బడాబాబుల సేవలో మోడీ భూముల అమ్మకంలో కేసీఆర్‌ బిజీ

– పేదలకు జానెడు జాగా దొరకదు
– 27లోగా ఇండ్ల స్థలాల పంపిణీపై ప్రకటన చేయాలి
– రాష్ట్ర ప్రభుత్వానికి బస్సుజాత కన్వీనర్‌ ఎస్‌. వీరయ్య డిమాండ్‌
– సమరశీల పోరాటాలకు సిద్ధంకావాలని పిలుపు
నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం సమరశీల ఉద్యమాలకు పేదలు సిద్ధం కావాలని ప్రజాసంఘాల ఐక్య పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్‌ వీరయ్య పిలుపునిచ్చారు. ఇండ్ల స్థలాలు ఇప్పుడు సాధించుకోకపోతే, ముందుముందు పేదలకు జానెడు జాగా కూడా దొరకబోదని స్పష్టం చేశారు. నగరీకరణ పథకం పేరిట కేంద్రం బడా కార్పొరేట్లకు భూములు ధారాదత్తం చేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం భూములు అమ్ముకుని సొమ్ము చేసుకుంటుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గృహలక్ష్మి పథకం కంటితుడుపు చర్య అని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇండ్లు లేని పేదలకు స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.15 లక్షల ఆర్థికసాయం చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వాగ్దానం చేసినట్టుగా ఎన్నికలలోపు రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు నిర్మించి పేదలకు పంచాలని డిమాండ్‌ చేశారు. ఇక ఇండ్ల స్థలాల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 27లోగా నిర్ధిష్ట కాలపరిమితితో కూడిన అధికారిక ప్రకటన చేయాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం తెలంగాణ ప్రజా సంఘాల ఐక్య పోరాట వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన ప్రారంభమైన బస్సుజాతా శనివారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి చేరుకుంది. మొదట కంఠేశ్వర్‌ బైపాస్‌ వద్ద బస్సు యాత్రకు జిల్లా నేతలు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి ర్యాలీగా సభావేదిక రాజీవ్‌గాంధీ ఆడిటోరియానికి యాత్ర చేరింది. ఈ సందర్భంగా బస్సుయాత్ర కన్వీనర్‌ ఎస్‌. వీరయ్య మాట్లాడుతూ.. దేశంలో 2022 డిసెంబర్‌ 31 నాటికి ఇండ్లులేని పేదలందరికీ పక్కా ఇండ్లు కట్టిస్తామని ప్రధానమంత్రి మోడీ హామీనిచ్చి, ప్రధానమంత్రి ఆవాజ్‌ యోజన అంటూ అదరగొట్టి ఇప్పుడు ఇండ్ల ఊసేఎత్తడం లేదని విమర్శించారు. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు ఇస్తామని కేసీఆర్‌ చెప్పడంతో ప్రజలు కండ్లు కాయలు కాసేలా ఎదురు చూసినా అమలు చేయలేదని వాపోయారు. తెలంగా ణలో మేమే అధికారంలోకి వస్తామంటున్న బీజేపీ అధ్యక్షులు బండి సంజరు ఇండ్లు, ఇండ్ల స్థలాలపై మాటెత్తడం లేదని విమర్శించారు. బీజేపీకి మొదటి నుంచీ పేదల సమస్యలు పట్టవని ఆరోపించారు. మోడీకి కుడి ఎడమ భుజంలా అంబానీ, అదానీ ఉన్నారని, వీరుంటే సరిపోతుందని అన్నారు. నిజామాబాద్‌ జిల్లాలోని పేదలందరికీ 125 గజాల స్థలం ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి రాష్ట్రం రూ.5 లక్షలు, కేంద్రం రూ.10 లక్షలు సాయం చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గృహలక్ష్మిలో రూ.3 లక్షల సాయంతో పునాదులు కూడా లేవవని, దాంతో పేదలకు ఉపయోగం జరగబోదని స్పష్టం చేశారు. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్‌ మాట్లాడు తూ.. ధర్మపురి అరవింద్‌ పసుపు బోర్డు హామీ ఎంత జూటానో, మోడీ చెప్పిన అందరికీ ఇండ్లు కూడా అంతే జూటా, మోసం అని విమర్శించారు. పేద ప్రజలకు వ్యతిరేకంగా నిలబడిన ప్రభుత్వాలు ఎక్కువ కాలం నిలబడలేవని హెచ్చరించారు. బడాబాబులు, రియల్టర్లు వందల ఎకరాలు తన్నుకుపోతున్నా పట్టించుకోని సర్కారు పేదలకు తలదాచుకునేందుకు స్థలం కోరితే కేసులు పెడుతూ అరెస్టులు చేస్తున్నారని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం స్థలాలు పంపిణీ చేయకపోవడం వల్ల పేదలు శివారు ప్రాంతాల్లో, మురికివాడల్లో, పాములతో సావాసం చేయాల్సిన పరిస్థితి తలెత్తిందని వాపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు పంపిణీ చేసే వరకు పోరాటం ఆగబోదని స్పష్టం చేశారు. యాత్రలో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌ బాబు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ వెంక్రటా ములు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేష్‌, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్‌, సోషల్‌ మీడియా రాష్ట్ర కన్వీనర్‌ జగదీష్‌, ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్‌, రాష్ట్ర నాయకులు పర్వతాలు, జిల్లా నాయకులు రమేష్‌బాబు, నూర్జహాన్‌, పెద్ది వెంక్రటాములు, గంగాధరప్ప, వెంకటేష్‌, సుజాత, శంకర్‌గౌడ్‌, గోవర్ధన్‌, పెద్ది సూరి, అనిల్‌, విఘ్నేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love