బీజేపీది దిక్కుమాలిన పాలసీ

– బొగ్గుగనులను ప్రయివేటుకు అప్పగించే కుట్ర
– దేశంలో 361 బిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలు
– అయినా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం దౌర్భాగ్యం
– ధరణితో రైతులు, పల్లెలు సుభిక్షంగా ఉన్నాయి
– దీనిని తీసేస్తామన్న వారిని బంగాళాఖాతంలో పడేయాలి
– అన్ని రంగాల్లో నెంబర్‌ వన్‌ స్థానంలో రాష్ట్రం
– సింగరేణి కార్మికులకు వచ్చే దసరాకు రూ.700కోట్ల బోనస్‌
– వికలాంగులకు ఈ నెల నుంచే మరో రూ.వెయ్యి పింఛన్‌ పెంపు : మంచిర్యాల సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌
పలు కొత్త పథకాలు, అభివృద్ధి పనులకు శ్రీకారం
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు బొగ్గుగనులను ప్రయివేటుకు అప్పగిద్దామని ప్రయత్నం చేస్తోంది.. దేశంలో బొగ్గుకు కొరత లేదు.. 361కోట్ల బిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలు ఉండగా ప్రయివేటుపరం చేయాలని చూస్తోంది.. ఆస్ట్రేలియా, ఇండోనేషియా నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటోంది.. ఇదేం దిక్కుమాలిన పాలసీ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. రాష్ట్రానికి వచ్చిన మోడీ సింగరేణిని ప్రయివేటుపరం చేయబోమని చెప్పారని.. బెంగళూరు వెళ్లిన తర్వాత ప్రయివేటుకు అప్పగిస్తామని చెప్పారని ఎద్దేవా చేశారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో నెంబర్‌ వన్‌ స్థానంలో నిలుస్తోందని తెలిపారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన సమీకృత కలెక్టరేట్‌ భవనంతో పాటు పలు అభివృద్ధి పనులు, కొత్త పథకాలను ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అధ్యక్షతన నస్పూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. అస్సాంతోపాటు దేశ రాజధాని డిల్లీలోనూ కరెంటు కోతలు ఉన్నాయని, ఎలాంటి కోతలు లేకుండా 24గంటల పాటు కరెంటు సరపరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు. మరో 150ఏండ్లపాటు దేశానికి అవసరమైన కరెంటు ఉత్పత్తి చేసేందుకు బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, కానీ కేంద్రం ఈ రంగాన్ని ప్రయివేటుకు అప్పగించేందుకు ప్రయత్నిస్తోందని.. అందులో భాగంగా విదేశాల నుంచి ఇబ్బడిముబ్బడిగా బొగ్గు దిగుమతి చేసుకుంటోందని విమర్శించారు.
ఈ యాసంగిలో దేశమంతా 94లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా ఇందులో తెలంగాణలోనే 54లక్షల ఎకరాల్లో వరి సాగైందని తెలిపారు. 3కోట్ల టన్నుల ధాన్యం పండుతోందన్నారు. తలసరి ఆదాయం, విద్యుత్‌శక్తి, మున్సిపాలిటీలు, తాగునీటి సరఫరా తదితర రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని తెలిపారు. 134ఏండ్ల చరిత్ర కలిగిన సింగరేణిని గత కాంగ్రెస్‌ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని, కేంద్రం దగ్గర అప్పులు తీసుకొని 49శాతం వాటా కింద కేంద్రానికి కట్టబెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో 11వేల కోట్ల టర్నోవర్‌ ఉండగా.. తెలంగాణ వచ్చిన తర్వాత 33వేల కోట్ల టర్నోవర్‌కు పెంచామని, సింగరేణిలో ఈ సంవత్సరం రూ.2184కోట్ల లాభాలు గడించామని తెలిపారు. గతంలో కాంగ్రెస్‌ హయాంలో 6453 ఉద్యోగాలు కల్పిస్తే.. తెలంగాణ వచ్చిన తర్వాత 19,463 ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. సింగరేణి కార్మికులకు వచ్చే దసరాకు రూ.700కోట్ల బోనస్‌ ఇస్తామని ప్రకటించారు. తాము ధరణిని తీసుకొచ్చిన తర్వాత పల్లెల్లో ఎలాంటి తగాదాలు, భూకబ్జాలు లేకుండా పోయాయని రైతులు, పల్లెలు ప్రశాంతంగా ఉన్నాయని చెప్పారు. తెలంగాణలో 2.75కోట్ల ఎకరాలు భూమి ఉండగా.. 1.55కోట్ల ఎకరాలు ధరణిలో ఎక్కాయని, మిగిలిన 65లక్షల ఎకరాలు అటవీ భూమి ఉందని వివరించారు. 99శాతం రైతుల భూములు ధరణిలో ఎక్కాయని చెప్పారు. కానీ కాంగ్రెస్‌ నాయకులు ధరణిని తీసేస్తామని చెబుతున్నారని, మళ్లీ దళారుల రాజ్యం తీసుకొస్తారని జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ధరణిని తొలగిస్తామని చెప్పినోళ్లను ఎన్నికల్లో బంగాళాఖాతంలో విసిరేయాలన్నారు. ఆపద మొక్కులు మొక్కేవారిని నమ్మకూడదని హితవుపలికారు. ఈ నెల నుంచే వికలాంగులకు ప్రతి నెలా రూ.4116 పింఛన్‌ అందజేస్తామని, కుల వృత్తులకు రూ.లక్ష సాయం పథకం ప్రారంభించామని, సొంత జాగా కలిగిన వారికి గృహలకిë పథకం కింద రూ.3లక్షలు అందజేస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, రేఖానాయక్‌, జోగు రామన్న, రేఖానాయక్‌, జిల్లా పరిషత్‌ అధ్యక్షులు నల్లాల భాగ్యలక్ష్మీ, కోవలక్ష్మీ జనార్దన్‌ రాథోడ్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, దండె విఠల్‌, టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు వెంకట్రావ్‌, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, విజిత్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love