4న రవీంద్రభారతిలో చరిత్ర సదస్సు

– కొత్త తెలంగాణ చరిత్ర బృందం ఆధ్వర్యంలో నిర్వహణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సౌజన్యంతో ‘తెలంగాణా చరిత్ర తొవ్వల్లో మనం-గమ్యం, గమనం’ అనే పేరుతో చరిత్ర సదస్సును జూన్‌ నాలుగో తేదీన నిర్వహిస్తున్నట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్‌ రామోజు హరగోపాల్‌, కార్యనిర్వాహక కార్యదర్శులు బండి మురళీధర్‌రెడ్డి, కట్టా శ్రీనివాస్‌, వేముగంటి మురళీకృష్ణ, బీవీ భద్రగిరీశ్‌ తెలిపారు. ఈ మేరకు వారు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ చరిత్ర సదస్సు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో దీకొండ నర్సింగరావు సభాప్రాంగణంలో తెలంగాణ ప్రాక్చరిత్ర పితామహుడు ఠాకూర్‌ రాజారాంసింగ్‌ వేదిక జరుగుతుందని పేర్కొన్నారు. నాలుగో తేదీన ఉదయం 9:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ హాజరవుతారనీ, ప్రొఫెసర్‌ అలోక్‌ పరాసేన్‌ సందేశం ఇస్తారని తెలిపారు.
అతిథులుగా తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మెన్‌ జూలూరి గౌరీశంకర్‌, తెలంగాణ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ, దక్కన్‌ హెరిటేజ్‌ ట్రస్టు చైర్మెన్‌ ఎం.వేదకుమార్‌, డాక్టర్‌ బండి మురళీధర్‌రెడ్డి, వారసత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఎస్‌.రంగాచార్య, చరిత్రకారులు విరువంటి గోపాలకృష్ణ, కందకుర్తి యాదవరావు, దామరాజు సూర్యకుమార్‌, కుర్రా జితేంద్రబాబు, ఈమని శివనాగిరెడ్డి, రామోజు హరగోపాల్‌ పాల్గొంటారు.
సదస్సులో ఐదు సెషన్లు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. సదస్సులో 20మందికి పైగా తమ చారిత్రక పరిశోధనలపై పత్రసమర్పణ చేయడానికి మన రాష్ట్రంతో పాటు ఢిల్లీ, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు రానున్నారు. ఈ జాతీయ చరిత్ర సదస్సును జయప్రదం చేయాలని కోరారు.

Spread the love