రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు

– రూ.1.55 లక్షల కోట్ల వ్యయం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
‘ప్రేమాభిమానాలు లేకుండా వేలాది మంది బతకొచ్చు..కానీ నీళ్లు లేకుండా వించలేరు”.. డబ్ల్యూ.హెచ్‌.అడెన్‌, తత్వవేత్త. మానవ జీవితంలో నీటి ప్రాధాన్యతకు అద్దంపట్టే వ్యాఖ్య ఇది. నీటిది, మనిషి జీవితానిది అవినాభావ సంబంధమనేది అందరికి తెలిసిందే. అది సాగునీరు కావచ్చు. తాగునీరూ కావచ్చు. రాష్ట్ర అవతరణ అనంతరం తెలంగాణ సర్కారు సాగునీటి రంగంలో చేసిన కృషి ఎలావుంది? కుదేలైన సాగునీటి రంగ అభివద్ధిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలు ఫలిస్తున్నాయా? తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్నామన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మాట నిలబెట్టుకున్నారా? నేటి దశాబ్ది ఉత్సవాల సందర్భంలో పరిశీలిద్దాం. సాగు నీటి ప్రాజెక్టుల రూపకల్పన, వాటిని నిర్ధేశించిన వ్యవధిలో పూర్తి చేయడంలో కొన్ని భిన్నాభిప్రాయాలున్నా సాధించిన ప్రగతిని తక్కువ చేయలేం. నేడు నిర్మాణాలన్నీ దాదాపు పూర్తయి ప్రాజెక్టులన్నీ నేడు సరికొత్త రూపును సంతరించుకున్నాయి. దీనికితోడు పాత ప్రాజెక్టులనూ ఆధునీకరించటంతో సాగు విస్తీర్ణం పెరిగింది. తెలంగాణ ఇప్పుడు కోటిన్నర ఎకరాల మాగాణంగా అవతరించిందని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. రాష్ట్రానికి ప్రధాన నీటివనరులు గోదావరి, కృష్ణా నదులు. ఈ రెండింటా కలిపి రాష్ట్రానికి 1266.44 టీఎంసీల జలాలు అందుబాటులో ఉంటాయి. కృష్ణానదిలో 299 టీఎంసీలు, గోదావరిలో 967.94 టీఎంసీలు. అదనంగా కృష్ణాలో మరో 500 టీఎంసీలు మిగులు జలాలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో నీటి కేటాయింపులు సరిగ్గా వినియోగించకపోవడంతో తెలంగాణ ప్రాంత రైతులు తీరని కష్టాలుపడ్డారు. 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత, నీటి వాటా వినియోగించుకుని 125 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా కృషి సాగిందని ప్రభుత్వం చెబుతోంది. తెలంగాణ ఆయకట్టు 119 శాతం పెరిగిందని రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
ఆరు అంచెల వ్యూహం
నీటిపారుదల రంగాన్ని బలోపేతం చేసేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం ఆరు అంచెల వ్యూహాన్ని అనుసరించి అమలుచేసింది.
– ఏండ్ల తరబడి నిర్లక్ష్యానికి గురై కొనసాగుతున్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేయడం 2. నాగార్జుసాగర్‌, నిజాంసాగర్‌, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయడం
– మిషన్‌ కాకతీయ కింద రాష్ట్రంలోని అన్ని మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంకులు, వాటర్‌షెడ్ల పునరుద్ధరణ
– ప్రాజెక్టు కమాండ్‌ ఏరియా గుండా ప్రవహించే వాగులు, నదుల పునరుజ్జీవనం కోసం తూములు, చెక్‌డ్యామ్‌ల ద్వారా ట్యాంకులను ప్రధాన, మధ్యతరహా ప్రాజెక్టులతో అనుసంధానం చేయడం
– ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్న పాలమూరు-రంగారెడ్డి, సీతారామ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును చేపట్టడం
– మెరుగైన నీటి వినియోగ సామర్థ్యం, పంట ఉత్పాదకతను సాధించడానికి నీటిపారుదల వ్యవస్థల సమర్థవంతమైన అపరేషన్‌, నిర్వహణ.
నాడు.. నేడు
ప్రభుత్వ నివేదిక ప్రకారం తెలంగాణ వచ్చిన తర్వాత రూ.1,55,210.88 కోట్లు వ్యయంతో నీటిపారుదల విస్తీర్ణం 5.71 లక్షల ఎకరాల నుంచి 17.23 లక్షల ఎకరాలకు పెరి గింది. గతంలో ఉన్న చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు రాష్ట్రం సాగునీటి రంగం అవసరాలు తీర్చేలా లేకపోవడంతో భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. పెద్దపెద్ద జలాశ యాలను సైతం పునరుద్ధరించారు. ఆమేరకు భూగర్భనీటి వనరులూ అధికమయ్యాయి. తాజా బడ్జెట్‌లోనూ సాగునీటి ప్రాజెక్టు లకు రూ.9381.34 కోట్లు కేటాయించడం గమనార్హం.
కాళేశ్వరం ప్రాజెక్టు
ప్రపంచంలోనే ఎత్తిపోతల ప్రాజెక్టుల్లో అతి పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం. దీనిని తెలంగాణ ప్రభుత్వం రికార్డు సమయంలో నిర్మించింది. కాళేశ్వరం కింద 19.63 లక్షల ఎకరాల ఆయకట్టును సష్టించి, 18.83 లక్షల ఎకరాలను స్థిరీకరించేందుకు ప్రణాళికలు రూపొందించింంది. 13 జిల్లాలు, 31 నియోజకవర్గాలు, 121 మండలాలు, 1698 గ్రామాలకు కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరించి ఉంది. దిని కింద మూడు ఆనకట్టలు, 22 లిఫ్టులు, 21 భారీ పంపుహౌజులు, 15 రిజర్వాయర్లు, 203 కిలోమీటర్ల సొరంగమార్గాలు, 1531 కిలోమీటర్ల పొడవున కాలువలు నిర్మించారు. ప్రపంచ ఇంజినీరింగ్‌ అద్భుతంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రఖ్యాతి పొందిందని సర్కారు చెబుతున్నది. దీని ద్వారా సముద్ర మట్టం నుంచి 618 మీటర్ల ఎత్తుకు గోదావరి జలాలు ఎత్తిపోయడం జరుగుతున్నది.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం
నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం ఎల్లూరు గ్రామ సమీపంలోని శ్రీశైలం రిజర్వాయర్‌ ముంగిట నుంచి పంపింగ్‌ ద్వారా ఐదు దశల్లో నీటిని ఎత్తిపోసే ప్రయత్న మిది. నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌, నారా యణపేట్‌, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని మెట్ట ప్రాంతా లలో 12.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అంది ంచడానికి ఈ ప్రాజెక్టు ఉద్దేశించబడింది. ఇది పూర్తయితే చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కరువు ప్రాంతాల కల నెరవేరుతుంది.
దేవాదుల తుపాకుల గూడెం సమ్మక్క-సారక్క ప్రాజెక్టు
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌ మూడు జిల్లాల్లోని 6.74 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించేందుకు గోదావరి నది నీటిని మళ్లించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. డిండి, శ్రీరాంసాగర్‌ పునరు జ్జీవనం, ఆర్డీఎస్‌, తుమ్మిళ్ల, ఎత్తిపోతలు, గట్టు, పాల మూరు-రంగారెడ్డి, సీతా రామ, డిండి, గట్టు ఎత్తిపోతల, చిన్న కాళేశ్వరం (ముక్తేశ్వర), కడెం, చనాకా-కొరాట తదితర ప్రాజెక్టుల పనులూ వేగంగా జరుగు తున్నాయి.
సీతారామ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు:
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లోని 6.74 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నది.
నిండుగోళాలుగా చెరువులు
నీటి వనరులను పునరుద్ధరించడానికి ప్రభుత్వం మిషన్‌ కాకతీయ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో గొలుసుకట్టు చెరువులను పునరుద్ధించడం, పూడికలు తీయడం ద్వారా చెరువులనే ఆధారంగా చేసుకునే చాలా భూములు సాగులోకి వచ్చాయి. అంతేకాకుండా భూగర్భజలాల సామర్థ్యం పెరిగి బావులు, బోర్లల్లో నీరు లభిస్తున్నది. దాదాపు 15 లక్షల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం 46,531 చెరువుల్లో పూడిక తొలగించి, తూములు, కట్ట లను పటిష్టంగా నిర్మించడం కోసం ప్రభుత్వం రూ. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. మిషన్‌ కాకతీయ ద్వారా పునరు ద్దరించబడిన చెరువులకు భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల నుంచి కాలువల ద్వారా నీటిని తరలించి ఎండాకాలంలో సైతం చెరువులు నిండుగోళాలుగా తయారయ్యేలా చర్యలు చేపట్టింది.
పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తి
రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌, భీమా, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, దేవాదుల, భక్త రామదాసు తదితర పెండింగ్‌ ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేసింది. నాగార్జునసాగర్‌, శ్రీరాంసాగర్‌, నిజాంసాగర్‌ తదితర పాత ప్రాజెక్టుల కాల్వలను ఆధునీకరించింది. నదులు, వాగులు, వంకల పునరుజ్జీవం కోసం రూ, 3,825 కోట్ల వ్యయంతో 1200 చెక్‌ డ్యామ్‌ల నిర్మాణం జరుగుతున్నది.
కేంద్రం వివక్ష
కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణ పట్ల పూర్తిగా వివక్షను ప్రదర్శిస్తున్నది. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదు. పైగా ప్రాజెక్టులపై కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ పేరుతో పెత్తనం చేస్తున్నది. అంతేగాక నిర్వహణ కోసం రెం డు తెలుగు రాష్ట్రాలు రూ.200 కోట్లు డిపాజిట్‌ చేయాలని షరతు పెట్టింది. అపెక్స్‌ కౌన్సిల్‌ నిర్వహించకుండా సాగునీటి సమస్యలను పెండింగ్‌లో పెట్టింది.

Spread the love