– మోడీ దేశాన్ని మోసం చేసిండు…
– కులం, మతం మీద ఏ పార్టీ గెల్వదు..
– అందర్నీ కాపాడుకోవాలంటూ నేతలకు దిశా నిర్దేశం
– 95 నుంచి 105 సీట్లు గెలుస్తాం : బీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గుజరాత్ మోడల్ అనేది ఓ బోగస్ అని బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. ఈ క్రమంలో దేశానికి తెలంగాణ మోడల్ అనివార్యమని ఆయన తెలిపారు. ప్రధాని మోడీ దేశాన్ని మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కులం, మతం ప్రాతిపదికన ఏ పార్టీ గెలవబోదని స్పష్టం చేశారు. అందువల్ల ప్రజలతో అనున్యితం మమేకం కావాలని సూచించారు. ‘పిల్లల కోడి లెక్కుండాలి..తద్వారా అందర్నీ కాపాడుకోవాలి…’ అని ప్రజా ప్రతినిధులకు దిశా నిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో 95 నుంచి 105 సీట్లను గెలవబోతున్నామంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. సర్వేలన్నీ బీఆర్‌ఎస్‌కే అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. తాను చెప్పినట్టు అందరూ కలిసికట్టుగా పనిచేస్తే ప్రతీ ఒక్కరికీ 50 వేలకన్నా ఎక్కువ మెజారిటీ వస్తుందని వివరించారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. మంత్రులు, బీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మెన్లతోపాటు అన్ని స్థాయిల్లోని ప్రజా ప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మెన్లు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ రానున్న ఎన్నికలు, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు, ఈ పదేండ్ల కాలంలో సాధించిన ప్రగతి తదితరాంశాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు. తెలంగాణ అనేది వజ్రపుతునక అని సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. స్వరాష్ట్రం సాధించుకుని అద్భుతంగా ముందుకు సాగుతున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ (దశాబ్ది) ఉత్సవాలను జూన్ 2 నుంచి 21 వరకు ఘనంగా నిర్వహించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
కాంగ్రెస్‌తో జరజాగ్రత్త…
విస్తృతస్థాయి సమావేశం సందర్భంగా ఇటీవల వెలువడిన కర్నాటక ఎన్నికల ఫలితాలను సీఎం ప్రస్తావించినట్టు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను తక్కువగా అంచనా వేయొద్దంటూ ఆయన ఈ సందర్భంగా నేతలకు సూచించారు. కర్నాటక ఫలితాల నేపథ్యంలో ఆ పార్టీ మాంచి జోష్‌లో ఉందనీ, రాబోయే రాజకీయ పరిణామాలను చాలా జాగ్రత్తగా అంచనా వేయాలని ఆయన సూచించారు. క్షేత్రస్థాయిలో బీఆర్‌ఎస్‌కు చెందిన కార్యకర్తలు, నాయకుల్లో ఎవరెవరు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారనే విషయాన్ని ఎప్పటికప్పుడు పసిగట్టి తనకు రిపోర్టును అందించాలని ఆదేశించారు.
కేసీఆర్ చేసిన సూచనలు…
– దశాబ్ది ఉత్సవాలను దేశమంతా దద్దరిల్లేలా ఘనంగా నిర్వహించాలి
– ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులందరూ ఉత్సవాల్లో భాగస్వాములు కావాలి
– విషయ ప్రాతిపదికన రాజకీయాలు చేయాలి తప్ప చిల్లర మల్లర అంశాలు, కుత్సిత మనసుతో పని చేయొద్దు
– అత్యధికంగా సిట్టింగులకే ఈసారి సీట్లు
– ప్రతీ అంశాన్ని నేనే స్వయంగా పర్యవేక్షిస్తున్నా.. అందువల్ల ఏ ఒక్కరూ ఎలాంటి తప్పుకూ ఆస్కారమివ్వొద్దు
– కల్తీ విత్తనాలపై సీరియస్‌గా ఉండాలి. వాటిని అమ్మే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి. రైతులను మోసం చేసే వారిని ప్రభుత్వం వదిలిపెట్టబోదనే సంకేతాలను ఇవ్వాలి
– దశాబ్ది ఉత్సవాల్లో ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్ సేవలను విరివిగా వినియోగించుకోవాలి
– కవి సమ్మేళనాలు నిర్వహించాలి. వీటికి ఎమ్మెల్యేలే నేతృత్వం వహించాలి