హామీల అమలు కోసం

– కేంద్ర సర్కారుపై ఐక్య పోరాటాలు
– ఏఐకేఎస్‌ కేంద్ర కమిటీ నిర్ణయం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు కోసం ఐక్య పోరాటాలు నిర్వహించాలని అఖిలభారత కిసాన్‌ సభó (ఏఐకేఎస్‌) నిర్ణయించింది. ఈమేరకు గురువారం తమిళనాడు (కాంచీపురం)లో గురువారం ప్రారంభమైన ఏఐకేఎస్‌ కేంద్ర కమిటీ సమావేశం తీర్మానించింది. కనీస మద్దతు ధరల చట్టం చేస్తాననీ, విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరిస్తామనీ, రైతులపై అక్రమంగా మోపిన కేసులను ఎత్తివేస్తామనీ, పంటల బీమా పథకాన్ని సవరిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని గుర్తు చేసింది. హామీలను పక్కన పెట్టి కార్పొరేట్‌ శక్తులకు వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టేందుకు పూనుకుంటున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. పంటల కొనుగోలు బాధ్యత నుంచి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తప్పుకుంటున్నదని విమర్శించింది. కార్పొరేట్‌ శక్తులకు రాయితీలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం రైతుల రుణాలను మాఫీ చేయడానికి సిద్ధంగా లేదని ఈ సందర్భంగా ఏఐకేఎస్‌ జాతీయ సహాయ కార్యదర్శి టి.సాగర్‌ విమర్శించారు. ప్రజాపోరాటాలపై తీవ్ర నిర్బంధం ప్రయోగిస్తున్నదని విమర్శించారు. రెజ్లర్ల డిమాండ్‌ పరిష్కరించకపోగా ఆందోళన చేస్తున్న మహిళా రెజ్లర్లపై దురుసుగా ప్రవర్తించారని తెలిపారు. కేంద్ర కమిటీ సమావేశానికి హన్నన్‌ మొల్ల అధ్యక్షత వహించారు. జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్‌ భవిష్యత్తు కార్యాచరణను ప్రవేశపెట్టారు. ఈ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్‌, ఆంధ్రప్రదేశ్‌ నుంచి కేంద్ర కమిటీ సభ్యులు వి. కృష్ణయ్య, ప్రభాకర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Spread the love