ఖరీఫ్‌కు ఎంఎస్పీ పెంపు

– ‘బొగ్గు, లిగ్నైట్‌ అన్వేషణ స్కీమ్‌’ కొనసాగింపు
– బీఎస్‌ఎన్‌ఎల్‌కు మూడో పునరుద్ధరణ ప్యాకేజీకి రూ. 89,047 కోట్లు : కేంద్ర మంత్రివర్గం నిర్ణయం
– తక్కువ ఎంఎస్పీతో రైతులకు ద్రోహం.. ఏఐకేఎస్‌ ఉపాధ్యక్షుడు హన్నన్‌ మొల్లా
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
2023-24 మార్కెటింగ్‌ సీజన్‌ కోసం 17 ఉత్పత్తులకు ఖరీఫ్‌ పంటల కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ను పెంచినట్టు కేంద్రమంత్రి పియూశ్‌ గోయల్‌ తెలిపారు. ఈ మేరకు బుధవారం ప్రధాని మోడీ నేతృత్వంలో జరిగిన కేంద్రమంత్రివర్గ సమావేశంలో 2023-24 మార్కెటింగ్‌ సీజన్‌ కోసం ఖరీఫ్‌ పంటల కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కి ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ (సీసీఈఏ) నిర్ణయం తీసుకుంది.
కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఎంఎస్పీ ధరలు
సాధారణ వరి క్వింటాలుకు కనీస మద్దతు ధర 2022-23లో రూ.2,040 ఉండేది. దీనిని 2023-24 కోసం రూ.2,183కు పెంచారు. అంటే రూ.143 పెంచారు. గ్రేడ్‌ ఏ వరి క్వింటాలుకు ఎంఎస్పీని రూ.2,060 నుంచి రూ.143 పెంచి, రూ.2,203 చేశారు. మూంగ్‌ దాల్‌ ఎంఎస్పీని క్వింటాలుకు రూ.7,755 నుంచి రూ.8,558కి పెంచారు. హైబ్రిడ్‌ జొన్నలు క్వింటాలుకు ఎంఎస్పీని రూ.2,970 నుంచి రూ.210 పెంచి, రూ.3,180 చేశారు. రాగులు (చోళ్లు) క్వింటాలుకు రూ.3,578 నుంచి రూ.3,846కు పెంచారు. అంటే రూ.268 పెరిగింది. వేరుశనగలు (పల్లీలు) క్వింటాలుకు రూ.527 పెంచి, రూ.6,377 చేశారు. అంతకు ముందు ఏడాది రూ.5,850 ఉండేది. ప్రత్తికి రూ.6,080 నుంచి రూ.6,620కి పెంచారు. సన్‌ ఫ్లవర్‌ కి రూ.6,400 నుంచి రూ.6,760కి పెంచారు.
‘బొగ్గు, లిగ్నైట్‌ అన్వేషణ స్కీమ్‌’ కొనసాగింపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
15వ ఆర్థిక సంఘం సైకిల్‌తో 2021-22 నుండి 2025-26 కో-టెర్మినస్‌ రూ.2,980 అంచనా వ్యయంతో ”బొగ్గు, లిగ్నైట్‌ అన్వేషణ పథకం” సెంట్రల్‌ సెక్టార్‌ స్కీమ్‌ కొనసాగింపును ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ (సీసీఐఏ) ఆమోదించింది. ప్రమోషనల్‌ (ప్రాంతీయ) అన్వేషణ, నాన్‌-కోల్‌ ఇండియా లిమిటెడ్‌ బ్లాక్‌లలో వివరణాత్మక అన్వేషణ చేస్తారు. ప్రమోషనల్‌ (ప్రాంతీయ) అన్వేషణ కోసం రూ.1,650 కోట్లు, నాన్‌-సీఐఎల్‌ ఏరియాల్లో డిటైల్డ్‌ డ్రిల్లింగ్‌ కోసం రూ.1,330 కోట్లు ఖర్చు చేయనున్నారు. సుమారుగా, 1,300 చదరపు కిలోమీటర్ల ప్రాంతం ప్రాంతీయ అన్వేషణ, దాదాపు 650 చదరపు కిలోమీటర్ల ప్రాంతం వివరణాత్మక అన్వేషణ కింద కవర్‌ చేయబడుతుంది. దేశంలో అందుబాటులో ఉన్న బొగ్గు వనరులను అన్వేషణ, బొగ్గు, లిగ్నైట్‌ కోసం అన్వేషణ అవసరం జరుగుతుంది. బొగ్గు మైనింగ్‌ ప్రారంభించడానికి వివరణాత్మక ప్రాజెక్ట్‌ నివేదికను తయారు చేయడంలో సహాయపడుతుంది. ఈ అన్వేషణతో తయారు చేయబడిన జియోలాజికల్‌ నివేదికలు కొత్త బొగ్గు బ్లాకులను వేలం వేయడానికి ఉపయోగించబడతాయని ప్రభుత్వం తెలిపింది.
బీఎస్‌ఎన్‌ఎల్‌కు మూడో పునరుద్ధరణ ప్యాకేజీకి ఆమోదం
    బీఎస్‌ఎన్‌ఎల్‌కు మూడో పునరుద్ధరణ ప్యాకేజీకి రూ. 89,047 కోట్లకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో ఈక్విటి ఇన్ఫ్యూషన్‌ తో బీఎస్‌ఎన్‌ఎల్‌కు 4జి/5జి స్పెక్ట్రమ్‌ కేటాయింపు ఉంటుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ అధీకృత మూలధనం రూ.1,50,000 కోట్ల నుంచి రూ. 2,10,000 కోట్లకు పెరుగుతుంది. ఈ పునరుద్ధరణ ప్యాకేజీతో దేశంలోని మారుమూల ప్రాంతాలకు కనెక్టివిటీని అందించడంపై దృష్టి సారించిన స్థిరమైన టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్‌గా బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్భవిస్తుంది. కేంద్ర మంత్రివర్గం హుడా సిటీ సెంటర్‌ నుంచి సైబర్‌ సిటీ వరకు స్పర్‌ తో గురుగ్రామ్‌ లోని ద్వారకా ఎక్స్‌ప్రెస్‌ వే వరకు 27 స్టేషన్లతో 28.50 కిలోమీటర్ల మేర మెట్రో కనెక్టివిటీకి ఆమోదం తెలిపింది.
తక్కువ ఎంఎస్పీతో రైతులకు ద్రోహం ఏఐకేఎస్‌ ఉపాధ్యక్షుడు హన్నన్‌ మొల్లా
తక్కువ ఎంఎస్పీ ప్రకటించి రైతులకు మోడీ ప్రభుత్వం ద్రోహం చేసిందని ఏఐకేఎస్‌ ్‌ ఉపాధ్యక్షుడు హన్నన్‌ మొల్లా విమర్శించారు. వరికి క్వింటకు సి2ం50 ప్రకారం రూ.2707.5 ప్రకటించాలని, కాని ప్రభుత్వం ఎంఎస్‌పి రూ.2,183 ప్రకటించిందని, దీనివల్ల రైతులకు రూ. 524.5 నష్టమని తెలిపారు. వేరుశెనగకు సి2ం50 ప్రకారం రూ. 7,411.5 ప్రకటించాల్సి ఉందని, కాని ప్రభుత్వం రూ.6,377 ప్రకటించిందని తెలిపారు. దీనివల్ల క్వింటాల్‌కు రైతులు రూ.1,100.5 నష్టపోతున్నారని పేర్కొన్నారు. మొక్కజొన్నకి సి2ం50 ప్రకారం రూ. 2,569.5 ప్రకటించాల్సి ఉండగా, ప్రభుత్వం రూ. 2,090 ప్రకటించిందని, దీనివల్ల రైతులకు క్వింటాల్‌కు 479.5 నష్టం జరుగుతుందని అన్నారు. పత్తికి సి2ం50 ప్రకారం రూ. 8,095.5 ప్రకటించాల్సి ఉందని, కాని ప్రభుత్వం రూ.6,620 ప్రకటించిందని, దీనివల్ల క్వింటాల్‌కు రూ.1,475.5 నష్టం జరుగుతుందని పేర్కొన్నారు.
2022-23 ధర నిర్ణయంలో నీటిపారుదల ఖర్చులు, ఎరువుల ధరలు తదితరాల పెరుగుదలను పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు. ఒక సంవత్సరం తర్వాత సి2 ఖర్చులు దీని కంటే చాలా ఎక్కువ అని తెలిపారు. సి2ం50 శాతం కంటే తక్కువ ఎంఎస్‌పిని ప్రకటించి ప్రభుత్వం రైతులకు ద్రోహం చేసిందని, ఇది 2023-24 సీజన్‌లో ఖరీఫ్‌ పంటల ధరల విధానంపై నివేదికను స్పష్టం చేయలేదని తెలిపారు. గత ఏడాది కాలంలో ముఖ్యంగా ఎరువులు, ఇతర ఇన్‌పుట్‌లతో పాటు నీటిపారుదల ఖర్చులు పెరిగాయని అన్నారు.

Spread the love