నది క్యాడర్‌ ఆవేదన. సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి మౌనంగా ఉంటున్నారు. ఢిల్లీ సమావేశానికి వెళ్లి రాహుల్‌ను కలిసినా ఖమ్మం సభలో తనకు తగిన ప్రాధాన్యత దక్కలేదని అసంతృప్తిలో ఉన్నారు. జగ్గారెడ్డి కాంగ్రెస్‌ను వీడే అవకాశముందనే ప్రచారముంది. ఆయన పార్టీ మారితే సంగారెడ్డిలో కాంగ్రెస్‌కు చెప్పుకోదగ్గ లీడరే ఉండరు. జహీరాబాద్‌లో మాజీ మంత్రి గీతారెడ్డితో గ్రూపు తగాదాల్ని భరించలేక నరోత్తం కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరారని ప్రచారం జరుగుతోంది. మాజీ ఉపముఖ్యమంత్రి దామోదరరాజనర్సింహ్మ ఆందోల్‌కే పరిమితమయ్యారు. ఆయన కూడా పార్టీ వీడుతారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పటాన్‌చెరులో కాట శ్రీను, గాలి అనిల్‌, దుబ్బాకలో చెరుకు శ్రీనివాసరెడ్డి, కత్తి కార్తిక గ్రూపులున్నాయి. సిద్దిపేట, మెదక్‌, నర్సాపూర్‌లోనూ ఇదే పరిస్థితి. ఎన్నికల వేళ బీజేపీ, బీఆర్‌ఎస్‌లోని అసమ్మతి నాయకుల్ని పార్టీలో చేర్చుకునేందుకు రేవంత్‌రెడ్డి ప్లాన్‌ చేస్తున్నారనే చర్చ ఉంది. విజయశాంతి, బీఆర్‌ఎస్‌లో టికెట్‌ రాని ఒకరిద్దరు కూడా కాంగ్రెస్‌ టచ్‌లో ఉన్నారనే చర్చ నడుస్తోంది.
అయోమయంలో బీజేపీ
ఉమ్మడి మెదక్‌ జిల్లా బీజేపీలో అయోమయ పరిస్థితి నెలకొంది. ఆ పార్టీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు ఇటీవల ఢిల్లీ వేదికగా విలేకరుల చిట్‌చాట్‌లో బండి సంజరుతో పాటు జాతీయ అధ్యక్షులు నడ్డాపై వ్యతిరేక కామెంట్‌లు చేసినట్టు మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన మాట్లాడిన ఒరిజినల్‌ ఆడియోలతో అధిష్టానానికి ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు.
రెండు రోజులుగా రఘునందన్‌రావుకు వ్యతిరేకంగా దుబ్బాకలో బీజేపీ శ్రేణులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆయన కూడా పార్టీ మారడం కోసమే పార్టీ పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను గెలిచేందుకు వీలున్న బీఆర్‌ఎస్‌ లేదంటే కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతారనే ప్రచారముంది. మరో పక్క ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన బాబుమోహన్‌, విజయశాంతి, నందీశ్వర్‌గౌడ్‌, శివరాజ్‌పాటిల్‌, జైపాల్‌రెడ్డి, మురళీధర్‌యాదవ్‌, చక్రధర్‌గౌడ్‌, శ్రీకాంత్‌ గౌడ్‌ వంటి నాయకులు చివరి వరకూ ఆ పార్టీలో ఉంటారనే గ్యారంటీ లేదని సంప్రదాయ బీజేపీ శ్రేణులు చెబుతున్నారు.

Spread the love